card కహానీ | Today is Christmas Card Day | Sakshi
Sakshi News home page

card కహానీ

Published Tue, Dec 9 2014 12:10 AM | Last Updated on Sat, Sep 2 2017 5:50 PM

1843నాటి తొలి క్రిస్మస్ కార్డు

1843నాటి తొలి క్రిస్మస్ కార్డు

నేడు  క్రిస్మస్ కార్డ్ డే
 
కంప్యూటర్లు, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక ఈ-తరం మారిపోయింది గానీ, ఇదివరకటి క్రిస్మస్ వేడుకల్లో కార్డులకే క్రేజ్ ఉండేది. కొన్నేళ్లుగా ఈ-కార్డుల జమానా ఊపందుకున్నా, అందరికీ అలవాటైన ఆ కార్డులకు కూడా ఆదరణ లేకుండాపోలేదు. అవి ఇంకా కనుమరుగైపోలేదు. క్రిస్మస్ వేడుకల్లో కేకులే కాదు, కార్డులూ ప్రధానమైనవే. క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఆత్మీయులకు కార్డులు ఇచ్చే ఆనవాయితీ శతాబ్దాల నాటిది. పదిహేనో శతాబ్ది నాటికే యూరోప్‌లో చేతితో తయారు చేసుకున్న కాగితం గ్రీటింగ్ కార్డులు ఇచ్చిపుచ్చుకునే పద్ధతి ఉండేది. ముద్రణ యంత్రం కనుగొన్న చాలా కాలానికి ప్రింటెడ్ గ్రీటింగ్ కార్డులు క్రమంగా వ్యాప్తిలోకి వచ్చాయి. ముద్రణ పరిజ్ఞానంలో వచ్చిన మార్పులు గ్రీటింగ్ కార్డుల్లోనూ ప్రతిఫలించడం మొదలైంది. నేడు క్రిస్మస్ కార్డ్ డే సందర్భంగా ప్రత్యేక కథనం.
 
 కమర్షియల్‌గా క్రిస్మస్ కార్డుల ముద్రణ ప్రారంభమైన తర్వాత అనతి కాలంలోనే వాటికి ప్రపంచవ్యాప్తంగా గిరాకీ ఏర్పడింది. తొలిసారిగా బ్రిటన్‌లో ప్రభుత్వ అధికారి అయిన సర్ హెన్రీ కోలేకు వీటిని ముద్రించి ప్రజలకు విక్రయిస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. కార్డులను అందంగా తీర్చిదిద్దే పనిని తన మిత్రుడైన చిత్రకారుడు జాన్ హార్స్‌లీకి అప్పగించాడు. ఫలితంగా 1843లో తొలి క్రిస్మస్ కార్డు రూపుదిద్దుకుంది. సుమారు వెయ్యిప్రతులు ముద్రిస్తే హాట్‌కేకుల్ల్లా అమ్ముడయ్యాయి. ఒక్కో కార్డును వారు షిల్లింగు ధరకు అమ్మారు. ఇప్పటి లెక్కల ప్రకారం షిల్లింగు విలువ ఐదు పెన్నీలు లేదా ఎనిమిది సెంట్లు.. భారత కరెన్సీలో చెప్పుకోవాలంటే సుమారు ఐదు రూపాయలు మాత్రమే. అయితే, అప్పట్లో రూపాయి విలువలాగే, షిల్లింగు విలువ చాలా ఎక్కువగానే ఉండేది. తొలిసారిగా ముద్రించిన గ్రీటింగ్ కార్డులను ఇప్పటికీ కొందరు భద్రంగా దాచుకున్నారు. వేలం వేసినట్లయితే, ఇప్పుడు వాటి విలువ లక్షల్లో ఉంటుంది.
 
అప్పట్లో సెలవు రోజు

 తొలి క్రిస్మస్ కార్డు రూపకల్పనకు మూడేళ్ల ముందే బ్రిటన్‌లో పెన్నీ పోస్టల్ సర్వీసు మొదలైంది. దూర ప్రాంతాల్లో ఉండే బంధు మిత్రులకు సైతం పంపే వీలు ఉండటంతో గ్రీటింగ్ కార్డుల ముద్రణ శరవేగంగా భారీ పరిశ్రమ స్థాయికి చేరుకుంది. ఇప్పటి అంచనాల ప్రకారం బ్రిటన్ పౌరులు సగటున ఏడాదిలో 55 గ్రీటింగ్ కార్డులు పంపుతారు. అమెరికాలో ఏటా 650 కోట్లకు పైగా గ్రీటింగ్ కార్డులు ఏటా అమ్ముడవుతున్నాయి. పెన్నీ పోస్టల్ సర్వీస్ ద్వారా క్రిస్మస్ కార్డులను పంపేందుకు వీలుగా బ్రిటన్ ప్రభుత్వం ఏటా డిసెంబర్ 9న సెలవు ఇచ్చేది. ఈ సెలవు కొన్ని దశాబ్దాల కిందటి వరకు కూడా కొనసాగింది. అప్పటి నుంచి ఈరోజు క్రిస్మస్ కార్డ్ డేగా వాడుకలోకి వచ్చింది. ఆత్మీయులకు క్రిస్మస్ కార్డులు పంపాలనుకునే వారు ఈరోజు నుంచే ఆ పని ప్రారంభిస్తారు.
  సాక్షి, సిటీప్లస్

 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement