‘ఆరోగ్యశ్రీ’ని భ్రష్టుపట్టించారు | congress leaders fired on trs government in assembly on arogyasree | Sakshi
Sakshi News home page

‘ఆరోగ్యశ్రీ’ని భ్రష్టుపట్టించారు

Published Sat, Dec 17 2016 3:03 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

congress leaders fired on trs government in assembly on arogyasree

ప్రభుత్వంపై కాంగ్రెస్‌ సభ్యుల ఫైర్‌
నాటి సీఎం రాజశేఖరరెడ్డి తెచ్చిన అద్భుత పథకమిది
బకాయిల పెండింగ్, అక్రమాలతో నాశనం చేశారని మండిపాటు
మెరుగుపరిచామే తప్ప చెడగొట్టలేదు: మంత్రి లక్ష్మారెడ్డి


సాక్షి, హైదరాబాద్‌: ఆరోగ్యశ్రీ అమల్లో లోపాలు, ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సేవల కొరతపై కాంగ్రెస్‌ సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీశారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల తొలిరోజునే ఈ అంశంపై విరుచుకుపడ్డారు.   పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి ప్రధాన ప్రశ్న అడగ్గా.. తర్వాత జీవన్‌రెడ్డి, డీకే అరుణ, సంపత్‌కుమార్, కోమటిరెడ్డిలు అనుబంధ ప్రశ్నలు సంధిస్తూ, ప్రభుత్వ తీరును ఎండ గట్టారు. మంత్రి లక్ష్మారెడ్డి ‘అంతా బాగుంది’ అనే తరహా చెప్పిన సమాధానంతో సభ్యులు సంతృప్తి చెందలేదు.

పేదల ప్రాణాలతో చెలగాటం
 కాంగ్రెస్‌ సభ్యుడు రామ్మోహన్‌రెడ్డి ‘ఆరోగ్యశ్రీ’ అంశంపై ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ జాబితా నుంచి 137 వ్యాధులను తొలగించారని, స్పెసిఫికేషన్‌ లేకుండా కొన్ని ఆసుపత్రుల్లో పరికరాలు కొని రూ.20 కోట్ల వరకు దుర్వినియోగం చేశారని ఆయన పేర్కొన్నారు. అయినా ఎవరిపైనా చర్యలు తీసుకోలేదేమని నిలదీశారు. ప్రైవేటు ఆస్పత్రులకు ‘ఆరోగ్యశ్రీ’ బకాయిలు చెల్లించకపోవటంతో పేదల చికిత్స లకు ఇబ్బంది వచ్చిందని మండిపడ్డారు. పేద లకు చివరకు పురుగుల సెలైన్‌ ఎక్కిం చారంటూ గాంధీ ఆసుపత్రిలో జరిగిన ఘట నకు సంబంధించి పత్రికల క్లిప్పింగులను ప్రదర్శించారు. జీవన్‌రెడ్డి మాట్లాడుతూ, రూ.330 కోట్ల మేర ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు ఆందోళనకు దిగి, చికిత్సలు నిలిపివేశాయని చెప్పారు.

ఒక్క నిమ్స్‌కే రూ.100 కోట్లు బకాయిపడటంతో వాటిని ఇప్పించాల్సిందిగా ఆస్పత్రి నిర్వాహకులు ఓ సందర్భంలో తన దృష్టికి తెచ్చారన్నారు. ఆ కర్నూల్‌కు చేరువలో ఉన్న తెలంగాణ జిల్లాల నుంచి పేద రోగులు అక్కడికి వెళ్లి చికిత్సలు చేయించుకుని, డబ్బులకు ఇబ్బంది పడుతు న్నారని కాంగ్రెస్‌ మరో సభ్యురాలు డీకే అరుణ చెప్పారు.  నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమా దాలు ఎక్కువగా జరుగుతుండటంతో అక్కడ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేస్తానన్న సీఎం హామీ  ఇంకా కార్యరూపం దాల్చలేదని మరో సభ్యుడు సంపత్‌కుమార్‌ పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడ్డ జిల్లా కేంద్రాల్లో ఉన్న ఏరియా ఆస్పత్రులనే జిల్లా ఆస్పత్రులుగా మార్చారని,  మరో సభ్యుడు చిన్నారెడ్డి స్పష్టం చేశారు.   ఇక సరిహద్దు జిల్లాల వారు ఏపీలో చికిత్స చేయించుకున్నా ఆరోగ్యశ్రీ వర్తించేలా ఏపీతో మాట్లాడాలని టీడీపీ సభ్యుడు సండ్ర వెంకటవీరయ్య సూచించారు.

