సమ్మె కారణంగా కోల్‌కతా నిర్మానుష్యంగా మారిన రహదారులు
దేశవ్యాప్తంగా సమ్మె కట్టిన కార్మికులు.. ఆగిన జనజీవనం
కేంద్రం విధానాలకు వ్యతిరేకంగా 10 కేంద్ర కార్మిక సంఘాల పిలుపు
* 15 కోట్ల మంది కార్మికుల సమ్మె.. స్తంభించిన రవాణా.. పోస్టల్, బీఎస్‌ఎన్‌ఎల్ సేవలపై ప్రభావం
* సగానికి తగ్గిన బొగ్గు ఉత్పత్తి.. సార్వత్రిక సమ్మెకు అనూహ్య స్పందన: కార్మిక సంఘాల హర్షం
* దేశంలో సమ్మె ప్రభావం స్వల్పమే: కేంద్ర ప్రభుత్వం ప్రకటన
న్యూఢిల్లీ: కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం జరిగిన దేశవ్యాప్త సమ్మె.. వివిధ ప్రాంతాల్లో ప్రజా జీవనంపై ప్రభావం చూపింది.
బొగ్గు ఉత్పత్తి, బ్యాంకు లావాదేవీలు, రవాణా సేవలు దాదాపుగా స్తంభించిపోయాయి. సమ్మె సందర్భంగా పశ్చిమబెంగాల్‌లో ముర్షీదాబాద్ జిల్లా సహా పలు చోట్ల అధికార తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు, వామపక్షాల కార్యకర్తల మధ్య ఘర్షణలు తలెత్తటంతో దాదాపు వేయి మందిని అరెస్ట్ చేశారు. కార్మిక చట్టాల్లో మార్పులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణలను వ్యతిరేకిస్తూ, తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కేంద్ర ట్రేడ్ యూనియన్లు ఇచ్చిన ఈ సమ్మె పిలుపుతో పదిహేను కోట్ల మందికి పైగా సంఘటిత రంగ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారని ఆయా సంఘాల నేతలు పేర్కొన్నారు.
కేంద్రంలో అధికార బీజేపీ అనుబంధ కార్మిక సంస్థలయిన బీఎంఎస్, ఎన్‌ఎఫ్‌ఐటీయూలు సమ్మెకు దూరంగా ఉన్నాయి. సమ్మె ప్రభావం పశ్చిమబెంగాల్, త్రిపుర, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి, ఒడిశా తదితర ప్రాంతాల్లో అధికంగా కనిపించగా.. ఢిల్లీ, పంజాబ్, హరియాణా, తమిళనాడు, గోవా, గుజరాత్, బిహార్, జార్ఖండ్‌లలో పాక్షికంగా కనిపించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అస్సాం, రాజస్థాన్‌లలో సాధారణ ప్రజాజీవనంపై సమ్మె ప్రభావం చూపించింది.
దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో మాత్రం.. బ్యాంకుల కార్యకలాపాల్లో మినహా పెద్దగా ప్రభావం లేదు. అయితే ముంబై పోర్టు ట్రస్టులో కార్యకలాపాలూ పూర్తిగా స్తంభించాయి. ప్రభుత్వ నిర్వహణలోని కోల్ ఇండియా సంస్థ రోజు వారీ 17 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తుండగా.. బుధవారం సమ్మె కారణంగా అది సగానికి పడిపోయింది. దేశవ్యాప్తంగా గల 4 లక్షల మంది బొగ్గు కార్మికుల్లో అధికభాగం సమ్మెలో పాల్గొన్నారు. తెలంగాణలోని సింగరేణి కాలరీస్‌లో సమ్మె సంపూర్ణమైంది. ఎన్‌ఎండీసీ పైనా సమ్మె ప్రభావం చూపింది. దాదాపు 4,200 మంది కార్మికులు సమ్మె చేయటంతో ఇనుప ఖనిజం ఉత్పత్తి 75,000 టన్నులు పడిపోయింది. విద్యుత్ ఉత్పత్తి, ఇతర సేవలు అధికశాతం సాధారణంగానే కొనసాగాయి.
ప్రజల భ్రమలు తొలగిపోయాయి: ట్రేడ్ యూనియన్లు
సమ్మె పిలుపుకు అనూహ్య స్పందన లభించిందని.. లక్షలాది మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారని పది ట్రేడ్ యూనియన్లు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. హరియాణా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లతో పాటు పలు ఇతర రాష్ట్రాల్లో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థల బస్సులు నిలిచిపోయాయని.. రక్షణ ఉత్పత్తి రంగంలోనూ 5 లక్షల మంది సమ్మెలో పాల్గొన్నారని పేర్కొన్నాయి. పోస్టల్ సేవలు, బీఎస్‌ఎన్‌ఎల్ టెలికాం కార్యకలాపాలపైనా సమ్మె ప్రభావం చూపిందని తెలిపాయి.
‘‘ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాల పట్ల, ఆహార ధరలను నియంత్రించటంలో వైఫల్యం పట్ల, ఆర్థిక మందగమనాన్ని నిరోధించటంలో వైఫల్యం పట్ల ప్రజలు ఎంతగా భ్రమలు కోల్పోయి ఉన్నారో ఈ సమ్మె చూపుతోంది. కొన్ని ప్రాంతాల్లో బీఎంఎస్ వాళ్లు కూడా సమ్మెలో పాల్గొన్నారు’’ అని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి గురుదాస్‌దాస్‌గుప్తా పేర్కొన్నారు. పశ్చిమబెంగాల్‌లో సమ్మెను విఫలం చేయటానికి మమతా బెనర్జీ ప్రభుతవ అప్రజాస్వామిక చర్యలకు పాల్పడిందని వామపక్షాలు మండిపడ్డాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలు ఈ సమ్మెకు పిలుపునివ్వగా.. కేంద్రంలోని అధికార బీజేపీకి తనను విలువైన మిత్రపక్షంగా చూపుకునేందుకు సీఎం మమత ఈ సమ్మెను వ్యతిరేకించారని విమర్శించాయి.
ఆశ్రీత పెట్టుబడుదారుల కోసమే మోదీ సర్కారు: కాంగ్రెస్
సమ్మెకు ప్రతిపక్ష కాంగ్రెస్ సంఘీభావం తెలిపింది. కార్మికుల ఆందోళన పట్ల ప్రభుత్వం సానుభూతిగా లేదని విమర్శించింది. ‘‘దేశంలోని లక్షలాది మంది కార్మికులను పణంగా పెట్టి ఈస్ట్ ఇండియా కంపెనీకి ప్రయోజనం కలిగించాలనుకున్న బ్రిటిష్ వాళ్ల తరహాలోనే.. ప్రభుత్వానికి మిత్రులుగా ఉన్న ఐదారుగురు ఆశ్రీత వ్యాపారులకు ప్రయోజనం కలిగించాలని మోదీ ప్రభుత్వం కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది’’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్‌సింఘ్వీ విలేకరులతో వ్యాఖ్యానించారు.
సమ్మె ప్రభావం స్వల్పమే: కేంద్రం
కార్మిక సంఘాల సమ్మె ప్రభావం దేశంలోని చాలా ప్రాంతాల్లో పెద్దగా ప్రభావం చూపలేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. కార్మిక సంఘాలు చేస్తున్న 12 డిమాండ్లలో 9 డిమాండ్ల విషయంలో వారి ఆకాంక్షలను నెరవేర్చేందుకు సిద్ధమంటూ సంకేతాలిచ్చింది. మొత్తం 12 కేంద్ర కార్మిక సంఘాల్లో రెండు సంఘాలు సమ్మెలో పాల్గొనలేదని, మూడు సంఘాలు తటస్థంగా ఉన్నాయని.. కేవలం ఏడు సంఘాలు మాత్రమే సమ్మెకు వెళ్లాయని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
దీనినిబట్టి.. కార్మికులు తమ డిమాండ్లను చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోందని వ్యాఖ్యానించింది. ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తగినన్ని బొగ్గు నిల్వలు ఉన్నందున.. సమ్మె ప్రభావం పెద్దగా ఉండబోదని బొగ్గు, విద్యుత్ శాఖ మంత్రి పియూష్‌గోయల్ పేర్కొన్నారు. మొత్తంగా సమ్మె వల్ల కీలకమైన ప్రభావం ఏమీ లేదని చమురు శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ వ్యాఖ్యానించారు. కార్మికులు, దేశ ప్రయోజనాల రీత్యా ఆందోళనను విరమించాలని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారుదత్తాత్రేయ మంగళవారం కార్మిక సంఘాలకు విజ్ఞప్తిచేశారు. ఆయన, కార్మికశాఖ కార్యదర్శి శంకర్ అగర్వాల్‌తో కలిసి టర్కీలో జీ-20 సమావేశంలో పాల్గొనేందుకు బుధవారం బయల్దేరి వెళ్లారు.
