
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు అన్యాయం జరగదని శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఆది వారం ఇక్కడి ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు ఉద్యమనేత, సీఎం కేసీఆర్ వెంట ఉద్యమించిన అంశాలను ప్రస్తావించారు. స్వరాష్ట్రంలో ఉద్యోగులకు అన్యాయం జరగదని, ఉద్యోగుల సమస్యలన్నీ తెలిసిన వ్యక్తి సీఎంగా ఉండటం అదృష్టమన్నారు. ఇటీవలే డీఏ పెంచినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. కొంతమంది స్వార్థపూరిత రాజకీయాల కోసం ఉద్యోగుల్లో చిచ్చుపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, అలాంటివారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు.
గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీలో అర్హులైన వాటాదారులందరికీ ఇళ్ల స్థలా లు వస్తాయన్నారు. కేసీఆర్ కడుపులో తలపెట్టైనా, కాళ్లు పట్టుకునైనా ఇండ్లస్థలాలు ఇప్పిస్తామని భరో సా కల్పించారు. గతంలో విలువైన ప్రాంతాల్లో ఉద్యోగులకు ఇండ్లస్థలాలు ఇప్పించామని, ఇప్పుడు ఈ ప్రాంతాల్లో కోట్ల ధర పలుకుతోందని గుర్తుచేశారు. గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీకి భూమి ఇచ్చినప్పటికీ, ఏపీ ఎన్జీవోల రాజకీయాలకు ఉద్యోగులు బలయ్యారన్నారు. ఉద్దేశపూర్వకంగానే ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. కేటాయించిన భూమి అన్యాక్రాంతం కాకుండా చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం మెమో జారీ చేసిందన్నారు. కార్యక్ర మంలో టీఎన్జీవోస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి, మామిళ్ల రాజేందర్, బి.రేచల్, రామినేని శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment