జూబ్లీహిల్స్‌లోని ఆరెకరాల పడావు భూమిపై
అధికారుల మల్లగుల్లాలు
ఎల్‌ఎంఏ నిర్ణయంపై చర్చ
సర్కారు అనుమతి కోసం నిరీక్షణ
సిటీబ్యూరో: షేక్‌పేట మండలం జూబ్లీహిల్స్‌లో కోట్లాది రూపాయల విలువ చేసే ఆరు ఎకరాల ప్రభుత్వ పడావు భూమి స్వాధీనంపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. మూడు మాసాల కిందట సీసీఎల్ పరిధిలోని ల్యాండ్ మేనేజ్‌మెంట్ అథారిటీ(ఎల్‌ఎంఏ) ఈ భూమి స్వాధీనంపై నిర్ణయం తీసుకున్నా, సర్కారు నుంచి అనుమతి రాకపోవటంతో జిల్లా రెవెన్యూ శాఖ సందిగ్ధంలో పడింది. ఈ విషయమై ప్రభుత్వానికి నివేదిక సమర్పించినా... ఎలాంటి ఆదేశాలు వెలువడకపోవటంతో భూమి స్వాధీనం చేసుకోవాలని ఎల్‌ఎంఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి బ్రేక్ పడినట్లయింది. ల్యాండ్ మేనేజ్‌మెంట్ అథారిటీ(ఎల్‌ఎంఏ)లో సభ్యులుగా సీసీఎల్‌ఏ కమిషనర్, రెవెన్యూ శాఖ రాష్ట్ర ఉన్నతాధికారి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌తో సహా 12 ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు ఉన్నారు. భూకేటాయింపులు, స్వాధీనం, రెవెన్యూకు సంబంధించిన కీలక సమస్యలపై ఈ అథారిటీ ఆరు మాసాలకోసారి సమావేశమవుతుంది.
‘హాట్’ ఏరియాలో...
నగరంలో సంపన్నుల ప్రాంతంగా పేరొందిన జూబ్లీహిల్స్‌లోని 403 సర్వే నంబరులో 1994-95 సంవత్సరంలో మహర్షి, బాలాజీ, క్రియేటివ్ సంస్థలకు గజానికి కనీస ధర రూ.200 చొప్పున నిర్ణయించి....ఒక్కో సంస్థకు రెండు ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు, పరిశ్రమలు నెలకొల్పలేదు. దీంతో పలుమార్లు ఆయా సంస్థలకు రెవెన్యూ శాఖ నోటీసులుు జారీ చేసింది. చివరిగా రెండు మాసాల కిందట ఖాళీగా ఉన్న ఈ భూములను ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ హెచ్చరిక నోటీసులూ ఇచ్చారు. దీనిపై ఆయా సంస్థలు రాత పూర్వకంగా వివరణ ఇచ్చినా... సంతృప్తి చెందని రెవెన్యూ శాఖ ఆ భూముల స్వాధీనంపై ల్యాండ్ మేనేజ్‌మెంట్ అథారిటీకి నివేదించింది. ఈ నేపథ్యంలో ల్యాండ్ మేనేజ్‌మెంట్ అథారిటీ మూడు మాసాల కిందట నిర్వహించిన సమావేశంలో ఆరు ఎకరాల పడావు భూమి స్వాధీనంపై తీర్మానం చేస్తూ...అనుమతి కోసం ప్రభుత్వానికి నివేదించింది. తీర్మానాలతో కూడిన ఈ మినిట్స్ నివేదిక సర్కారుకు చేరి మూడు మాసాలవుతున్నా ఎలాంటి ఆదేశాలు అందకపోవటంతో భూమి స్వాధీనంపై రెవెన్యూ వర్గాల్లో సందిగ్ధత నెలకొంది. కాగా రాజకీయ ఒత్తిళ్లు, పైరవీల కారణంగానే భూముల స్వాధీనంపై ప్రభుత్వం స్పందించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.
నగరంలో అంతే...
నగరంలో ఎలాంటి కోర్టు కేసులు లేకుండా పడావు(ఖాళీ)గా ఉన్న 164.04 ఎకరాల భూములకు సంబంధించి 138 సంస్థలు సమర్పించిన వివరణ(నివేదిక)లను పరిశీలించిన ల్యాండ్ మేనేజ్‌మెంట్ అథారిటీ సమగ్రమైన నివేదికను సర్కారుకు సమర్పించింది. ముఖ్యంగా షేక్‌పేట మండలంలోని సంపన్నులు నివసించే కాలనీల్లో 25 సంస్థలు వినియోగించకుండా ఖాళీగా ఉంచిన కోట్లాది రూపాయల విలువ చేసే 138 ఎకరాల భూములపై ఏ విధమైన పద్ధతి అనుసరించాలో పేర్కొంటూ ల్యాండ్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఆ నివేదికలో ప్రస్తావించినట్లు తెలుస్తున్నది. అయినా చర్యలు లేకపోవడం విడ్డూరం.
ఏం చేద్దాం?
Published Tue, Sep 15 2015 12:24 AM | Last Updated on Sun, Sep 3 2017 9:24 AM
Advertisement