బెంగాల్‌లో ఘర్షణలు.. వేయి మంది అరెస్ట్
కోల్‌కతా: కార్మికుల సార్వత్రిక సమ్మె నేపథ్యంలో పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ - వామపక్షాల కార్యకర్తల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ప్రధానంగా ముర్షీదాబాద్ జిల్లాలోని బెర్హాంపూర్, దోమ్కాల్‌లలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలోని పలు ఇతర ప్రాంతాల నుంచి చిన్నపాటి ఘర్షణల వార్తలు వచ్చాయి. ముర్షీదాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రాళ్లు విసురుకోవటం, స్వల్ప తీవ్రత గల బాంబులు విసురుకోవటం వంటి ఘటనలూ జరిగినట్లు పోలీసులు తెలిపారు.
తమ పార్టీ ప్రదర్శనపై తృణమూల్ కార్యకర్తలు దాడి చేయటంతో పార్టీ మాజీ ఎంపీ మొయినుల్‌హసన్‌తో పాటు 15 మంది గాయపడ్డారని సీపీఎం పేర్కొంది. అయితే.. తృణమూల్ జిల్లా అధ్యక్షుడు మనన్నన్ హొసైన్ ఈ ఆరోపణలను తిరస్కరించారు. సీపీఎం కార్యకర్తలే తమ పార్టీ కార్యకర్తలపై దాడి చేశారని.. ఇందులో తన కారు కూడా ధ్వంసమైందని ప్రత్యారోపణ చేశారు. ఘర్షణలకు సంబంధించి మొత్తంగా కోల్‌కతా నగరంలో 50 మందిని, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 974 మందిని అరెస్ట్ చేసినట్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు.
ముర్షీదాబాద్ ఘటనలో.. ఎర్రజెండాలు పట్టుకున్న వాళ్లు తృణమూల్ కార్యకర్తలను కొడుతున్నట్లు కనిపించిందని ఆమె ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తృణమూల్ కార్యకర్తలు హింసకు దిగాల్సిన అవసరమేముందని ఆమె వ్యాఖ్యానించారు. అయితే.. సార్వత్రిక సమ్మెను విఫలం చేయటానికి తృణమూల్ సర్కారు పశుబలం ఉపయోగిస్తోందని రాష్ట్ర లెఫ్ట్ ఫ్రంట్ చైర్మన్ బిమన్‌బోస్ ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారుకు తనను మిత్రపక్షంగా చూపుకునేందుకు మమత ఈ సమ్మెను వ్యతిరేకిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
కార్మిక సంఘాల డిమాండ్లివీ..
* ధరల పెరుగుదలను నియంత్రించేందుకు అత్యవసర చర్యలు చేపట్టడం.
* నిరుద్యోగితను నియంత్రించడం
* కార్మిక చట్టాలను నిక్కచ్చిగా అమలు చేయడం
* వీటిని ఏకపక్షంగా సవరించకుండా ఉండడం
* కార్మికులందరికీ సార్వత్రిక సామాజిక భద్రత
* నెలకు రూ. 15 వేలు కనీస వేతనం ఇవ్వడం
* పెన్షన్ల పెంపుదల
* పీఎస్‌యూల్లో పెట్టుబడుల వాపసును నిలిపివేయడం
* కాంట్రాక్టు వ్యవస్థకు స్వస్తి పలకడం
* భవిష్యనిధి, బోనస్‌లపై పరిమితి తొలగించడం
* కార్మిక సంఘాలు 45 రోజుల్లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవటం తప్పనిసరి చేయడం
* రైల్వేలు, రక్షణ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను నిలిపివేయడం కార్మిక సంఘాలు తమ 12 డిమాండ్ల పత్రంపై గత నెలలో మంత్రివర్గ కమిటీతో జరిపిన చర్చలు విఫలమవటంతో బుధవారం దేశవ్యాప్త సమ్మె చేపట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.