సినీనటిపై అత్యాచారయత్నం
హైదరాబాద్ : ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిపై ఓ యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అతని బారి నుంచి తప్పించుకున్న యువతి రాత్రంతా బాత్రూమ్ లో దాక్కుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడిని బుధవారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా ఉరవకొండ గ్రామానికి చెందిన యువతి (18) గత మూడు సంవత్సరాల నుంచి సినిమాల్లో చిన్నక్యారెక్టర్స్ వేస్తూ యూసుఫ్‌గూడ సమీపంలోని ఎల్‌ఎన్‌నగర్‌లో తన తల్లి, సోదరుడితో కలిసి ఉంటోంది. తల్లి, సోదరుడు ఈ నెల 22 న స్వగ్రామానికి వెళ్లారు. సోమవారం స్నేహితులతో కలిసి ఓ విందులో పాల్గొన్న యువతి రాత్రి ఒంటిగంట సమయంలో ఇంటికి వచ్చింది.
అయితే యువతి ఇంటి పక్కనే ఓ టీవీ చానెల్‌లో డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్న రత్నకుమార్ (25) అనే వ్యక్తి ఉంటున్నాడు. యువతి ఒంటరిగా ఉండటాన్ని గమనించిన రత్నకుమార్ అర్థరాత్రి ఆమె ఇంట్లోకి దూరాడు. ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో యువకుడి చెర నుంచి తప్పించుకున్న యువతి బాత్‌రూమ్‌లో దాక్కుంది. దీంతో రత్నకుమార్ అక్కడ నుంచి వెళ్లిపోయాడు. జరిగిన విషయాన్ని యువతి తన తల్లికి ఫోన్ ద్వారా చెప్పగా, ఆమె చుట్టుపక్కల వారికి సమాచారమివ్వడం.. వారంతా వచ్చి కేకలు వేయడంతో ఆమె బాత్రూమ్ నుంచి బయటకు వచ్చింది. దీంతో మంగళవారం బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రత్నకుమార్‌పై ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతనిని అరెస్టు చేశారు.