మీకు జరిగిన అవమానం మాటేమిటి?
గుణ, ఛత్తర్‌పూర్: కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని చిత్తు కాగితంలా చింపి, పారేయాలంటూ వ్యాఖ్యానించి.. ప్రధానిని, మంత్రివర్గాన్ని అవమానించిన రాహుల్‌గాంధీని వదిలేసి బీజేపీని విమర్శించడమేమిటని గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ ప్రశ్నించారు. ముందు మీకు జరిగిన అవమానం సంగతి చూసుకోవాలని ప్రధాని మన్మోహన్‌కు సూచించారు. రాజకీయాలను కాంగ్రెస్ పార్టీయే దిగజారుస్తోందని మండిపడ్డారు. సోమవారం మోడీ మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్‌పూర్‌లో ఆయన ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు.
రాజకీయ చర్చ స్థాయిని బీజేపీ దిగజార్చిందంటూ ఇటీవల ప్రధాని మన్మోహన్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘‘ముందు రాహుల్‌గాంధీ అవమానించిన సంగతిని గూర్చి ప్రధాని ఆలోచించాలి. కళంకిత ఎంపీల అంశంపై కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన ఆర్డినెన్స్‌ను ‘ఒక మతిలేని పని’ అంటూ రాహుల్ కొట్టిపారేశారు. దానిని చించేయాలన్నారు. మిమ్మల్ని, మొత్తం మంత్రివర్గాన్ని అవమానించింది మీ పార్టీ ఉపాధ్యక్షుడే’’ అని మోడీ పేర్కొన్నారు. రాహుల్ వ్యాఖ్యలు మన్మోహన్‌కు చెంపదెబ్బ వంటివని వ్యాఖ్యానించారు. అంతేగాకుండా రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలతో దేశంలోని ప్రజాస్వామ్య సంస్థల గౌరవానికి భంగం కలిగిస్తున్నారని మోడీ ఆరోపించారు. ‘‘ప్రధాన ప్రతిపక్షం బీజేపీని దొంగల పార్టీ అంటూ రాహుల్ విమర్శించారు. గత పార్లమెంటు సమావేశాల్లో ప్రధానిని నిందిస్తూ ‘చోర్, చోర్’ అనే నినాదాలు వినిపించాయి. ఏదేశ పార్లమెంటులోనైనా ఇలా జరుగుతుందా?’’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎలాంటి తప్పుడు ఆరోపణలను ప్రచారం చేసినా.. అవి బీజేపీపై ప్రభావం చూపించలేవని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్లుగా ఓటర్లను ప్రలోభపెడుతోందని, దేశ ప్రజలను విడదీస్తోందని మోడీ ఆరోపించారు. అది వారి రక్తంలోనే ఉందని, ఇప్పటికీ అవే విభజన రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు.
దోమలకు అభినందనలు..
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని కుట్టే ధైర్యం చేసిన దోమలకు అభినందనలు చెబుతున్నానని మోడీ ఎద్దేవా చేశారు. 2009లో మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతంలో పర్యటించినప్పుడు దోమలు తనను తెగ కుట్టాయని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. ప్రస్తుతం అదే ప్రాంతంలో ప్రచారంలో ఉన్న మోడీ దానిపై స్పందిస్తూ.. ‘రాహుల్‌ను కుట్టేందుకు ధైర్యం చేసిన దోమలకు నేను అభినందనలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే గత వందేళ్లలో ఆయన కుటుంబసభ్యులను ఎవరూ తాకలేకపోయారు. కనీ సం వారి కుటుంబానికి వ్యతిరేకంగా ఎవరేం మాట్లాడినా.. వారి అనుచరులు వదిలిపెట్టరు’ అని అన్నారు.
బుల్లెట్‌ప్రూఫ్ ఎన్‌క్లోజర్ ఏర్పాటు చేసినా...
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో సోమవారం పాల్గొన్న మోడీ, బుల్లెట్‌ప్రూఫ్ ఎన్‌క్లోజర్ ఉన్నప్పటికీ బహిరంగ వేదిక పైనుంచే ప్రసంగించారు.