
‘గ్రేటర్’లో గులాబీ జోష్..!
సభా వేదిక సాక్షిగా ఎన్నికల శంఖం పూరించిన కేసీఆర్
నగరాన్ని డల్లాస్, సింగపూర్‌లా తీర్చిదిద్దుతామని హామీ
సిటీబ్యూరో: పరేడ్ గ్రౌండ్‌లో సోమవారం నిర్వహించిన భారీ బహిరంగ సభ కనీవిని ఎరుగని రీతిలో విజయవంతం కావడంతో గ్రేటర్ టీఆర్‌ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నిండింది. ఈ ఏడాది అక్టోబరు లేదా నవంబరు నెలల్లో బల్దియా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సభావేదిక సాక్షిగా సీఎం కేసీఆర్ ఎన్నికల శంఖం పూరించినట్లేనని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. రాబోయే మూడున్నరేళ్లలో హైదరాబాద్‌ను అమెరికాలోని డల్లాస్, సింగపూర్ తరహాలో తీర్చిదిద్దుతామని, సౌకర్యాలు కల్పించి, ట్రాఫిక్ చిక్కులు దూరం చేస్తామన్న సీఎం ప్రకటనతో గ్రేటర్ అభివృద్ధికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందనే విషయం స్పష్టమవుతుందని చెబుతున్నారు. వర్షమొస్తే నగరంలో కార్లు పడవలను తలపిస్తాయని ఈ పరిస్థితిని దూరం చేస్తామని సీఎం స్వయంగా ప్రకటించడం విశేషం.
కాగా బహిరంగ సభను విజయవంతం చేసేందుకు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు శక్తివంచన లేకుండా కృషిచేశారు. గ్రేటర్ పరిధిలోని 24 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలను సభకు తరలించేందుకు ఆయా నియోజకవర్గాల నేతలు చొరవచూపారు. పార్టీ గ్రేటర్ విభాగం అధ్యక్షుడు మైనంపల్లి హనుమంతరావు, ఐటీ శాఖమంత్రి కేటీఆర్ నేతృత్వంలోని పార్టీ కార్యకర్తల బృందం పాదయాత్రగా బయలుదేరి సభా ప్రాంగణానికి చేరుకోవడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బహిరంగ సభ నేపథ్యంలో గ్రేటర్ నగరం గులాబీ వనంలా మారింది. ప్రధాన రహదారులన్నీ గులాబీ జెండాలు, కటౌట్లు, బెలూన్లతో నిండిపోయాయి. సభకు ప్రతి నియోజకవర్గం నుంచి ఐదు వేలకు తగ్గకుండా కార్యకర్తలను తరలించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్ల నుంచి కార్యకర్తలు బహిరంగ సభకు స్వచ్ఛందంగా తరలివచ్చారని నేతలు పేర్కొంటున్నారు. పలు బస్తీల నుంచి మహిళా, మైనార్టీ మహిళలు పెద్ద ఎత్తున తరలిరావడం పార్టీకి శుభపరిణామమని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బల్దియా ఎన్నికల నేపథ్యంలో పార్టీ టికెట్లను ఆశిస్తున్న ద్వితీయశ్రేణి నాయకగణం ఎక్కడికక్కడ కటౌట్లను ఏర్పాటుచేసింది. స్వాగత తోరణాలు ఏర్పాటుచేసి అగ్రనేతల దృష్టిలో పడేందుకు ప్రయత్నించారు. సభ విజయవంతం కావడంతో బల్దియా ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేయడం తథ్యమని ఆ పార్టీ నేతలు విశ్వాసం వ్యక్తంచేస్తున్నారు. ఈ సభకు ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, చింతల కనకారెడ్డి, నాయకులు దండె విఠల్, శంభీపూర్ రాజు, మురుగేష్, టీఆర్‌ఎస్ అనుబంధ సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.