కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ రేషన్‌కార్డుతో నిమిత్తం లేకుండా ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపచేస్తామంటూ ఎన్నికల హామీని గుప్పించాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) యోచిస్తోంది.
అందరికీ నాణ్యమైన విద్యతోపాటు కొత్త రాష్ట్రంలో సరికొత్త హామీలతో ప్రజలను ఆకట్టుకునేలా పలు ఎన్నికల తాయిలాలను చేర్చేందుకు కసరత్తు చేస్తోంది. మూడురోజులుగా ఆయా అంశాలపై కసరత్తు చేస్తున్న టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ డి.శ్రీధర్‌బాబు, కోచైర్మన్ మల్లు భట్టివిక్రమార్కలు ఈ మేరకు తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఉద్యోగ, ఉపాధ్యాయ, రాజకీయ, ప్రజా సంఘాలతోపాటు విద్యావేత్తలు, మేధావుల సలహాలు తీసుకోవడంలో నిమగ్నమయ్యారు.
ఆదివారం తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం, కో కన్వీనర్ దేవీప్రసాద్, తదితరులతో ఓ హోటల్‌లో శ్రీధర్‌బాబు, భట్టి సమావేశమయ్యారు. అనంతరం మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ నాయకులతోనూ వేర్వేరుగా భేటీ అయ్యారు. శ్రీధర్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. కొత్త రాష్ట్రం నేపథ్యంలో ‘పీపుల్స్ మేనిఫెస్టో’ పేరుతో ఎన్నికల ప్రణాళికను రూపొందిస్తున్నామని, విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తామన్నారు.
జిల్లాకో అమరవీరుల స్తూపాన్ని నిర్మించాలి
ప్రతి జిల్లా కేంద్రంలోనూ అమరవీరుల స్మారక స్తూపాన్ని ఏర్పాటు చేయాలని టీపీసీసీ మేనిఫెస్టో కమిటీని కోరినట్లు కోదండరాం తె లిపారు. అమరవీరుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడంతోపాటు కుటుంబ పరిస్థితులకు అనుగుణంగా పెన్షన్ లేదా ఉద్యోగం ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. కేసులను ఎత్తివేయాలని, ఉద్యమంలో వ్యక్తమైన డిమాండ్లను మేనిఫెస్టో రూపంలో అన్ని రాజకీయ పార్టీలకూ అందించనున్నట్లు తెలిపారు.