కరువుపై నేడు గవర్నర్ సమీక్ష
♦ బీజేపీ విన్నపం, కేంద్ర కేబినెట్ కార్యదర్శి
♦ ఆరా నేపథ్యంలో సమీక్షకు ప్రాధాన్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరువు పరిస్థితులపై గవర్నర్ నరసింహన్ మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. రాజ్‌భవన్‌లో ఉదయం 11.30 గంటలకు ఈ సమావేశం జరగనుంది. సోమవారం కరువుపై రాష్ట్ర బీజేపీ నేతల విన్నపం... కేంద్ర కేబినెట్ కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ నేపథ్యంలో గవర్నర్ సమీక్ష చేయనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. కరువుపై బీజేపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా 9 బృందాలుగా పర్యటించి గవర్నర్‌కు నివేదిక ఇచ్చారు. రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తోందని నివేదికలో పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర కేబినెట్ కార్యదర్శి కరువుపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
తాగునీరు, పంటల పరిస్థితిపై ఆయన ఆరా తీశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 231 మండలాలను కరువు మండలాలుగా గుర్తించింది. కానీ కరువును ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యల విషయంలో జాప్యం చేస్తోందనే విమర్శలున్నాయి. పంట నష్టపోయిన రైతులను ఆదుకునే దిశగా ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించలేదు. ఇన్‌పుట్ సబ్సిడీని ఇప్పటివరకు చెల్లించకపోవటంతో పాటు తాగునీటి ఎద్దడి, పశు గ్రాసం పంపిణీకి సరైన చర్యలు చేపట్టలేదని విమర్శలు వస్తున్నాయి.