వైఎస్‌ తెచ్చిన గొప్ప పథకం
దేశంలోని ఏ రాష్ట్రంలో లేనట్టుగా.. నిరుపేదలకు ఆరోగ్య ధీమా కలిగించేందుకు ఓ డాక్టర్‌ అయిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభిస్తే... ఇప్పుడు దాన్ని పనికిరాకుండా చేశారు. అమెరికా లాంటి దేశాల్లో కూడా ఈ పథకం సాధ్యం కాలేదు.
– కోమటిరెడ్డి వెంకటరెడ్డి

బోర్డు మారిస్తేసరిపోతుందా?
కొత్త జిల్లాల్లో ఏరియా ఆసుపత్రులకే జిల్లా ఆసుపత్రి అని బోర్డు తగిలించారు. బోర్డు మారిస్తే వైద్యసేవలు మెరుగుపడతాయా? సదుపాయాలు, సౌకర్యాలు కల్పించరా? – చిన్నారెడ్డి

భ్రష్టు పట్టించారు

జేబులో రూపాయి లేకున్నా సరే తెల్లకార్డుంటే చాలు.. ఎంత ఖరీదైన వైద్యమైనా ఉచితంగా నిర్వహించే గొప్ప పథకానికి దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి రూపకల్పన చేసి గొప్పగా అమలు చేశారు. ఇప్పుడు బిల్లుల పెండింగ్, అక్రమాలతో ఆరోగ్యశ్రీని భ్రష్టు పట్టించారు. చివరకు పురుగులున్న సెలైన్‌ ఎక్కిస్తూ పేదల ప్రాణాలతో ఆడుకుంటున్నారు.    – టి.రామ్మోహన్‌రెడ్డి

మేమే మెరుగుపరిచాం: లక్ష్మారెడ్డి
గత ప్రభుత్వం హయాంలో అమలైన ఆరోగ్యశ్రీని మరింత మెరుగుపరిచి అమలు చేస్తున్నామే తప్ప లోటు చేయలేదని మంత్రి లక్ష్మారెడ్డి సమాధానమిచ్చారు. ‘‘గతంలో కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ ఆదిలాబాద్‌కు వచ్చిన సమయంలో ఓ కార్యకర్తను పరామర్శిం చేందుకు స్థానిక ఏరియా ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి సౌకర్యాలు చూసి మారుమూల ప్రాంత ఆసుపత్రిలో ఇంతమంచి వైద్య సేవలా అంటూ ఆశ్చర్యపోయారు. గత ప్రభుత్వ సమయంలోనే ఆరోగ్యశ్రీ భ్రష్టుపట్టింది. డాక్టర్లు, సిబ్బంది రిక్రూట్‌మెంట్‌ లేకుండా పోతే మా ప్రభుత్వం వచ్చాకే నియామకాలు జరుగుతున్నాయి.

తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు మెరుగుపడటం వల్ల 20 శాతం మేర రోగుల సంఖ్య పెరిగింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు పురస్కారం కూడా ప్రదానం చేసింది..’’ అని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ఆరోగ్యశ్రీకి రూ.1,460 కోట్లు కేటాయించామని, అందులో గత ప్రభుత్వాల తాలూకు రూ.260 కోట్ల బకాయిలు కూడా ఉన్నాయని చెప్పారు. గత అక్టోబర్‌ 3 నుంచి 14వరకు కొన్ని ఆస్పత్రుల్లో సేవలు నిలిపేసినా.. పేదలకు ఇబ్బంది కాకుండా చూశా మన్నారు. గతంలో కరీంనగర్‌ లాంటి పెద్ద ఆస్పత్రిలో కూడా ఐసీయూ ఉండేది కాదని, ఇప్పుడు తాము అన్ని జిల్లా ఆసుపత్రుల్లో ఐసీయూలుండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. త్వరలో అలంపూర్‌లో 100 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement