
సూపర్ 'కారు' 99
....గ్రేటర్ తమాషా
ఎగిరిన ‘పతంగ్‌లు’... 44
తెలుగుదేశం... ‘ఏకైక’లోకేశం
పూచిన ‘పువ్వులు’... నాలుగే
సీఎల్పీకి 1.. పీసీసీకి 1... మొత్తం 2
చరిత్రాత్మక విజయం.. విస్పష్ట ప్రజాతీర్పు...! జీరో టు హండ్రెడ్ నినాదంతో తొలిసారి గ్రేటర్ బరిలోకి దిగిన టీఆర్‌ఎస్‌ను నగర ప్రజలు భుజాలకెత్తుకున్నారు! గ్రేటర్ కిరీటాన్ని అందించారు. బల్దియా ఎన్నికల చరిత్రలో ఇప్పటిదాకా ఎవరికీ అందని అద్భుత విజయాన్ని కట్టబెట్టారు. తొలిసారి మూడింట రెండొంతుల మెజారిటీని అందించి అధికార పగ్గాలు అప్పజెప్పారు. కారు జోరుకు ప్రతిపక్షాలు కకావికలమయ్యాయి.
టీడీపీ-బీజేపీ కూటమి కేవలం ఐదు స్థానాలతో సరిపెట్టుకోగా.. గతంలో ఎంఐఎంతో మేయర్ పీఠాన్ని పంచుకున్న కాంగ్రెస్ రెండు సీట్లకే పరిమితమైంది. ఇక ఎంఐఎం తన పట్టు నిలుపుకుంది. 44 స్థానాల్లో నెగ్గి రెండో స్థానంలో నిలిచింది. గ్రేటర్ ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించిన మంత్రి కేటీఆర్ గులాబీ పార్టీని విజయతీరాలకు చేర్చారు.
సాక్షి ప్రత్యేక ప్రతినిధి : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రభంజనం సృష్టించింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల చరిత్రను తిరగరాసింది. మూడింట రెండొంతుల సీట్లు సాధించి విజయకేతనం ఎగురవేసింది. 2009లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తగిన సంస్థాగత బలం లేదని పోటీ నుంచి తప్పుకున్న టీఆర్‌ఎస్ ఈసారి ఏకంగా 99 డివిజన్లలో విజయఢంకా మోగించి రికార్డు సృష్టించింది.
2014 సాధారణ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో మూడు శాసనసభ నియోజకవర్గాల్లో మాత్రమే విజయం సాధించిన టీఆర్‌ఎస్... ఈ ఎన్నికల్లో ఒకటి అర తప్ప అన్ని నియోజకవర్గాల్లో డివిజన్లను తన ఖాతాలో వేసుకుంది. సెటిలర్లు ఎక్కువగా నివసించే కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, ఎల్బీ నగర్, ఉప్పల్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్‌నగర్ నియోజకవర్గాల్లో మూడు మినహా అన్నింటా ఘన విజయం సాధించింది.
కాంగ్రెస్, టీడీపీ, బీజేపీని కోలుకోలేని రీతిలో మట్టి కరిపించింది. ఆ పార్టీలు ఈ ఎన్నికల్లో సోదిలో కూడా లేకుండా పోయాయి. టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ 4 స్థానాల్లో విజయం సాధించగా, టీడీపీ ఒకే ఒక స్థానంలో గెలుపొందింది. కాంగ్రెస్ అతి కష్టమ్మీద 2 స్థానాలను దక్కించుకుంది. అందులో ఒకటి మెదక్ జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలో ఉండగా, రెండోది నాచారం డివిజన్.
మజ్లిస్ ఇత్తేహదుల్ ముస్లిమిన్ (ఎంఐఎం) 44 డివిజన్లు గెలుచుకుని రెండో స్థానంలో నిలిచింది. ఎంఐఎం ఇప్పుడు జీహెచ్‌ఎంసీలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించనుంది. టీఆర్‌ఎస్ తరఫున గ్రేటర్ బరిలో దిగిన రాజకీయ ప్రముఖుల కుటుంబ సభ్యులు ఘనవిజయం సాధించగా.. ఆర్‌కేపురం నుంచి పోటీ చేసిన మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కోడలు అనితారెడ్డి మాత్రం పరాజయం పాలయ్యారు. ఇక కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆ పార్టీ ప్రముఖ నేతల కుటుంబ సభ్యులు అందరూ ఓటమిపాలయ్యారు.
