దశదిశలేని గవర్నర్ ప్రసంగం: రఘువీరారెడ్డి
ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ చేసిన ప్రసంగం ఎలాంటి దశదిశ లేకుండా సాగిందని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి విమర్శించారు. మంత్రిమండలి ఇచ్చిన రాజకీయపత్రం చూసి గవర్నర్ చదివినట్లు కన్పించిందన్నారు. శనివారం ఇక్కడి ఇందిరాభవన్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆ ప్రసంగంలో టీడీపీ ఎన్నికల హామీలు ఎప్పటి నుంచి అమలు చేస్తారో స్పష్టతనివ్వలేదని దుయ్యబట్టారు. ఎమ్మెల్సీలు పునరాలోచించుకోవాలి..ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలను పార్టీలో చేర్చుకొని గెలిచి అధికారంలోకి వచ్చినా టీడీపీ నేతలకు ఇంకా దాహం తీరినట్లు కన్పించడం లేదన్నారు రఘువీరా మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు టీడీపీలో చేరిన విషయాన్ని విలేకరులు ఆయన దృష్టికి తీసుకెళ్లగా పైవిధంగా స్పందించారు. కాంగ్రెస్‌లో పదవులు పొంది టీడీపీలోకి వెళ్లేందుకు రెడీ అయిన వారికి సిగ్గు లేకపోయినా ప్రోత్సహించే వారిని ఏమనాలంటూప్రశ్నించారు.
నవ్యాంధ్ర సాధన దిశగా: బీజేపీ
విభజన తరువాత రాష్ట్రాన్ని నవ్యాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దే దిశగా అసెంబ్లీలో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ప్రసంగం సాగిందని టీడీపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ వ్యాఖ్యానించింది.