ఛీ..ఛీ.. చిల్లర పంచాయితీ! | - | Sakshi
Sakshi News home page

ఛీ..ఛీ.. చిల్లర పంచాయితీ!

Published Tue, May 30 2023 9:04 AM | Last Updated on Tue, May 30 2023 9:20 AM

ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి పంపిన లేఖను చూపిస్తున్న యాదగిరి, పక్కన కనకయ్య - Sakshi

ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి పంపిన లేఖను చూపిస్తున్న యాదగిరి, పక్కన కనకయ్య

తెలంగాణ యూనివర్సిటీలో రిజిస్ట్రార్‌ కుర్చీ కోసం ప్రొఫెసర్లు యాదగిరి, కనకయ్య మధ్య వాదులాట గల్లీ లొల్లిని తలపించింది. ఇది చాలదన్నట్లుగా వీరికి మద్దతుగా విద్యార్థి సంఘాలు రెండుగా చీలిపోవడం.. పైగా బయట నుంచి దళిత సంఘాలు వర్సిటీలోకి రావడం మరీ విడ్డూరంగా మారింది. వెరసి అందరూ కలిసి అత్యున్నత విద్యాసంస్థ మర్యాదను దిగజార్చే ప్రయత్నం చేశారంటూ విద్యావర్గాలు తీవ్ర నిరసనను వ్యక్తం చేస్తున్నాయి. చివరికి తమ అదుపాజ్ఞలో పనిచేసే సిబ్బందే ఏకంగా రిజిస్ట్రార్‌ చాంబర్‌, వీసీ చాంబర్‌ గదులకు తాళం వేసే వరకు వెళ్లడం ఎంత పరువు తక్కువో.. తమ స్థాయిని ఎంత దిగజార్చుకున్నారో ఆ కుర్చీల్లో కూర్చుండే అధికారుల విజ్ఞతకే తెలియాలి.

 నిజామాబాద్‌: రాజకీయ పార్టీల్లో గల్లీ స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు పదవుల కోసం కొట్లాటలు నడుస్తుండడం సర్వసాధారణం. కానీ తెలంగాణ వర్సిటలో మాత్రం అంతకుమించి అన్నట్లుగా రిజిస్ట్రార్‌ కుర్చీ విషయంలో ఎడతెగని రగడ కొనసాగుతుండడం విస్తుగొలుపుతోంది. వీసీ రవీందర్‌ గుప్తా వ్యవహార శైలి, అక్రమ నియామకాల నేపథ్యంలోనే రిజిస్ట్రార్‌ పదవి విషయంలో నువ్వానేనా అనేవిధంగా పంచాయితీ నెలకొన్నట్లు వర్సిటీ వర్గాలు, విద్యార్థి సంఘాలు అంటున్నాయి. రెండేళ్ల కాలంలో ఏకంగా ఆరుగురు రిజిస్ట్రార్లు పదిసార్లు కుర్చీలు మార్చుకున్న పరిస్థితి నెలకొంది.

మళ్లీ తా జాగా సోమవారం వర్సిటీలో రిజిస్ట్రార్‌ కుర్చీ విషయమై ఆ చాంబర్‌లో మూడు గంటల పాటు లొల్లి నడిచింది. పాలకమండలి తీర్మానం మేరకు రిజిస్ట్రార్‌గా నియమితులైన యాదగిరి కుర్చీలో కూర్చున్నా రు. ఇదే సమయంలో కనకయ్య వచ్చి తనను వీసీ రిజిస్ట్రార్‌గా నియమించారని, తనకే కుర్చీలో కూ ర్చునే అధికారం ఉందని వాదించారు. పాలకమండలి, ప్రభుత్వం ఆర్డర్‌ ఇవ్వండతోనే రిజిస్ట్రార్‌ బా ధ్యతలు తీసుకున్నట్లు యాదగిరి తెలిపారు. ఈ క్ర మంలో విద్యార్థి సంఘాలన్నీ అక్కడకు వచ్చి రిజిస్ట్రార్‌ యాదగిరికి మద్దతుగా నిలిచాయి.

బయట నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు, ఒక్క విద్యార్థి సంఘం మాత్రం కనకయ్యకు మద్దతుగా నిలిచాయి. చివరకు అందరూ కలిసి ఒక తీర్మానానికి వచ్చారు. రిజిస్ట్రార్‌ ఎవరో తేలేవరకు వీసీ, రిజిస్ట్రార్‌ చాంబర్లకు తాళాలు వేయాలని నిర్ణయించారు. మొత్తాని కి రాజకీయ పార్టీల్లో గల్లీ స్థాయిలో పదవి కోసం కొ ట్లాడుకున్న మాదిరిగా చాలాసేపు వ్యవహారం కొనసాగడం విశేషం. బయటి వ్యక్తులను తీసుకొచ్చి గొ డవ చేయించే విధంగా సంస్కృతికి బీజం వేయడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీ లో రిజిస్ట్రార్‌ కుర్చీ విషయమై చిల్లర పంచాయితీ నెలకొనడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

అక్రమాల పుట్ట పగులుతుందనేనా..?
వర్సిటీకి అత్యున్నతమైన పాలకమండలి తీర్మానాలను అమలుచేసే విషయంలో వీసీ అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తుండడం గమనార్హం. ఇప్పటికే కనకయ్యతో కలిసి వీసీ అక్రమ నియామకాలు చేయడం, విచ్చలవిడిగా సుమారు రూ. 40కోట్ల మేర అధికారిక అనుమతి లేకుండా ఖర్చులు చేయడం, అడ్వాన్సులు చెల్లించడం తదితర వ్యవహారాలపై విచారణకు ఇప్పటికే ఈసీ ఐదుగురు సభ్యుల కమిటీ నియమించింది. ఈ కమిటీ ఒక్కరోజు విచారణ చేస్తేనే రూ. కోటి మేర అక్రమ చెల్లింపులు వెలుగుచూశాయి. కమిటీ విచారణ నేపథ్యంలో 55వ పాలకమండలి తీర్మానాలపై వీసీ హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. మళ్లీ తర్వాత 56, 57 పాలకమండలి తీర్మానాలపైనా స్టే తెచ్చుకునేందుకు వీసీ ప్రయత్నాలు చేస్తున్నారు.

వీసీని ఎవరు వెనక ఉండి నడిపిస్తున్నారో కానీ, ఉన్నత విద్యాశాఖ కమీషనర్‌ నవీన్‌ మిట్టల్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తుండడం గమనార్హం. అక్రమాలు బయట పడతాయనే వీసీ ఇష్టం వచ్చినట్లు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నోటిఫికేషన్‌ లేకుండానే కనకయ్య యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ప్రమోషన్‌ పొందాడని, అదేవిధంగా సర్వీసు పుస్తకాలను ఇంటికి తీసుకెళ్లాడనే విషయమై విచారణకు ఈసీ తీర్మానం చేసింది. అదేవిధంగా పీహెచ్‌డీ ప్రవేశాలపై సైతం కనకయ్య అక్రమాలు చేసినట్లు ఈసీ నిర్ణయించింది.

ఈ వ్యవహారాలపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని ఈసీ నిర్ణయం తీసుకుంది. ఇక వీసీ రవీందర్‌గుప్తా, కనకయ్య చేసిన అక్రమ నియామకాలపైనా, విచ్చలవిడిగా చేసిన ఖర్చులపైనా విచారణ చేస్తే అన్నీ బయటకొస్తాయనే వీరిద్దరూ కలిసి రిజిస్ట్రార్‌గా మరొకరు ఉండేందుకు అంగీకరించకుండా ఇష్టం వచ్చినట్లు చేస్తున్నట్లు ఈసీ సభ్యులు తెలిపారు. ఇక వర్సిటీ ల్యాప్‌టాప్‌ను రెండేళ్లుగా తనవద్దనే ఉంచుకున్న కనకయ్య ఇప్పటివరకు అప్పగించకపోవడం విశేషం. మొత్తంమీద అక్రమ వ్యవహారాలను పాలకమండలి సభ్యులు బట్టబయలు చేయకుండా చేసేందుకే ఈ తెగింపు చర్యలకు వీసీ రవీందర్‌, కనకయ్య పాల్పడుతున్నట్లు వర్సిటీలో తీవ్రచర్చ జరుగుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/2

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement