గులాబీలో సంస్థాగత సందడి!
∙ ముమ్మరంగా సభ్యత్వ నమోదు
∙ జిల్లాలో పట్టు నిలుపుకొనే యత్నం
∙ ప్లీనరీలోపు సంస్థాగత ప్రక్రియ పూర్తికి ఆదేశాలు
∙ తలమునకలైన పార్టీ శ్రేణులు
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)లో సంస్థాగత సందడి మొదలైంది. ఇప్పటికే గ్రామ కమిటీలను పూర్తిచేసిన గులాబీ నాయకత్వం.. తాజాగా మండల కమిటీల నియామకాలను చేపడుతోంది. ఈ నెల 21న మేడ్చల్ జిల్లా కొంపల్లిలో పార్టీ ప్లీనరీని నిర్వహించాలని టీఆర్‌ఎస్ నిర్ణయించింది. ఆ లోపు సంస్థాగత ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది.జిల్లా కమిటీల వ్యవస్థను రద్దు చేసిన గులాబీ బాస్.. నియోజకవర్గాల స్థాయి వరకే పార్టీ కమిటీలను పరిమితం చేశారు. ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా మండల కమిటీల నియామకాలను మొదలు పెట్టింది. శనివారంలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయనుంది. ఆ తర్వాత నియోజకవర్గాల సమన్వయ కమిటీలను ప్రకటించనుంది.
భారీగా సభ్యత్వ నమోదు
ఈ నెల తొలివారంలో సభ్యత్వ నమోదును మొదలుపెట్టిన టీఆర్‌ఎస్.. జిల్లాలో పెద్ద ఎత్తున సభ్యత్వాలను చేసింది. రెండేళ్ల క్రితం జిల్లాలో అంతగా పట్టులేని గులాబీ దళం.. ఇప్పుడు బలీయశక్తిగా ఎదిగింది. టీడీపీకి కంచుకోటగా నిలిచిన జిల్లాలో పూర్తిస్థాయిలో పాగా వేసింది. ఆ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోవడం ద్వారా పచ్చపార్టీ ఉనికిని ప్రశ్నార్థకం చేసింది. ఇక కాంగ్రెస్ పార్టీకి కూడా టీఆర్‌ఎస్ చుక్కలు చూపింది. ఆ పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులను తమ గూటిలో చేర్చుకుంది. తద్వారా విపక్షాలకు దీటుగా ఎదిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన సభ్యత్వ నమోదులో రికార్డులను అధిగమించింది. సభ్యత్వ నమోదులో అక్కడక్కడగా పాత, కొత్త నేతల మధ్య అంతరాలు బయటపడ్డప్పటికీ, ఆదిలోనే వాటికి ఫుల్‌స్టాప్ వేయడం ద్వారా సభ్యత్వ నమోదు ప్రక్రియను సజావుగా ముగించేసింది. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, చేవెళ్ల తదితర నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ముఖ్యనేతల మధ్య గ్రూపులు ఉండడం.. పార్టీ కార్యక్రమాలను విడివిడిగా చేయడమేగాకుండా.. కొన్నిచోట్ల విభేదాలు రచ్చకెక్కాయి. ఈ నేపథ్యంలో జోక్యం చేసుకున్న అధిష్టానం పెద్దలు నష్టనివారణ చర్యలకు దిగారు.
ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే సభ్యత్వ నమోదు ప్రక్రియ జరుగుతుందని స్పష్టం చేశారు. దీంతో వివాదానికి ఫుల్‌స్టాప్ పడింది. ఈ క్రమంలోనే గ్రామ కమిటీల ఎంపిక కూడా సజావుగానే పూర్తయింది. అక్కడక్కడా ఏకాభిప్రాయం కుదరకపోవడంతో వాయిదాపడ్డాయి. మండల కమిటీల ఖరారులోనూ సమన్వయం పాటించినప్పటికీ, కొన్నిచోట్ల పోటీ తీవ్రంగా ఉండడం.. పంతాలకు పోవడంతో వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో శనివారం మండల కమిటీలను ప్రకటించి.. నియోజకవర్గస్థాయి సమన్వయ కమిటీలను ఖరారు చేయనున్నారు. ఈ మేరకు జాబితాకు స్థానిక ప్రజాప్రతినిధులు తుదిరూపు ఇచ్చారు. జిల్లా కమిటీల్లేకపోవడంతో సాధ్యమైనంతవరకు సీనియర్లకు ఇందులో చోటు కల్పించే దిశగా కసరత్తు చేస్తున్నారు. అలాగే ఈ నెల 21న కొంపల్లిలో జరిగే ప్లీనరీ, 27న వరంగల్‌లో జరిగే బహిరంగసభకు భారీ ఎత్తున జనసమీకరణ చేయాలని గులాబీ నాయకత్వం నిర్ణయించింది.