రేపు బస్సులు, ఆటోలు బంద్
సార్వత్రిక సమ్మెకు సిద్ధం
మెజారిటీ కార్మిక సంఘాల మద్దతు
సిటీబ్యూరో: జాతీయ రహదారి భద్రతా బిల్లుకు వ్యతిరేకంగా తలపెట్టిన సార్వత్రిక సమ్మెతో సెప్టెంబర్ 2న (బుధవారం) నగరంలో సిటీబస్సులు, ఆటోలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. దేశవ్యాప్తంగా జరుగనున్న ఈ సమ్మెను నగరంలో విజయవంతం చేసేందుకు మెజారిటీ ఆర్టీసీ, ఆటో కార్మిక సంఘాలు సన్నద్ధమయ్యాయి. దీంతో గ్రేటర్ హైదరాబాద్‌లోని 3,800 సిటీ బస్సులు, 1.20 లక్షలకు పైగా ఆటో రిక్షాలు తిరిగే అవకాశం లేదు. ఆర్టీసీ ప్రధాన కార్మిక సంఘాలైన ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్‌లు సమ్మెలో పాల్గొంటున్నట్టు తెలిపాయి.
కార్మికులంతా స్వచ్ఛందంగా పాల్గొనాలని ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అశ్వథ్థామరెడ్డి ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ, తెలంగాణ ఆటో డ్రైవర్ల సంక్షేమ సంఘం,తదితర కార్మిక సంఘాలు సమ్మెకు మద్దతుగా నగరంలో ఆటోల బంద్‌కు పిలుపునిచ్చాయి. సమ్మెలో భాగంగా బాగ్‌లింగంపల్లి సుందరయ్య పార్కు నుంచి ఇందిరా పార్కు వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆటో సంఘాల నేతలు బి.వెంకటేశ్, ఎ.సత్తిరెడ్డి, నరేందర్ తదితరులు తెలిపారు. ఆటో కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని... ఈ చలానాలు రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.