మహిళల సమస్యలంటే అంత హేళనా? | uppuleti Kalpana,roja takes on tdp government | Sakshi
Sakshi News home page

మహిళల సమస్యలంటే అంత హేళనా?

Published Fri, Aug 29 2014 1:07 AM | Last Updated on Sat, Aug 18 2018 5:15 PM

uppuleti Kalpana,roja takes on tdp government

టీడీపీపై ధ్వజమెత్తిన రోజా, ఉప్పులేటి కల్పన

ఎన్టీఆర్‌పై చెప్పులేయించిన యనమల నీతులు మాట్లాడుతున్నారు
డ్వాక్రా రుణాల మాఫీ గురించి హామీనిచ్చి మాట మారుస్తున్నారు
ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్‌పై చర్చించకుండా తప్పుదోవ పట్టిస్తున్నారు

 
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో మహిళా సమస్యలపై చర్చిద్దామంటే అధికారపక్ష సభ్యులు హేళనగా మాట్లాడుతున్నారని, తమవి సినీ డైలాగులు అంటూ అవమానపరుస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే రోజా ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆమె గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ... ప్రజాస్వామ్యం, సభాసంప్రదాయాలు గురించి టీడీపీ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించి, అసెంబ్లీలో ఆయన్ను మాట్లాడనీయకుండా గొంతు నొక్కిన అప్పటి స్పీకర్ యనమల రామకృష్ణుడు ఇప్పుడు ప్రజాస్వామ్య విలువలపై మాట్లాడటమేంటని ఎద్దేవా చేశారు.
 
ఎన్నికల్లో టీడీపీ హామీనిచ్చిన డ్వాక్రా రుణమాఫీపై మాట్లాడేందుకు చర్చ కోరితే అంగీకరించలేదని, మైక్ ఇవ్వలేదని విమర్శించారు. డ్వాక్రా సభ్యులు వడ్డీల భారంతో రుణమాఫీ జరగకపోవడంవల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నియోజకవర్గాలకు వెళితే నిలదీస్తున్నారని తెలిపారు. సభ నిర్వహణ తీరు సక్రమంగా జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మనం రోడ్ల మీద హోర్డింగ్స్ చూస్తుంటాం. జీరో శాతం వడ్డీ అని రాస్తారు. కానీ కింద చిన్న చుక్క పెడతారు ‘కండిషన్స్ అప్లయ్’ అని. అలాగే వేలుమీద ఓటు సిరా చుక్క పడిన తర్వాత రుణమాఫీకి ‘కండిషన్స్ అప్లయ్’ అంటున్నారు చంద్రబాబు’’ అంటూ ఎద్దేవా చేశారు.
 
మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్న టీడీపీ అధికారంలోకి వచ్చాక మాట మారుస్తోందని, ప్రజల్ని మభ్య పెడుతుందని ధ్వజమెత్తారు. టీడీపీ నేతలు టీవీ చర్చల్లో పాల్గొని జగన్ సమస్యల గురించి మాట్లాడటం లేదని ప్రజల్ని తప్పుదోవ పట్టించడం సిగ్గు చేటన్నారు. రుణాల కోసం బ్యాంకులకు వెళుతున్న రైతులు, డ్వాక్రా మహిళల్ని దొంగల్లా చూస్తున్నారని చెప్పారు. అధికార పార్టీ వ్యవహార శైలి వల్ల డ్వాక్రా మహిళలు నానా యాతనలు పడుతున్నారని తెలిపారు.

మరో ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన మాట్లాడుతూ... ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై చర్చించడం లేదని, ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టించే విధంగా అధికారపార్టీ సభ్యుల వ్యవహారశైలి ఉందన్నారు. ఎస్సీలకు ఇతోధికంగా మేలు చేసిన వైఎస్‌పైనా, జగన్‌పైనా బురద జల్లడమే పనిగా పెట్టుకుని చంద్రబాబు ప్రాపకం కోసం పాకులాడటం హేయమని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement