ఏమిటీ నిర్లక్ష్యం? | "Small problems can't be solved. | Sakshi
Sakshi News home page

ఏమిటీ నిర్లక్ష్యం?

Published Mon, Jun 13 2016 11:38 PM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

ఏమిటీ నిర్లక్ష్యం? - Sakshi

ఏమిటీ నిర్లక్ష్యం?

సిటీబ్యూరో  ‘చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించలేరా..గుంతలు, రోడ్లను కూడా నేనే పరిశీలించి ఆదేశాలు ఇవ్వాలా.. ? నేను (మంత్రి), మేయర్, కమిషనర్ వస్తే తప్ప  పనులు చేయరా...’ అంటూ  రాష్ట ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులపై తీవ్ర అసహనం, ఆగ్రహం  వ్యక్తం చేశారు.  సోమవారం శ్రీనగర్‌కాలనీ, యూసుఫ్‌గూడ, గాజులరామారం, బాలానగర్ తదితర ప్రాంతాల్లోని రహదారుల పనులను పరిశీలించిన ఆయన..తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీనగర్‌కాలనీ, యూసుఫ్‌గూడలలో రోడ్లపై గుంతలు, వివిధ విభాగాలు ఇష్టారాజ్యంగా చేస్తున్న తవ్వకాలపై మంత్రి సీరియస్ అయ్యారు. అధికారులు, విభాగాల మధ్య సమన్యయ లోపంతోనే ఈ సమస్యలు ఏర్పడుతున్నాయని తేల్చిచెప్పారు. తన పర్యటనతో అధికారుల్లో గుబులు పుట్టించారు.  పనులు పూర్తి చేసేందుకు నెలరోజులు పడుతుందని కాంట్రాక్టర్, 15 రోజుల్లో అవుతుందని విద్యుత్ శాఖ ఇంజినీర్లు చెప్పడంతో ‘స్టోరీలు  చెప్పొద్దు’ అంటూ హెచ్చరించారు.


రెండు పనులు కలిసి నెల అనడంతో ‘కామన్‌సెన్స్ లేదా..’అంటూ అసహనం వ్యక్తం చేశారు.  తవ్వకాలతో తాగునీటి లైన్లు పాడవడంతో దాదాపు 45 రోజులుగా నీరు రావడం లేదని స్థానికులు మంత్రి దృష్టికి తెచ్చారు. మరోచోట గత కొన్ని రోజులుగా మురుగునీటి సమస్య ఉందని ఫిర్యాదు చేశారు. పరిస్థితి ఇలాగే ఉంటే మరో భోలక్‌పూర్ ఘటన పునరావృతమవుతుందని మంత్రి హెచ్చరించారు. పనులు పూర్తయ్యేంత వరకు ఒక వర్క్ ఇన్‌స్పెక్టర్‌ను అక్కడే ఉంచాలని సూచించారు. హెచ్‌టీ లైన్లు, పైపులైన్లు తదితరమైన వాటికోసం రోడ్లు తవ్వి ఎంతకాలమైనా పనులు పూర్తికాపోవడంతో ప్రజలు పడుతున్న బాధలు చూసి అసహనానికి గురయ్యారు. ఎక్కడి కక్కడే చెత్తకుప్పలు, మట్టిదిబ్బలు, ప్రజలు నడవాల్సిన ఫుట్‌పాత్‌లపై పిచ్చిమొక్కలు కనిపించడంతో  తట్టుకోలేకపోయారు. వాటిని ఎప్పటికప్పుడు బాగుచేయవద్దా అని అధికారులను నిలదీశారు. పలు చోట్ల రోడ్ల నాణ్యతపై, గుంతలపై తీవ్ర అసంతప్తి వ్యక్తం చేసారు.

 
గవర్నర్  వ్యాఖ్యలపై ఆరా తీసిన మంత్రి..
పర్యటనలో యూసుఫ్‌గూడ  కార్పొరేటర్ సంజయ్‌గౌడ్‌ను ప్రత్యేకంగా పిలిపించి మాట్లాడారు. ఇటీవల ఆయన గవర్నర్‌ను కలిసిన నేపథ్యంలో ఆ వివరాలు కనుక్కొన్నారు. రోడ్ల పరిస్థితిపై గవర్నర్ చేసిన వ్యాఖ్యల గురించి ఆరా తీశారు. స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, స్థానిక సర్కిల్ అధికారులపై  మంత్రి  అసంతృప్తి  వ్యక్తం చేసారు. కింది స్థాయి సిబ్బంది, డిప్యూటీ కమిషనర్‌స్థాయి అధికారుల పనితీరు ఏమాత్రం బాగులేద న్నారు. సాక్షాత్తు గవర్నర్ వచ్చి  చెప్పినా సమస్యలు పట్టించుకోరా అంటూ అధికారులపై మండిపడ్డారు. అసలే ఇరుకు దారిలో నిత్యం  మురగునీరు పారుతుందని, డంపర్‌బిన్‌లు నిండిపోతున్నా పట్టించుకున్న పాపాన పోవడం లేదని స్థానికులు ఈ సందర్భంగా మంత్రికి ఫిర్యాదు చేశారు.  వివిధ విభాగాల వారు ఒకరి తర్వాత ఒకరు రోడ్లను తవ్వి వదిలేస్తున్నారని, ఆ తర్వాత గాలికి వదిలేస్తున్నారని, కళ్యాణ్‌నగర్, శ్రీనగర్‌కాలనీల్లో  చాలా కాలం క్రితమే రోడ్లను తవ్వి కేబుల్స్ వేసినప్పటికి ఇప్పటికీ  పూడ్చలేదని ఫిర్యాదు చేశారు. వివిధ విభాగాల అధికారులు , మెట్రో అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.


