రిజిస్ట్రార్‌ కుర్చీ కోసం ఎత్తుకుపైఎత్తులు | - | Sakshi
Sakshi News home page

రిజిస్ట్రార్‌ కుర్చీ కోసం ఎత్తుకుపైఎత్తులు

Published Thu, May 4 2023 2:09 AM | Last Updated on Thu, May 4 2023 2:09 PM

- - Sakshi

నిజామాబాద్: తెలంగాణ యూనివర్సిటీ నూతన రిజిస్ట్రార్‌ నియామకంలో బుధవారం హై డ్రామా నెలకొంది. వీసీ ప్రొఫెసర్‌ డి రవీందర్‌ హైకోర్టు మధ్యంతర రద్దు ఉత్తర్వుల ఆధారంగా ఈసీ నియమించిన ప్రొఫెసర్‌ యాదగిరి స్థానంలో వర్సిటీ కొత్త రిజిస్ట్రార్‌గా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ఎల్‌ నిర్మల దేవిని నియమించారు. ఆమె బుధవారం ఉదయం ఓయూ నుంచి ఏడాది కాలానికి లీన్‌ తీసుకుని తెయూ రిజిస్ట్రార్‌గా సా యంత్రం బాధ్యతలు స్వీకరించారు. అయితే పాలనాపరమైన కారణాల వల్ల లీన్‌ను రద్దు చేస్తూ బు ధవారం సాయంత్రం ఓయూ రిజిస్ట్రార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే ఆమెను యథాస్థానంలో తిరిగి చేరాలని కోరుతూ ఉత్తర్వులు జారీచేయడం కలకలం రేపింది. రిజిస్ట్రార్‌గా నిర్మల దేవి బాధ్యతలు స్వీకరించక ముందే ఆమె లీన్‌ రద్దు చేస్తున్నట్లు ఓయూ జారీ చేసిన ఉత్తర్వులు అందినప్పటికీ వీసీ ఏమాత్రం పట్టించుకోలేదు. నిర్మల రిజిస్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించగానే వీసీ కార్యాలయం ద్వారా ఆగమేఘాలపై రిజిస్ట్రార్‌ సిగ్నేచర్‌ను బ్యాంక్‌ ఆథరైజేషన్‌ కోసం పంపించడం గమనార్హం. అయితే అప్పటికే బ్యాంకు పని వేళలు ముగియడంతో బ్యాంక్‌ అధికారులు సిగ్నేచర్‌ అథరైజేషన్‌ చేయలేకపోవడం కొసమెరుపు.

వీసీ వర్సెస్‌ నవీన్‌ మిట్టల్‌ వ్యవహారం తెలంగాణ యూనివర్సిటీని మరింత వివాదంలోకి నెట్టేసింది. గత నెల 19న హైదరాబాద్‌లో జరిగిన 55వ తెయూ పాలకమండలి సమావేశాన్ని వీసీ వాకౌట్‌ చేయడం సంచనలం రేపింది. దీంతో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపాల్‌ సెక్రటరీ వాకాటీ కరుణ, విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌, పాలకమండలి సభ్యులు రెండేళ్ల కాలానికి తెయూ రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్‌ యాదగిరిని నియమించారు. ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా విద్యావర్ధినిని తొలగిస్తూ, పాలకమండలి ప్రమేయం లేకుండా వీసీ రవీందర్‌ హయాంలో జరిగిన అక్రమ నియామకాలు, పదోన్నతులు, విచ్చలవిడి కొనుగోళ్తు, చెల్లింపులు, నిధుల దుబారా తదితర అంశాలపై విచారణ జరపాలని తీర్మానం చేశారు. వీసీ అధికారాలకు కత్తెర వేసి రిజిస్ట్రార్‌కు హక్కులు కట్టబెట్టారు. దీంతో ఈసీ నిర్ణయాలను వీసీ హైకోర్టులో సవాల్‌ చేశారు. తుది తీర్పు వచ్చే వరకు ఈసీ నిర్ణయాలను రద్దు చేస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం వీసీ రవీందర్‌ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏకంగా నవీన్‌ మిట్టల్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆయనపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం రిజిస్ట్రార్‌గా యాదగిరి నియామకం చెల్లదని, వారం రోజుల్లో ఓయూ నుంచి ఒకరిని రిజిస్ట్రార్‌గా నియమిస్తామని పేర్కొన్నారు. చెప్పినట్టే బుధవారం ఓయూ ఈసీఈ హెచ్‌వోడీ ప్రొఫెసర్‌ నిర్మల దేవిని తెయూ రిజిస్ట్రార్‌గా నియమించారు. కానీ సాయంత్రం అయ్యేసరికి ఓయూ నుంచి లీన్‌ను రద్దు చేస్తున్నట్లు నిర్మల దేవిని వెనక్కు తిరిగి రావాని కొత్త ఉత్తర్వులు జారీ కావడం సంచనలం కలిగించింది.

రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్‌ నిర్మల దేవి
తెలంగాణ యూనివర్సిటీ నూతన రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్‌ ఎల్‌.నిర్మల దేవి నియామకమయ్యా రు. ఈ మేరకు బుధవారం సాయంత్రం వీసీ డి.రవీందర్‌ ఆమెకు ఉత్తర్వులు అందజేశారు. వెంటనే ఆమె రిజిస్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన నిర్మ ల దేవి ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ విభాగాధిపతిగా పని చేస్తున్నారు. నిర్మలదేవి 23 ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. రిజిస్ట్రార్‌గా బాధ్య తలు స్వీకరించిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. టీచింగ్‌, నాన్‌–టీచింగ్‌, అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు సిబ్బంది అందరి సహకారంతో తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. వ్యక్తులు ముఖ్యం కాదని వ్యవస్థ ముఖ్యమన్నారు. మీడియా నిజమైన వార్తలు ప్రచురించాలని వర్సిటీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. వీసీ రవీందర్‌ మాట్లాడుతూ.. త్వరలోనే తెయూలో ఇంజినీరింగ్‌ కోర్సులు ప్రారంభిస్తామన్నారు. పరిశోధనలకు ప్రాధాన్యత నిచ్చే నిర్మల దేవిని రిజిస్ట్రార్‌గా నియమించడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. అనంతరం వీసీ రవీందర్‌, రిజిస్ట్రార్‌ నిర్మలదేవిని శాలువా, పుష్పగుచ్ఛంతో సత్కరించారు.

ఈ విషయమై నిర్మల దేవిని సంప్రదించగా ఓయూ నుంచి లీన్‌ అనుమతి ఇస్తేనే తాను తెయూ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించానని, రద్దు ఉత్తర్వులు తనకు తెలియవన్నారు. తెయూ రిజిస్ట్రార్‌గా కంటిన్యూ అవుతానని స్పష్టం చేశారు.

అయితే లీన్‌ రద్దు చేసినా నిర్మల దేవి తిరిగి వెళ్లకపోతే ఓయూ ఉన్నతాధికారులు షోకాజ్‌ నోటీస్‌ జారీ చేసి చర్యలు తీసుకునే అవకాశాలున్నట్లు సమాచారం.

నేడు హైకోర్టు తీర్పు వెలువడే అవకాశం..
ఈసీ నిర్ణయాలను రద్దుచేస్తూ హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులపై రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కోర్టులో దాఖలు చేసిన కౌంటర్‌ పై గురువారం ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని సమాచారం. వీసీ తెచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేస్తే (స్టే వెకేట్‌) మళ్లీ అప్పుడు రిజిస్ట్రార్‌ ఎవరనేది ప్రశ్నార్థకంగా మారనుంది. దీనికి తోడు శుక్రవారం తెయూ ఈసీ సమావేశం నిర్వహించనున్నారు. ముందు గా ఆన్‌లైన్‌లో వర్చువల్‌గా ఈసీ సమావేశం ని ర్వహించాలని భావించినా వర్సిటీలో జరుగుతు న్న పరిణామాలపై ఆగ్రహంగా ఉన్న ఈసీ స భ్యులు ప్రత్యక్షంగా సమావేశం జరపాలని భావి స్తున్నట్లు తెలుస్తోంది. వీసీ దుందుడుకు చర్య లు, నవీన్‌ మిట్టల్‌పై ఆరోపణలపై సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. వీసీపై మరి న్ని చర్యలకు తీర్మానం చేసే అవకాశాలున్నాయి.

రెండేళ్ల పదవీ కాలంలో వీసీ రవీందర్‌ ఆరుగురు రిజిస్ట్రార్లను మార్చారు. దీంతో వర్సిటీలో పాలన, టీచింగ్‌, పరిశోధన అటకెక్కాయి. తెయూ పాలకమండలి సభ్యుడు గంగాధర్‌గౌడ్‌ ‘సాక్షి’తో మాట్లాడుతూ వీసీ రవీందర్‌ తన చర్యలతో వర్సిటీ పరువును గంగలో కలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ ఆమోదం లేకుండా నూతన రిజిస్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించిన నిర్మల దేవి వర్సిటీ నిధుల్లో నుంచి ఒక్క రూపాయి ఖర్చు చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఆసక్తికర పరిణామాల మధ్య తెలంగాణ యూనివర్సిటీ నూతన రిజిస్ట్రార్‌గా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ఎల్‌ నిర్మల దేవి బాధ్యతలు స్వీకరించారు. వర్సిటీ పాలకమండలి నిర్ణయాన్ని కాదని యాదగిరి స్థానంలో ఆమెను వీసీ రవీందర్‌ నియమించారు. నిర్మల లీన్‌ను రద్దు చేస్తూ ఓయూ నుంచి ఉత్తర్వులు వెలువడినప్పటికీ తెయూ వర్సిటీగానే కొనసాగుతానని ఆమె స్పష్టం చేయడం కొసమెరుపు. ఈ పరిణామాలతో పాలక మండలి, వీసీ మధ్య పోరు తారాస్థాయికి చేరినట్లయ్యింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement