రాష్ట్ర పోలీసుల చేతికి ‘టెక్నాలజీ’వజ్రాయుధం అందింది. నేరాల నియంత్రణ నుంచి పరిశీలన, దర్యాప్తు, విచారణల తీరు దాకా అన్ని అంశాలూ అరచేతిలోనే ఇమిడిపోయేలా ‘టీఎస్ కాప్’అందుబాటులోకి వచ్చింది. ప్రపంచ స్థాయి పోలీసింగ్‌కు తోడ్పడేలా రూపొందిన ఈ యాప్‌ను సోమవారం హైదరాబాద్‌లో డీజీపీ మహేందర్‌రెడ్డి, ఐపీఎస్ అధికారులతో కలసి ఆవిష్కరించారు. దీనిని తొలుత పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్‌లో పరిశీలించగా.. పెట్రోలింగ్ సిబ్బంది, సెక్టార్ ఎస్సైలు, బ్లూకోల్ట్స్ సిబ్బందికి చాలా ఉపయోగపడింది. మంచి ఫలితాలను సాధించిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ సిబ్బందికి అందుబాటులోకి తీసుకువచ్చారు. పోలీసు శాఖలోని దాదాపు 14 ప్రధాన విభాగాలు టీఎస్ కాప్ యాప్‌ను ఉపయోగించుకునేలా రూపొందించినట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. – సాక్షి, హైదరాబాద్
పకడ్బందీ దర్యాప్తునకు
అప్పటికప్పుడు ఘటనా స్థలం (ఫీల్డ్)లోనే ఫిర్యాదు తీసుకోవడం, అక్కడే ఫొటోలు, వీడియోలు తీసుకోవడం, సాక్షుల వాంగ్మూలం తీసుకుని యాప్‌లో అప్‌లోడ్ చేయడం, ఎఫ్‌ఐఆర్‌లు, ఫిర్యాదుల పరిస్థితులను పర్యవేక్షించడం, రోజూ కేసుల దర్యాప్తును పరిశీలించడం ఈ యాప్‌తో చేయవచ్చు. డీఎస్‌ఆర్‌లు సైతం యాప్ ద్వారా పంపించడం, స్వీకరించడం, అనాలిసిస్ చేయడం, రిపోర్ట్ అప్‌డేట్ చేయ డం వంటివాటికీ తోడ్పడుతుంది.
సిబ్బంది హెచ్‌ఆర్ విషయాల్లోనూ..
పోలీసు అధికారులు, సిబ్బంది పే స్లిప్‌లు, లీవ్ మేనేజ్‌మెంట్, డైలీ పెర్ఫార్మెన్స్, ఆరోగ్య భద్రత స్కీమ్, సర్వీసు రికార్డులు, బదిలీ వ్యవహారాలతో పాటు శిక్షణకు సంబంధించిన అంశాలు కూడా యాప్‌లో అందుబాటులోకి రానున్నాయి.
కోర్టులు, విచారణాంశాలు
కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్లు, విచారణ ఏ దశలో ఉందన్న విషయాలను కూడా యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. కోర్టు కానిస్టేబుళ్లు ప్రతి విషయాన్ని యాప్ ద్వారా అప్‌డేట్ చేస్తారు. స్టే ఆర్డర్లు, అప్పీళ్లు, పరిష్కరించిన కేసులు, నోటీసులు, సమన్లు, వారెంట్లు, రోజువారీ కేసు డైరీలు వంటివీ పరిశీలించవచ్చు.
నిఘా వేయడంలోనూ తోడ్పాటు
నేరాలు జరగకుండా ప్రతిక్షణం అప్రమత్తం చేసే ఇంటెలిజెన్స్ డ్యూటీలోనూ టీఎస్ కాప్ యాప్ కీలకం కానుంది. ఇంటిగ్రేటెడ్ పీపుల్స్ ఇన్ఫర్మేషన్ హబ్‌గా ఉపయోగపడుతుంది. నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన వ్యూహాలను సైతం ఇంటెలిజెన్స్ విభాగం ఈ యాప్ ద్వారా అధికారులకు చేరవేయనుంది.
నేర నియంత్రణకు చర్యలు
నేరం జరగకుండా చర్యలు చేపట్టేందుకు కావాల్సిన అంశాలు యాప్‌లో అందుబాటులో ఉంటాయి. ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఉన్న సీసీ కెమెరాలు, సెల్‌ఫోన్ టవర్లు, ప్రవేశ, నిష్క్రమణ దారులు, లుక్ ఔట్ నోటీసులు, పదే పదే నేరాలకు పాల్పడే వారి జాబితా, నేరస్థలంలో సేకరించాల్సిన ఆధారాలు, నిందితులకు సంబంధించి 360 డిగ్రీ ప్రొఫైల్, ఇతర రాష్ట్రాల్లోని నేరస్తుల జాబితాలు, రాష్ట్రంలోని అన్ని టోల్ ప్లాజాల సీసీ కెమెరాలు వంటి వాటిని ఈ యాప్ ద్వారా చెక్ చేయవచ్చు.
ట్రాఫిక్ మేనేజ్‌మెంట్
ఎన్‌ఫోర్స్‌మెంట్, చలానాలు, స్వాధీనం చేసుకున్న వాహనాల వివరాలు, సిబ్బంది డ్యూటీలు, ఉల్లంఘనుల జాబితా, ల్యాండ్ మార్క్‌లు, ప్రమాదాల హాట్ స్పాట్లు, వాటి గుర్తింపు, అనాలి సిస్, వాటర్ లాగింగ్ ప్రాంతాలు, పార్కింగ్ వివరాలు తదితర సమా చారాన్ని యాప్‌తో పొందవచ్చు.
అందుబాటులో విస్తృత సమాచారం
డయల్ 100కు వచ్చే ఫోన్‌కాల్ నుంచి నేరం, దర్యాప్తు, నిందితుల గుర్తింపు, చార్జిషీటు.. శిక్ష పడిన విషయం వరకు ప్రతి అంశంలో టీఎస్ కాప్ యాప్ సిబ్బందికి ఉపయోగపడుతుంది. ఈ యాప్‌లో 54 సర్వీసులను 8 విభాగాలుగా పొందుపరిచారు. యాప్ వినియోగంపై సిబ్బందికి శిక్షణ ఇస్తారు. ఇందుకు రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లకు 2,500 ట్యాబ్‌లు ఇచ్చినట్టు డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు.
అయితే ఈ 54 సర్వీసులను యాప్‌లో అందుబాటులో ఉన్న రూల్ ఆఫ్ డ్యూటీ ప్రకారం ఉపయోగించుకోవాలని స్పష్టం చేశారు. అన్ని సర్వీసులు అందరు సిబ్బందికి ఓపెన్ కావన్నారు. క్రైమ్ సిబ్బందికి నేర నియంత్రణ, ట్రాఫిక్ వాళ్లకు ట్రాఫిక్ మేనేజ్‌మెంట్.. ఇలా ఏ విభాగం సిబ్బందికి అవసరమైన సమాచారం వారికి అందుబాటులో ఉంటుందన్నారు. సిబ్బందికి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను ఏర్పాటు చేస్తామన్నారు.
నేరస్తుల గుర్తింపు, నిర్ధారణ అంశాలు
నేరం జరిగిన ప్రాంతంలో అనుమానిత వాహనాలు, వ్యక్తుల వివరాలు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, పాన్ కార్డు, రేషన్ కార్డు, మొబైల్ నంబర్ చిరునామా పరిశీలన వంటి వివరాలను యాప్ ద్వారా క్షణాల్లో పొందవచ్చు. నేరం చేసిన తీరును బట్టి ఏ ముఠా చేసింది, ఇంతకు ముందు ఈ తరహాలో నేరం జరిగిందా అన్నది పరిశీలించవచ్చు.
ముఠాల్లోని నేరస్తులు, వారి హిస్టరీ షీట్ డేటా బేస్ అందుబాటులో ఉంటుంది. శిక్ష అనుభవించి జైల్లోంచి విడుదలైన వారి జాబితా, క్రైమ్ మ్యాపింగ్, ఆన్‌లైన్ ఫింగర్ ప్రింట్ వెరిఫికేషన్ కూడా కీలక తోడ్పాటు ఇవ్వనున్నాయి. శిక్ష పడిన నేరస్తులు, నిందితులకు సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న 16 వేల కోర్టుల నుంచి సమాచారం అందుబాటులో ఉండటం మరో ప్రత్యేకత.
అత్యవసర స్పందన (ఎమర్జెన్సీ రెస్పాన్స్)
బాధితులు డయల్ 100కు కాల్ చేయడం, కాల్ సెంటర్ నుంచి పెట్రోలింగ్ వాహనాన్ని అలర్ట్ చేయడం ఈ యాప్ సాయంతో సులువవుతుంది. పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసు సిబ్బంది ఘటన తీవ్రతను బట్టి యాప్ ద్వారా దగ్గర్లో ఉన్న మిగతా పెట్రోలింగ్ వాహనాలను, దగ్గర్లోని పోలీసు అధికారులను అప్రమత్తం చేయవచ్చు. యాప్‌లోని బజర్ నొక్కడం ద్వారా అదనపు బలగాలను ఘటనా స్థలికి రప్పించుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment