గవర్నర్‌ను కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను బీజేపీ నేతలు లక్ష్మణ్, కిషన్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డిలు కలిశారు. భేటీ అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ..విమోచన దినం అధికారికంగా నిర్వహించాలని ఇప్పటికి 18 సార్లు గవర్నర్‌లను కలిసామని తెలిపారు. తెలంగాణా విమోచన దినం అధికారికంగా నిర్వహించాలని మరోసారి గవర్నర్‌కు విజ్ఞప్తి చేశామన్నారు.
తెలంగాణా ప్రజల త్యాగాలను కేసీఆర్ విస్మరిస్తున్నారని విమర్శించారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ల త్యాగాలు గుర్తించాలన్నారు. మజ్లీస్ పార్టీ ఒత్తిడికి లొంగి టీఆర్‌ఎస్ సర్కార్ విమోచన దినం నిర్వహించటం లేదని విమర్శించారు. 17న నిజామాబాద్‌లో బహిరంగ సభకు కేంద్ర హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ హాజరవుతారని తెలిపారు. పార్టీలుగా చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నపుడు..అధికారికంగా చేయడానికి ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ సమస్యను పట్టించుకోవటం లేదని మండిపడ్డారు.