గులాబీకి రెబెల్స్ గుబులు
► గ్రేటర్ ఎన్నికల్లో పలుచోట్ల బరిలో నిలిచిన అసంతృప్తులు
► ఓట్లు చీలుతాయని కలవరపడుతున్న పార్టీ అభ్యర్థులు
సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌కు రె బెల్స్ బెడద తప్పడం లేదు. పార్టీ టికెట్లు దక్కని అసంతృప్తుల్లో చాలావరకు మంత్రి కేటీఆర్ జోక్యంతో నామినేషన్లను ఉపసంహరించుకున్నా... కొన్నిచోట్ల రెబెల్స్ బరిలోనే నిలిచారు. ఎల్బీనగర్, ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, సనత్‌నగర్, జూబ్లీహిల్స్, అంబర్‌పేట్ నియోజకవర్గాల పరిధిలోని కొన్ని డివిజన్లలో ఈ బెడద ఉంది. రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్, గోషామహల్, నాంపల్లి, మహేశ్వరం, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో రెబెల్స్ నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో అక్కడ పార్టీకి చిక్కులు తప్పాయి.
నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే.. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని బీఎన్‌రెడ్డి నగర్ డివిజన్‌లో ఒక రు, ఉప్పల్ నియోజకవర్గంలో కాప్రాలో ఒకరు, మల్లాపూర్‌లో ఇద్దరు, చిలుకానగర్‌లో ఇద్దరు, రామంతాపూర్‌లో ఇద్దరు రెబెల్స్ రంగంలోకి దిగనున్నారు. ఇక కుత్బుల్లాపూర్ సూరారం కాలనీలో ఇద్దరు, కూకట్‌పల్లి నియోజకవర్గంలోని ఫతేనగర్‌లో ఇద్దరు, మల్కాజిగిరిలోని మచ్చ బొల్లారంలో ముగ్గురు, అల్వాల్‌లో ఒకరు, సికింద్రాబాద్‌లో అడ్డగుట్టలో ఒకరు, సనత్‌నగర్‌లోని బేగంపేట్‌లో ఒకరు, జూబ్లీహిల్స్ డివిజన్ నుంచి ఒకరు, వెంకటేశ్వరనగర్ కాలనీ నుంచి ఒకరు, అంబర్‌పేట్‌లోని నల్లకుంట డివిజన్ నుంచి ఒకరు పార్టీ ఆదేశాలను ధిక్కరించి బరిలో నిలిచేందుకు సిద్ధపడ్డారు. దీంతో ఆయా డివిజన్లలో అధికార పార్టీ అభ్యర్థులకు తలనొప్పులు తప్పడంలేదు. పార్టీ ఓట్లు చీలడం తథ్యమన్న సంకేతాలు వెలువడుతుండడం అభ్యర్థులను కలవరపరుస్తోంది.