
పారదర్శకత.. నాణ్యమైన విద్యే లక్ష్యం
జేఎన్‌టీయూహెచ్ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్ యాదయ్య
సిటీబ్యూరో: జవ హర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం హైదరాబాద్ రిజిస్ట్రార్‌గా జేఎన్‌టీయూహెచ్ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ యాదయ్య బాధ్యతలు స్వీకరించారు. రిజిస్ట్రార్‌గా యాదయ్య నియామకానికి బుధవారం సాయంత్రం వర్సిటీ వైస్ చాన్స్‌లర్ శైలజా రామయ్యర్ ఆమోదం తెలిపారు. రెండు రోజుల క్రితం జరిగిన విద్యాశాఖ సమీక్ష సమావేశంలో యాదయ్యను రిజిస్ట్రార్‌గా నియమించాలని సీఎం కేసీఆర్ స్వయంగా అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు రిజిస్ట్రార్‌గా పనిచేసిన ఎన్‌వీ రమణారావు ఇకపై సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్‌గా కొనసాగనున్నారు. నూతన రిజిస్ట్రార్ యాదయ్య ‘సాక్షి’తో మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేలా కృషి చేస్తామని చెప్పారు. ప్రతి విషయంలో పారదర్శకంగా మెలుగుతానని పేర్కొన్నారు. అందరి సలహాలు, సూచనలతో వర్సిటీ కీర్తిప్రతిష్టలను ఇనుమడింపచేస్తామని పేర్కొన్నారు.
చదువుకున్న చోటే ఉన్నత పదవి
వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన యాదయ్య...జేఎన్‌టీయూహెచ్‌లో ఉన్నత చదువులు అభ్యసించి.. అదే వర్సిటీకి రిజిస్ట్రార్‌గా నియామకం కావడం విశేషం. 2014లో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఆఫ్ ఇండియా ఏపీ చాప్టర్ ఆయన్ను ఇంజినీర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించింది. అంతేగాక ఏపీ స్టేట్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ... యంగ్ సైంటి స్ట్ ఫెలోషిప్ అందజేసింది. బోధన, పరిశోధనలో 20 ఏళ్ల అనుభవం ఆయన సొంతం.
ప్రొఫైల్..
నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం మల్‌రెడ్డిగూడెం సొంతూరు
భార్య పద్మ, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, ఇద్దరు అమ్మాయిలు
ఒకటి నుంచి పదో తరగతి వరకు సర్వేల్‌లోని జెడ్‌పీహెచ్‌ఎస్
మలక్‌పేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్
1988లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్
1992లో జేఎన్‌టీయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధుల్లోకి
2000లో జేఎన్‌టీయూహెచ్‌లో పీహెచ్‌డీ
2001లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా విధులు
2006లో ప్రొఫెసర్‌గా పదోన్నతి
గతేడాది జేఎన్‌టీయూహెచ్‌లో ప్రిన్సిపాల్‌గా నియామకం