అన్ని వర్గాలను ఆకట్టుకున్న అధికార పార్టీ
గ్రేటర్ హైదరాబాద్‌ను చేజిక్కించుకునేందుకు అధికార పార్టీ అన్ని వర్గాల ప్రజల మద్దతు కూడగట్టేందుకు పక్కా వ్యూహాలను రూపొందించుకుని ముందుకు సాగింది. నగరంలో ఉన్న మురికివాడల ప్రజలను దగ్గర చేసుకునేందుకు వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీనిచ్చింది. ఐడీఎల్ కాలనీలో పేదలకు ఇళ్లు నిర్మించి విస్తృతంగా ప్రచారం చేసుకుంది. నగరంలో లక్ష మంది పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చింది.
దీంతో పేదలు దాదాపుగా అధికార పార్టీకే మద్దతు పలికారు. ఇక విజయంలో కీలకమైన మధ్య తరగతిని.. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మారుస్తామన్న అధికార పార్టీ నినాదం బాగా ఆకట్టుకుంది. మరిన్ని ఐటీ కంపెనీలను తీసుకురావడం, ఉన్న ఐటీ కంపెనీలు కొత్త క్యాంపస్‌లు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇవ్వడం మధ్యతరగతికి సంతోషం కలిగించింది. హైదరాబాద్ విశ్వనగరమైతే పెట్టుబడులు భారీగా వస్తాయని ప్రజలు విశ్వసించారు.
తద్వారా జీవన ప్రమాణాలు పెరగడమే కాకుండా ఉద్యోగావకాశాలు విరివిగా లభిస్తాయని యువత గట్టిగా నమ్మింది. దీంతో ఓట్లు వేయడానికి ప్రాధాన్యత ఇచ్చే పేదలు, మధ్య తరగతి వర్గాలు పూర్తిగా టీఆర్‌ఎస్ వైపు మొగ్గారు. దీంతో ఆ పార్టీ అభ్యర్థులకు కొన్ని చోట్ల పది వేలు, అంతకంటే ఎక్కువగా మెజారిటీ ఓట్లు లభించాయి.
‘‘2014 శాసనసభ ఎన్నికల్లో మేం గ్రేటర్‌లో 3 స్థానాల్లో గెలిచాం. ఇప్పుడు మాకు ప్రజల మద్దతు ఉంది కాబట్టి 80 డివిజన్ స్థానాలు వస్తాయని గట్టిగా నమ్మాం. కానీ ప్రజలు మమ్మల్ని పూర్తి స్థాయిలో విశ్వసించారు. ఈ విజయంతో మా బాధ్యత మరింతగా పెరిగింది’’ అని టీఆర్‌ఎస్ గ్రేటర్ ప్రచార రథ సారథి మంత్రి కె.తారకరామారావు ‘సాక్షి’తో అన్నారు.
కాంగ్రెస్‌కు ‘నాయకత్వ లేమి’ సమస్య
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తమ ఘనతే అని చెప్పుకున్నా గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన కాంగ్రెస్.. ఈ ఎన్నికల్లోనూ పత్తా లేకుండా పోయింది. కేవలం 2 డివిజన్లలో మాత్రమే విజయం సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. పార్టీ శ్రేణులను ముందుండి నడిపించే నాయకత్వం లేని కారణంగానే పరాజయాల నుంచి బయటపడలేకపోతోందని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. జీహెచ్‌ఎంసీలో మొత్తం 150 సీట్లకు ఆ పార్టీ పోటీ చేసినా సీనియర్ నేతలెవ్వరూ అభ్యర్థుల తరఫున ప్రచారానికి వెళ్లలేదు. పార్టీ జాతీయ నేత దిగ్విజయ్‌సింగ్ ప్రచారానికి వచ్చినప్పుడు బయటకు వచ్చిన నేతలు ఆ తర్వాత ప్రచారంలో తిరిగిన దాఖలాలే లేవు.
సీఎంకు గవర్నర్ అభినందనలు
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్‌ఎస్‌కు అభినందనలు వెల్లువెత్తాయి. కేసీఆర్‌కు గవర్నర్ నరసింహన్ ఫోన్లో అభినందనలు తెలి పారు. సినీ నటులు నందమూరి బాల కృష్ణ, కృష్ణ, మోహన్‌బాబు కూడా సీఎంకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.
బాబు ప్రచారం చేసినా ‘ఒక్కటే’
గ్రేటర్‌లో తమ ఉనికి చాటుకోవడానికి ఏపీ సీఎం చంద్రబాబు రెండ్రోజుల పాటు టీడీపీ, బీజేపీ కూటమి తరఫున ప్రచారం చేసినా టీడీపీకి ఒకే ఒక్క సీటు దక్కింది. కూకట్‌పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్‌బీ డివిజన్‌ను మాత్రమే ఆ పార్టీ గెలుచుకుంది. టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎల్‌బీనగర్, ఉప్ప ల్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్‌తో పాటు ఆ పార్టీకి కంచుకోటగా భావించే కూకట్‌పల్లి నియోజకవర్గంలో బాబు విస్తృతంగా పర్యటించారు. ఆయన కుమారుడు లోకేశ్ హైదరాబాద్ అభివృద్ధికి తన తాత, తండ్రి తోడ్పడ్డారని ఎంత గా చెప్పినా ఓటర్లు పట్టించుకోలేదు.
అన్నిచోట్లా క్లీన్‌స్వీప్..
గ్రేటర్ పరిధిలోని ఎల్బీ నగర్, ఉప్పల్, మల్కాజ్‌గిరి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ స్వీప్ చేసింది. ఈ నియోజకవర్గాల్లోని అన్ని డివిజన్లలో ఆ పార్టీ అభ్యర్థులు భారీ మెజారిటీ సాధించారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఒకటి మినహా అన్ని డివిజన్లను అధికార పార్టీ గెలుచుకుంది.
వీటిలో మల్కాజిగిరి మినహా మిగిలిన నియోజకవర్గాల్లో టీడీపీ, బీజేపీ శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న రాజేంద్రనగర్‌లో ఆ పార్టీకి ఒక్క డివిజన్ కూడా దక్కలేదు. సెంట్రల్ సిటీలోనూ ఇదే పరిస్థితి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న అంబర్‌పేటలో ఆ పార్టీకి ఒక్క సీటూ దక్కలేదు.
అంబర్‌పేటలో అన్ని డివిజన్లలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. బీజేపీ శాసనసభాపక్షం నేత లక్ష్మణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ముషీరాబాద్‌లోనూ బీజేపీకి పరాజయమే ఎదురైంది. ఈ నియోజకవర్గంలో ఎంఐఎం ఒక్క డివిజన్‌లో విజయం సాధించగా.. మిగిలిన అన్ని చోట్ల టీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు.
ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్‌నగర్, సికింద్రాబాద్‌తో పాటు ఒక్క డివిజన్ ఉన్న కంటోన్మెంట్ నియోజకవర్గంలోనూ టీఆర్‌ఎస్ జయ కేతనం ఎగురవేసింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 2, ముషీరాబాద్ నియోజవర్గంలో ఒక డివిజన్‌లో ఎంఐఎం గెలవడం మినహా సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గాన్ని క్లీన్‌స్వీప్ చేసింది. ఇక హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని పాతబస్తీలో ఎంఐఎం మరోసారి తన ఉనికిని చాటుకుంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏడు నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది.
పార్టీలు పోటీ చేసిన, గెలిచిన స్థానాలు..
పార్టీ పోటీ గెలుపు
టీఆర్‌ఎస్ 150 99
ఎంఐఎం 60 44
బీజేపీ 66 4
కాంగ్రెస్ 149 2
టీడీపీ 95 1
బీఎస్పీ 55 0
సీపీఐ 21 0
సీపీఎం 22 0
లోక్‌సత్తా 26 0
రిజిస్టర్డ్ పార్టీలు 49 0
స్వతంత్రులు 640 0
‘గ్రేటర్’ వివరాలు..
జీహెచ్‌ఎంసీ విస్తీర్ణం 625 చ.కి.మీ.
మొత్తం ఓటర్లు 74,24,080
పురుషులు 39,69, 007
మహిళలు 34,53,910
ఇతరులు 1,163
మొత్తం వార్డులు 150