
తెలంగాణ తెచ్చింది.. ఇచ్చింది మేమే
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
బాలానగర్: ‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చింది మేమే.. ఇచ్చింది మేమే’నని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ హయాంలోనే నగరాభివృద్ధి జరిగిందన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బుధవారం కూకట్‌పల్లి నియోజకవర్గంలో రోడ్ షోలో పాల్గొన్నారు. బాలానగర్, ఫతేనగర్ అభ్యర్థులు భండారి ప్రకాష్‌గౌడ్, కె.రాజు ముదిరాజ్‌ల తరఫున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ పాలనలో టీఆర్‌ఎస్ పూర్తిగా విఫలమైందని, రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతోందని విమర్శించారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తెచ్చింది, ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనేనని ప్రజలు గుర్తించాలని కోరారు. ప్రత్యేక తెలంగాణ విషయంలో ఆ రోజు సోనియాగాంధీ నిర్ణయం తీసుకోకపోతే అది కలగానే మిగిలేదన్నారు. సోనియాగాంధీ ధైర్యం చేసి ప్రత్యేక తెలంగాణ ఇచ్చారని పేర్కొన్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అయితే.. తమవల్లే ప్రత్యేక రాష్ట్రం కల సాకారమైందని టీఆర్‌ఎస్ చెప్పుకుంటోందని ఎద్దేవా చేశారు. గ్రేటర్ ఎన్నికలతో కాంగ్రెస్‌కు పూర్వవైభవం వస్తుందన్నారు. టీఆర్‌ఎస్, టీడీపీలకు ఓటేస్తే అవినీతికి ఓటేసినట్లేనని విమర్శించారు. ప్రజలు ఆలోచించి ఉన్నతమైన నాయకులకే పట్టం కట్టాలని కోరారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి నగరాభివృద్ధికి బాటలు వేయాలన్నారు.