మోదీ టీమ్@78 | Modi Team @ 78 | Sakshi
Sakshi News home page

మోదీ టీమ్@78

Published Wed, Jul 6 2016 1:21 AM | Last Updated on Thu, Mar 28 2019 8:37 PM

మోదీ టీమ్@78 - Sakshi

మోదీ టీమ్@78

ఐదుగురిపై వేటు.. 19 మందికి చోటు
 
- భారీగా కేంద్ర మంత్రివర్గ విస్తరణ.. 64 నుంచి 78కి పెరిగిన మంత్రుల సంఖ్య
- ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్‌లో జరగనున్న ఎన్నికల ప్రభావం
- కేబినెట్‌లో దళిత, బీసీ, గిరిజన వర్గాలకు పెరిగిన ప్రాధాన్యం
- జవదేకర్ ఒక్కరికే పదోన్నతి.. ఐదుగురు సహాయమంత్రులపై వేటు
- ఎం.జె.అక్బర్, రామ్‌దాస్ సహా కొత్త మంత్రులంతా సహాయమంత్రులే
 
 సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర కేబినెట్‌లో 19 మంది కొత్త వారికి చోటు కల్పిస్తూ.. ఐదుగురిని తొలగిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న ఎన్నికలు; దళితులు, వెనుకబడిన వర్గాల వారిలో పార్టీని బలోపేతం చేసుకోవటం లక్ష్యంగా సామాజిక సమీకరణాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు 64 మందిగా ఉన్న మంత్రివర్గ సభ్యుల సంఖ్య తాజా విస్తరణతో ప్రధానితో కలిపి 78కి పెరిగింది. ఇది రాజ్యాంగం అనుమతించిన కేబినెట్ సభ్యుల గరిష్ట సంఖ్య(మొత్తం లోక్‌సభ సభ్యుల సంఖ్యలో 15 శాతం) కన్నా కేవలం నాలుగు తక్కువ. ఇప్పటివరకు స్వతంత్ర సహాయమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఒక్కరికే పదోన్నతినిస్తూ కేబినెట్ హోదా కల్పించారు.

కేబినెట్‌లో జవదేకర్‌తో కలిపి మంత్రివర్గంలో కేబినెట్ హాదా ఉన్న మంత్రుల సంఖ్య 27కు చేరింది. వాణిజ్య మంత్రి నిర్మలాసీతారామన్, విద్యుత్‌శాఖ మంత్రి పీయూష్‌గోయల్‌లకు కూడా స్వతంత్ర హోదా నుంచి కేబినెట్ హోదాకు పదోన్నతి లభిస్తుందని వార్తలొచ్చిన అలా జరగలేదు. తాజా విస్తరణలో బీజేపీ నేతలు, ఎస్.ఎస్.అహ్లూవాలియా, ఎం.జె.అక్బర్, విజయ్‌గోయల్ సహా కొత్తగా చేర్చుకున్న 19 మందికీ సహాయ మంత్రుల హోదా ఇచ్చారు. వీరిలో 13 మంది లోక్‌సభ సభ్యులు, ఆరుగురు రాజ్యసభ సభ్యులు. ఈ 19 మందిలో విజయ్‌గోయల్, ఫగన్‌సింగ్‌కులస్తే, ఎస్.ఎస్. అహ్లూవాలియాలు గతంలో కేంద్ర మంత్రులుగా పనిచేసిన వారే.

మిగిలిన 16 మందీ కేంద్ర సర్కారుకు కొత్తవారు. ఈ 19 మందితో మంగళవారం రాష్ట్రపతిభవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి హమీద్‌అన్సారీ, ప్రధాని మోదీ, ఆయన మంత్రివర్గ సహచరులు, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, ఎన్‌డీఏ పక్షాల నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్‌నుంచి ఎవరూ హాజరుకాలేదు. కేంద్ర కేబినెట్ నుంచి వైదొలగిన ఐదుగురి రాజీనామాలను మోదీ సూచనపై ఆమోదించినట్లు రాష్ట్రపతిభవన్ తెలిపింది.

 ఎన్నికలు.. సామాజిక సమీకరణాలు...
 వచ్చే ఏడాది జరుగనున్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల  అసెంబ్లీ ఎన్నికలు, ఆ మరుసటి ఏడాది జరుగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టితో పాటు.. పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ మరింత బలపడటం లక్ష్యంగా ఈ విస్తరణ చేపట్టినట్లు అవగతమవుతోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌కు తాజాగా మూడు సహాయ మంత్రి పదవులు కేటాయించటం విశేషం. దీంతో ఆ రాష్ట్రం నుంచి కేబినెట్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రుల సంఖ్య 16కు పెరిగింది. యూపీ నుంచి బ్రాహ్మణ వర్గానికి (మహేంద్రనాథ్ పాండే) ఒకటి, ఓబీసీ వర్గానికి(అనుప్రియా పటేల్) ఒకటి, ఎస్సీ వర్గానికి (కృష్ణరాజ్) ఒకటి పదవులు కేటాయిస్తూ అన్ని వర్గాల వారినీ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే అదే రాష్ట్రం నుంచి కేబినెట్‌లో ఉన్న ఎస్సీ సామాజికవర్గ నేత శంకర్ కటేరియాను మంత్రివర్గం నుంచి తప్పించారు.

నకిలీ డిగ్రీ కలిగి ఉన్నారని స్థానికంగా బీఎస్‌పీ, ఆప్ పార్టీలు ఆయనపై ఆరోపణలు చేశాయి. అలాగే.. ఉత్తరాఖండ్ ఎన్నికలపై దృష్టితో అల్మోరాకు చెందిన దళిత నాయకుడు అజయ్ టామ్టాను కేబినెట్‌లోకి తీసుకున్నారు.గుజరాత్ నుంచి పటేల్ సామాజిక వర్గానికి చెందిన మన్‌సుఖ్ మండవీయకు, కుశ్వహ సామాజిక వర్గానికి చెందిన పరుషోత్తం రుపాలాకు చోటు కల్పించారు. అసోంలో తరుణ్ గొగోయ్ సామాజిక వర్గానికి చెందిన రాజేన్ గొహైన్‌కు చోటు కల్పించారు. రాజేన్ గొహైన్ సామాజిక వర్గమైన అహోం సామాజికవర్గం అసోంలో కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంటుందన్న పేరుంది. రాజస్తాన్ నుంచి జాట్ నాయకుడు సి.ఆర్.చౌదరిని కేబినెట్‌లో చేర్చుకున్నారు.కొత్త మంత్రుల్లో ఏడుగురు దళితులు ఉన్నారు.

ఎన్‌డీఏ మిత్రపక్షంగా ఉన్న రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్‌పీఐ) నేత, మహారాష్ట్రలో దళిత నాయకుడు రామ్‌దాస్ అథవాలేను కూడా మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అలాగే కొత్త మంత్రుల్లో అజయ్ టమ్టా (ఉత్తరాఖండ్), కృష్ణరాజ్ (ఉత్తరప్రదేశ్), రమేశ్ చందప్ప (కర్ణాటక), అర్జున్‌రామ్ మేఘవాల్ (రాజస్తాన్)లు కూడా దళిత నాయకులు. ఇక గిరిజన సామాజిక వర్గం నుంచి జశ్వంత్‌సింగ్ భాబోర్ (గుజరాత్), ఫగన్‌సింగ్ కులస్తే (మధ్యప్రదేశ్)లకు చోటు కల్పించారు. మొత్తంగా తాజా విస్తరణలో రాజస్తాన్ నుంచి నలుగురు, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్‌ల నుంచి ముగ్గురేసి చొప్పున, మహారాష్ట్ర నుంచి ఇద్దరు.. కొత్త వారికి చోటు లభించింది. ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్, అసోం, జార్ఖండ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా ఒక్కొక్కరికి స్థానం లభించింది. ప్రభుత్వంలోకి మరింత అనుభవం, నైపుణ్యం, శక్తిని చేర్చటం లక్ష్యంగా ఈ విస్తరణ చేపట్టినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఆదరణ లభించిన రాష్ట్రాలకు, త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాలకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో తగినంత ప్రాతినిధ్యం లభించిందని పార్టీ వర్గాలు అన్నాయి.
 
 పేరు మరిచిపోయిన అఠావలే...
 అఠావలే తన పేరును చెప్పటం మరిచిపోవటంతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గుర్తుచేసి చెప్పించారు. దీనికి అఠావలే.. రాష్ట్రపతిని క్షమాపణలు కోరారు. అంతే కాదు.. ప్రమాణ స్వీకార పత్రాన్ని చదవటంలోనూ అఠావలే ఇబ్బందులు పడ్డారు. వీటిని కూడా రాష్ట్రపతి సరిదిద్దారు.
 
 సంబరాలు కొన్ని గంటలే..
‘ఉత్సవాలు జరుపుకోవడానికి మీకు మిగిలింది కొన్ని గంటలే. ఆ తరువాత విధుల్లోకి దిగాల్సిందే’.. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం ప్రధాని మోదీ వారికిచ్చిన సందేశం ఇది. నిజాయితీ, అంకితభావంతో దేశాభివృద్ధి కోసం కష్టించి పని చేయాలని వారికి మోదీ ఉద్బోధించారు. దేశప్రజలందరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనం చేకూరేలా చూడాలన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం కొత్త మంత్రులతో మోదీ అరగంట పాటు భేటీ అయ్యారు.
 
 కొత్త కేంద్ర మంత్రుల వివరాలు...
 విజయ్ గోయల్ (62, రాజ్యసభ, రాజస్తాన్): ఢిల్లీ బీజేపీ సీనియర్ నేత. నాలుగు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. వాజ్‌పేయి హయాంలో యువజన వ్యవహారాలు, క్రీడలు, కార్మిక, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఢిల్లీ వర్సిటీలో ఎల్‌ఎల్‌బీ, శ్రీరాం కాలేజ్ ఆప్ కామర్స్‌లో ఎం.కాం చేశారు.

 ఎస్.ఎస్.అహ్లువాలియా (65, లోక్‌సభ, డార్జిలింగ్): పట్నాకు చెందిన ఈ సీనియర్ నేత పీవీ నరసింహరావు కేబినెట్‌లో మంత్రి. బీజేపీలో చేరాక ఆ పార్టీకి ఎన్నో విధాల సాయపడ్డారు. 2జీ స్కాం సమయంలో జేపీసీ సభ్యుడిగా కీలక పాత్ర పోషించారు. బిహార్, జార్ఖండ్ నుంచి 4 సార్లు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు.


ఎం.జె.అక్బర్ (65, రాజ్యసభ, మధ్యప్రదేశ్): జర్నలిస్టుగా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన అక్బర్ బిహార్ నుంచి ఎంపీగా గెలుపొందారు.   తర్వాతకాంగ్రెస్  నాయకత్వంపై గాంధీ కుటుంబ ఆధిపత్యాన్ని విమర్శిస్తూ బీజేపీ దగ్గరయ్యారు.  

 అనుప్రియ పటేల్ (35, లోక్‌సభ, మీర్జాపూర్) : ఢిల్లీలోని లేడీ శ్రీరాం కాలేజీలో చదివిన అనుప్రియ 2012లో యూపీ ఎమ్మెల్యేగా తొలిసారి గెలుపొందారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మీర్జాపూర్ నుంచి అప్నాదళ్ పార్టీ నుంచి గెలుపొందారు. బీజేపీ మిత్రపక్షమైన అప్నాదళ్‌కు యూపీ ఓబీసీల్లో మంచి పట్టుంది. దీంతో అనుప్రియ పటేల్‌కు కేంద్ర మంత్రి ఇస్తే వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో లాభపడవచ్చని బీజేపీ అంచనా.   

 రాందాస్ అఠావలే (56, రాజ్యసభ, మహారాష్ట్ర) : మహారాష్ట్రకు చెందిన ప్రముఖ దళిత నేత. ఎన్డీఏ మిత్రపక్షం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(అఠావలే) చీఫ్. ట్రేడ్ యూనియన్ నేత. 2011లో ఎన్సీపీ- కాంగ్రెస్ కూటమి నుంచి విడిపోయి ఎన్డీఏతో జట్టుకట్టారు. 1990లో మహారాష్ట్ర ఎమ్మెల్సీగా ఎన్నికై అనంతరం మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1998, 1999, 2004 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు.  

 అనిల్ మాధవ్ దవే (59, రాజ్యసభ, మధ్యప్రదేశ్) : పర్యావరణ వేత్త అయిన అనిల్ మాధవ్ దవే ... ఆ అంశాలపై పలు రచనలు చేశారు. 2009 నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.

 అర్జున్ రామ్ మేఘ్‌వాల్ (65, లోక్‌సభ, బికనీర్) : రాజస్తాన్ బికనీర్ జిల్లాలో చేనేత కుటుంబంలో జన్మించిన మేఘ్‌వాల్ టెలిఫోన్ ఆపరేటర్‌గా పనిచేస్తూ న్యాయవాద విద్య పూర్తి చేశారు.  2009లో బికనీర్ నుంచి లోక్‌సభకు మొదటిసారిగా ఎన్నికయ్యారు.  

 పీపీ చౌదరీ (63, లోక్‌సభ, పాలీ) : సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది... మొదటిసారి రాజస్తాన్‌లోని పాలి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 11 వేల కేసులు వాదించారు.   
 అజయ్ టామ్టా (43, లోక్‌సభ, అల్మోరా) : ఉత్తరాఖండ్‌లో జిల్లా పంచాయతీ సభ్యుడిగా రాజకీయ జీవితం ప్రారంభించారు. తొలిసారి లోక్‌సభకు ఎన్నికైన టామ్టా 2007- 2009 మధ్య  రాష్ట్ర మంత్రి.
 మహేంద్ర నాథ్ పాండే (58, లోక్‌సభ, చందౌలీ) : ఉత్తరప్రదేశ్ బ్రాహ్మణ వర్గ నేత. చందౌలీ నుంచి తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. యూపీలో కీలకంగా ఉన్న బ్రాహ్మణ ఓట్లను ఆకర్షించేందుకు పాండేను కేబినెట్‌లోకి తీసుకున్నారు.    
 ఫగన్ సింగ్ కులస్తే (57, లోక్‌సభ, మాండ్లా) : మధ్యప్రదేశ్ గిరిజన నేత. ఐదు సార్లు లోక్‌సభకుకు, ఓసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. వాజ్‌పేయి హయాంలో  సహాయ మంత్రి.
 కృష్ణారాజ్ (49, లోక్‌సభ, షాజహన్‌పూర్) : తొలిసారి లోక్‌సభకు ఎంపికైన కృష్ణరాజ్ యూపీ దళిత నాయకురాలు. రోహిల్‌ఖండ్ ప్రాంతానికి చెందిన కృష్ణరాజ్‌కు మంత్రి పదవి ద్వారా ఎస్సీ వర్గాల్లో పట్టు పెంచుకోవాలని ఎన్డీఏ భావిస్తోంది.
 సుభాష్ బమ్రే (62, లోక్‌సభ, ధులే) : కేన్సర్ వ్యాధి నిపుణుడు. మహారాష్ట్ర నుంచి రావ్‌సాహెబ్ దన్వే కేబినెట్ నుంచి తప్పుకోవడంతో ఆయన స్థానంలో చోటు కల్పించారు.   
 సీఆర్ చౌదరీ (68, లోక్‌సభ, నాగౌర్) : తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు.  2014లో నాగౌర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున గెలుపొందారు.
 పురుషోత్తమ్ ఖోడాభాయ్ రూపాలా (61, రాజ్యసభ, గుజరాత్) :  గుజరాత్‌లో కడ్వా పటీదార్ వర్గానికి చెందిన నేత. మోదీ సీఎంగా ఉన్న సమయంలో మంత్రిగా పనిచేశారు. 2008లో రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. 2016 జూన్‌లో మళ్లీ  రాజ్యసభ ఎంపీగా గెలుపొందారు.
 జస్వంత్‌సింహ్ భాభోర్  (49, లోక్‌సభ, దహోడ్) : మధ్య గుజరాత్‌లో గిరిజన నాయకుడు.  లింఖేడా అసెంబ్లీ స్థానం నుంచి ఐదు సార్లు గెలుపొందారు.
 రమేష్ సి జిగజినాగి (64, లోక్‌సభ, బిజాపూర్) : కర్ణాటక బీజేపీలో ముఖ్యమైన దళిత నేత. రాష్ట్ర మంత్రిగా పనిచేశారు.  2004లో బీజేపీలో చేరారు. 1996లో మాండ్లా లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందిన ఆయన 2009 వరకూ ఓటమి చెందలేదు.  
 రాజైన్ గొహైన్ (65, లోక్‌సభ, నౌగాంగ్ ):  1980లో జరిగిన ఆల్ అస్సాం స్టూడెంట్స్ మూమెంట్‌లో చురుగ్గా పాల్గొన్నారు. 1991లో బీజేపీలో చేరారు.  
 మన్షుక్ మాండవీయ (44, రాజ్యసభ, గుజరాత్) : పటేల్ వర్గనేత. ఇటీవల పటేళ్ల ఆందోళనతో ఆ వర్గంలో కోల్పోయిన పట్టు పెంచుకునేందుకు బీజేపీ మన్షుక్‌కు అవకాశం కల్పించింది.  డిసెంబర్, 2017లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ఉండడం కూడా ఆయన అదృష్టానికి కారణం. మన్షుక్ విద్యార్థి దశ నుంచి ఏబీవీపీలో చురుగ్గా ఉండేవారు.
 
 యువరక్తం.. విద్యావంతం..!
 కొత్త మంత్రుల్లో ఐదుగురు యాభై ఏళ్ల లోపువారే ఉండటం విశేషం. ముఖ్యంగా యూపీ నుంచి తీసుకున్న అనుప్రియాపటేల్ వయసు కేవలం 35 సంవత్సరాలే. అజయ్‌టామ్టా (43), మన్‌సుఖ్‌భాయ్ మాండవీయ (44), కృష్ణరాజ్ (49), జశ్వంత్‌సిన్హ్ భభోర్ (49)లు కూడా యువరక్తమే. అలాగే.. కొత్తవారిలో ఒక న్యాయవాది, ఒక కంటి సర్జన్, ఒక పీహెచ్‌డీ విద్యాధికుడు ఉన్నారు. వీరుగాక.. ఐదుగురు న్యాయవిద్య పట్టభద్రులు, నలుగురు పోస్ట్-గ్రాడ్యుయేట్ పట్టభద్రులు, ఐదుగురు పట్టభద్రులు ఉంటే.. కేవలం ఇద్దరు మాత్రమే డిగ్రీ కన్నా తక్కువ విద్యాభ్యాసం గల వారు ఉన్నారు.
 
 ప్రతిపక్షాల విమర్శలు...
 కనిష్ట కేబినెట్ - గరిష్ట పాలన అన్న నినాదాన్ని తరచూ వల్లె వేసిన బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఆ హామీ ఏమైందో చెప్పాలని ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. మన్మోహన్‌సింగ్ మంత్రివర్గం కంటే ఎక్కువ మంది మంత్రులు మోదీ మంత్రివర్గంలో ఉన్నారంటూ కాంగ్రెస్ ధ్వజమెత్తింది. టీం మోదీలో ఆయన భజనపరులు, సరిగా పనిచేయలేనివారు, ఇతరులను ద్వేషించేవారికే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా అన్నారు. ‘తక్కువ ప్రభుత్వం, ఎక్కువ పాలన’ అన్న మోదీ సూత్రం ఇప్పుడేమైందని ఆయన ఎద్దేవా చేశారు. కేంద్ర కేబినెట్ విస్తరణ యూపీ ఎన్నికల ముందు బీజేపీ ఆడుతున్న డ్రామా అని బీఎస్పీ చీఫ్ మాయావతి అన్నారు. వెనుకబడిన తరగతులనుంచి ఇద్దరికి మంత్రి పదవి ఇచ్చినంద మాత్రాన దళితులంతా బీజేపీ వెంట నడుస్తారనుకోవటం పొరపాటన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement