
హైదరాబాద్‌లో రెండు భారీ ఫ్లై ఓవర్లు
- త్వరలో ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్, అంబర్‌పేట ఫ్లై ఓవర్ల పనులు
- పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ నుంచి హైదరాబాద్ నగరానికి సులువుగా ప్రయాణించేందుకు వీలుగా రెండు ప్రధాన ప్రాజెక్టులను త్వరలో ప్రారంభిస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అంబర్‌పేట ఫ్లై ఓవర్‌తోపాటు ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని ప్రకటించారు. ఈ రెండు ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణను వేగవంతం చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. భూసేకరణ చట్టానికి అడ్డంకులు తొలిగిన నేపథ్యంలో ఈ రెండు ప్రాజెక్టుల భూసేకరణను రెండు నెలల్లో పూర్తి చేయాలని సూచించారు. రూ.960 కోట్లతో ఉప్పల్ నుంచి నందనవనం భాగ్యనగర్ వరకు 6.4 కిలోమీటర్లతో ఈ ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించనున్నారు. ఉప్పల్ నుంచి నగరానికి ఎలాంటి ట్రాఫిక్ చిక్కులు లేకుండా ప్రయాణించేందుకు వీలుగా 4 లైన్లతో నిర్మించే కారిడార్‌కు జాతీయ ఉపరితల రవాణా శాఖ ఆమోదం తెలిపిందని కేటీఆర్ చెప్పారు.
రూ.960 కోట్ల లో రూ.330 కోట్లు భూసేకరణకు కేటాయించారని, మిగతా మొత్తం ప్రాజెక్టు నిర్మాణానికి వినియోగిస్తామని వివరిం చారు. ప్రాజెక్టు డిజైన్‌కు ఆమోదం లభించిందని, డీపీఆర్ సిద్ధంగా ఉందని తెలిపారు. 24 నెలల్లోగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. రూ.243 కోట్లతో అంబర్‌పేట్ ఫ్లై ఓవర్ నిర్మిస్తామని, రూ.130 కోట్లు భూసేకరణకు, రూ.110 కోట్లు ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చు చేస్తామని వివరిం చారు. గోల్నాక నుంచి రామంతాపూర్ వరకు 1.4 కిలోమీటర్ల ఫ్లై ఓవర్‌ను నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. భూసేకరణ పూర్తయ్యాక టెండర్లు పిలు స్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టుల ఆమోదం కోసం సీఎం కేసీఆర్ స్వయంగా కేంద్రమంత్రి గడ్కరీకి ఫోన్ చేసి పలుమార్లు విజ్ఞప్తి చేశారని తెలిపారు. మే 1న సీఎం ఆదేశాల మేరకు మున్సిపల్ శాఖ, జాతీయ రహదారుల అధికారులతో ఢిల్లీలో గడ్కరీతో సమావేశమయ్యామని చెప్పారు. మొదట వరంగల్–హైదరాబాద్ రోడ్డు కనెక్టివిటీపై ట్రాఫిక్ స్టడీస్ నిర్వహించామని తెలిపారు.