బతుకు మట్టిపాలు!
⇒ ఇద్దరు మహిళా కూలీల సజీవ సమాధి
⇒ సెల్లార్‌లో పని చేస్తుండగా కూలిన మట్టిపెళ్లలు
⇒ మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఘటన
హైదరాబాద్: మట్టి పెళ్లలు వారి పాలిట మృత్యువయ్యాయి. సెల్లార్‌లో పనిచేస్తుండగా ఒక్కసారిగా మట్టిపెళ్లలు మీద పడటంతో ఇద్దరు మహిళా కూలీలు సజీవ సమాధి అయ్యారు. సోమవారం ఉదయం మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొండాపూర్‌లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మట్టిపెళ్లలు పడుతున్న విషయాన్ని గమనించి మరో నలుగురు బయటకు పరుగు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు. వీరిలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా సిరగపురం మండలం బీపేట గ్రామానికి చెందిన దంపతులు పల్లపు పాపయ్య, కిష్టమ్మ(45), కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మహ్మద్‌నగర్ గ్రామానికి చెందిన ఎ.బాలయ్య అలియాస్ బాల్‌రాజ్, భారతమ్మ(25)తో పాటు శాంతమ్మ, హన్మాండ్లు కొండాపూర్‌లో వంశీరాం కన్‌స్ట్రక్షన్స్ సంస్థ చేపడుతున్న సెల్లార్‌లో కూలి పనుల కోసం వచ్చారు.
రిటైనింగ్ వాల్‌తోపాటు ప్లింత్‌భీంల ఏర్పాటు కోసం గ్రానైట్ రాళ్లను కూలీలు మోస్తున్నారు. సోమవారం ఉద యం 9.45 గంటలకు సెల్లార్ తూర్పు వైపున ఒక్కసారిగా కుంగి మట్టి పెళ్లలు విరిగి పడ్డాయి. గ్రానైట్ రాళ్లు మోస్తున్న కిష్టమ్మ, భారతమ్మ ఆ మట్టి పెళ్లలో కూరుకుపోయి తుదిశ్వాస విడిచారు. పాపయ్య, బాలయ్య, శాంతమ్మ, హన్మాండ్లు మట్టి పెళ్లలు విరిగి పడటాన్ని గమనించి బయటకు పరిగెత్తి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. స్వల్పంగా గాయపడిన పాపయ్య, బాలయ్యను మాదాపూర్‌లోని మ్యాక్స్ క్యూర్ ఆస్పత్రికి తరలించారు. మట్టిలో కూరుకుపోయిన మృతదేహాలను వెలికి తీసేందుకు మాదాపూర్ పోలీసులు మూడు గంటలపాటు శ్రమించారు. పారతో మట్టిని తొలగించి రెండు మృతదేహాలను బయటకు తీసి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా, మృతదేహాలతో బాధిత కుటుంబాలు ధర్నా చేశారు. ఘటనా స్థలాన్ని మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, మాదాపూర్ డీసీపీ విశ్వప్రసాద్ తదితరులు పరిశీలించారు.
బిల్డర్, సైట్ ఇంజనీర్లపై కేసు
మూడు సెల్లార్లు, జి ప్లస్ 3 అంతస్తులకు పాటి మహిపా ల్‌రెడ్డి పేరిట జీహెచ్‌ఎంసీ హెడ్ ఆఫీస్ నుంచి అనుమతి ఉందని శేరిలింగంపల్లి సర్కిల్ 11 ఉపకమిషనర్ సురేశ్ రావు తెలిపారు. పనులను వంశీరాం కన్‌స్ట్రక్షన్స్ చేపడు తోందని, 30 అడుగుల లోతు సెల్లార్ తవ్వారని చెప్పారు. ప్రమాదానికి సంబంధించి బిల్డర్, సైట్ ఇంజనీర్, సూపర్‌వైజర్లపై ఐపీసీ 304 పార్ట్ 2 సెక్షన్ కింద కేసు నమో దు చేస్తామని మాదాపూర్ డీసీపీ విశ్వప్రసాద్ తెలిపారు.
రూ.16 లక్షల నష్టపరిహారం: మేయర్
బిల్డర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు స్పష్టమవుతోందని మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొ న్నారు. లేబర్ విభాగం నుంచి రూ.6 లక్షలు, జీహెచ్ ఎంసీ నుంచి రూ.2 లక్షలు బాధిత కుటుంబాలకు అందజేస్తామ ని, బిల్డర్ నుంచి మరో రూ.8 లక్షలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. మరణించిన వారి అంత్యక్రియలకు రూ. 50 వేలు అందజేస్తామని, క్షతగాత్రులకు ఉచితంవైద్యం అంది స్తామని చెప్పారు. ఘటనపై రెండు మూడు రోజుల్లో నివేది క అందించాలని అధికారులను ఆదేశించారు. మట్టి పెళ్లలు కూలి ఇద్దరు మహిళల మృతికి కారణమైన వారిపై క్రిమి నల్ కేసులు నమోదు చేస్తామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి ప్రకటించారు.