మంత్రి పర్యటన ముఖ్యాంశాలు.....
బురదమయంగా మారిన రహదారిపై మంత్రి వస్తున్నాడని తెలియడంతో అధికారులు అప్పటికప్పుడు ఎల్లారెడ్డిగూడ ఎస్‌బీఐ బ్యాంకు ముందు ఉన్న బురద మట్టిని ఫుట్‌పాత్ మీద వేస్తుండగా మంత్రి గమనించి ఇది  పాదచారులకు ఇబ్బంది కాదా అని మందలించారు.


కేబుల్ పనుల తవ్వకాల వల్ల, వర్షం వల్ల ఇక్కడ బురదలో కిందపడి ప్రజలు  గాయపడుతున్నా  అధికారులు ఏం చేస్తున్నారంటూ స్థానిక డీసీని పిలిచి మందలించారు. రెండు నెలలుగా ఇక్కడ పరిస్థితి ఇలాగే ఉందని స్థానికులు ఫిర్యాదులు చేస్తున్నా సంబంధిత సిబ్బంది మరమ్మతులు చేయకపోవడంపై

ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికుడు ఎండి. ఉమర్ అనే వ్యక్తి కేటీఆర్ వద్దకు వచ్చి మురుగునీటి సమస్యను ప్రస్తావించారు.


యూసుఫ్‌గూడలో ఒకే రోడ్డులో రెండు వైపులా రోడ్ల తవ్వకాలతో మధ్యలో ఉన్న రోడ్డు గురించి అధికారులతో మంత్రి మాట్లాడారు. రెండు వైపులా తవ్వకాలకు అధికారులు అనుమతులిస్తే మధ్యలో వాహనదారులు చిన్న రోడ్డుపై సర్కస్ ఫీట్లు చేయాలా అంటూ ప్రశ్నించారు.


యూసుఫ్‌గూడ చెక్‌పోస్టులో బస్టాప్‌లో మంత్రి ఆగి ఉన్న ప్రయాణికులతో సంభాషించారు. ఈ సందర్భంగా వారు ఇక్కడ బస్‌షెల్టర్‌లేదని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు  దృష్టికి తేగా తాత్కాలికంగానైనా వెంటనే షెల్టర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.


మెట్రోపనుల కోసం యూసుఫ్‌గూడ ప్రభుత్వ పాఠశాలలో కొంత భాగం ఇవ్వడంతో  ఆ ప్రాంతానికి చేరుకున్న కేటీఆర్ అక్కడ పరిస్థితిపై విద్యార్థులతో మాట్లాడారు. ఇంకా పాఠశాలలో గ్రౌండ్ ఉందా, వసతులు ఎలా ఉన్నాయంటూ ప్రశ్నించారు.


132 కేవీ విద్యుత్‌లైన్‌పనులు ఇంకా ఎన్ని రోజులు చేస్తారు. సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసి రోడ్లపై జనాలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రాజెక్టు విభాగం అధికారికి కేటీఆర్ సూచించారు. గాలి వస్తే కరెంట్ ఎందుకు పోతుందని అడిగారు.


శ్రీనగర్ కాలనీలో  మంత్రి వస్తున్నారని తెలిసి కూడా కాంట్రాక్టర్ లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యాన్‌హోల్ రోడ్డుకు ఎత్తుగా ఉండటంతో ఇలా ఉంటే ఎలా.. అంటూ మండిపడ్డారు.


మొత్తం ఎన్ని రోడ్డు కటింగ్‌లకు అనుమతులిచ్చారు.. ఎన్ని పూర్తయ్యాయి.. మిగతావి ఎప్పుడవుతాయి..పూర్తి సమాచారం అందించాల్సిందిగా మంత్రి  ఆదేశించారు.

 

రూ.5 భోజనం బాగాలేదు...(బాక్సులో)
‘ఇది సాంబారా.. నీళ్లా.. ? కారం ఎక్కువ వేశారు..రచీ పచీ లేదు..ఎలా తినాలి దీన్ని... ’అంటూ స్వయంగా ‘రూ. 5 భోజనం’ తిన్న అనంతరం మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలోని రూ.5 భోజన కేంద్రంలో నాణ్యమైన భోజనం అందించాలన్నారు. ఈ సంఘటన కుత్బుల్లాపూర్ పరిధిలోని షాపూర్‌నగర్‌లో చోటుచేసుకుంది. ఇక ఇక్కడే రూ. 6 కోట్లతో జరుగుతున్న 6 ఎంఎల్ రిజర్వాయర్ నిర్మాణ విషయంలో కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు పనుల విషయంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంట్రాక్టర్‌పై ఫిర్యాదు చేయగా త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మంత్రి వెంట పర్యటనలో మేయర్ బొంతు రామ్మోహన్,  డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, జలమండలి, విద్యుత్, తదితర శాఖల ఉన్నతాధికారులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement