అభివృద్ధి వన్ బై టూ..
అభివృద్ధికి బొమ్మా బొరుసులా కనిపించే ప్రాంతం బంజారాహిల్స్. ఓపక్క విలాసవంతమైన భవంతులు.. రాజకీయ, సినీ స్టార్లు, వ్యాపార ప్రముఖులకు నిలయం. మరోపక్క ఇరుకు ఇళ్లు.. గల్లీలు.. తాగునీటికి కొట్లాడే కాలనీలు ఇక్కడే కనిపిస్తాయి. ఓ వర్గం ప్రజలకు పాలకులతో పనిలేకున్నా.. మరో వర్గం నేతల కనుసన్నల్లోనే బతుకుతున్నారు. ఇప్పుడు జరగబోయే ‘గ్రేటర్’ ఎన్నికల్లో తమ బతుకులను బాగుచేసే నేతలకే ప్రాధాన్యం ఇస్తామంటున్నారు. - బంజారాహిల్స్
శ్రీమంతులకు కేరాఫ్ బంజారాహిల్స్
దేశంలోనే బంజారాహిల్స్‌కుప్రత్యేక స్థానం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ప్రాంతంగా పేరుంది. ఖరీదైన కార్లు. ఇంద్ర భవనాలను తలపించే ఇళ్లకు నెలవైన ఈ ప్రాంతం ఐదు దశాబ్దాల క్రితం కొండలు, గుట్టలతో ఉండేది. ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే నాయకులకు కేంద్రం. సినీ, రాజకీయ, వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాల ప్రముఖులతో పాటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నివసించే బంజారాహిల్స్ డివిజన్ వీవీఐపీ డివిజన్‌గా పేరొందింది. రేణుకాచౌదరి లాంటి మహిళలు ఇక్కడి నుంచే కేంద్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు.
బంజారాల నివాసంతో పేరు..
ఒకప్పుడు వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన బంజారా ప్రజలు బంజారాహిల్స్ గుట్టల్లో గుడిసెలు వేసుకొని నివసించేవారు. 1960 వరకు ఈ ప్రాంతంలో గిరిజన తండాలే ఉండేవి. వీరు పంజగుట్ట, అమీర్‌పేట, సోమాజి గూడ, బేగంపేట ప్రాంతాల్లోని ఇళ్లల్లో పనిచేస్తూ జీవనం సాగించేవారు. మొదట భాగ్యనగర్ స్టూడియో ఎదురుగా లంబాడీ బస్తీ ఏర్పడింది. ఆ తర్వాత నందినగర్ పేరుతో ఇంకో బస్తీ వచ్చింది. కొన్నేళ్లకు బడాబాబుల దృష్టి ఈ కొండలపై పడింది. మొదట్లో ముస్లింలు, మార్వాడీలు ఇక్కడ ఆవాసాలు ఏర్పర్చుకున్నారు. తర్వాత అన్ని రంగాల ప్రముఖులను ఈ ప్రాంతం ఆకర్షించింది. అధికారికంగా ఈ ప్రాంతాన్ని 1961లో ‘బంజారాహిల్స్’గా నామకరణం చేశారు.
జూబ్లీహిల్స్ మున్సిపాలిటీలో..
1960 ప్రాంతంలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్ ప్రాంతాలు జూబ్లీహిల్స్ మున్సిపాలిటీలో అంతర్భాగంగా ఉండేవి. ఇక్కడంతా ప్రభుత్వ స్థలాలు ఉండడం, నిజాం విక్రయించిన వందలాది ఎకరాల ప్లాట్లు కూడా ఉండడంతో దీనికి ప్రత్యేక అధికారులను నియమించారు. జూబ్లీహిల్స్ సొసైటీ ఏర్పడ్డప్పుడు కూడా ఈ ప్రాంతం జూబ్లీహిల్స్ మున్సిపాలిటీ పరిధిలోనే ఉండేది.
మొదటి కార్పొరేటర్ రేణుకాచౌదరి
1986లో జరిగిన ఎంసీహెచ్ ఎన్నికల్లో బంజారాహిల్స్ డివిజన్ కార్పొరేటర్‌గా రేణుకాచౌదరి టీడీపీ నుంచి విజయం సాధించారు. అనంతరం 16 ఏళ్ల తర్వాత 2002లో జరిగిన ఎంసీహెచ్ ఎన్నికల్లో ఈ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన బి.భారతీనాయక్ గెలిచారు. 2009 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భారతీనాయక్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసి రెండో సారి విజయం సాధించారు.
ల్యాండ్‌మార్క్‌లు..
బంజారాహిల్స్‌లో రోడ్ నెం.12లోని కమాన్ ల్యాండ్‌మార్క్‌గా నిలుస్తోంది. ఆ తరువాత మినిస్టర్ క్వార్టర్‌స, జగన్నాథ ఆలయం, బసవతారకం ఆసుపత్రి, లోటస్‌పాండ్, కేబీఆర్ పార్కు, ఎల్వీప్రసాద్ ఆసుపత్రి, భాగ్యనగర్ స్టూడియో, ప్రసాద్ ఫిలిం ల్యాబ్, హోటల్ తాజ్ బంజారా వంటివి ల్యాండ్ మార్‌కలుగా ఉన్నాయి.
కుదించుకుపోయిన డివిజన్..
రేణుకాచౌదరి కార్పొరేటర్‌గా పోటీ చేసినప్పుడు ఇప్పుడున్న జూబ్లీహిల్స్ డివిజన్, పంజగుట్ట, బంజారాహిల్స్, షేక్‌పేట, శ్రీనగర్‌కాలనీ, వెంకటేశ్వరనగర్ ప్రాంతాలన్నీ బంజారాహిల్స్ డివిజన్‌లోనే ఉండేవి. 2002లో వార్డుల పునర్విభజనలో బంజారాహిల్స్ నుంచి జూబ్లీహిల్స్ డివిజన్ ఏర్పడింది. 2009 ఎన్నికల నాటికి షేక్‌పేట డివిజన్ కొత్తగా ఏర్పడింది. ప్రస్తుతం బంజారాహిల్స్ డివిజన్‌ను మళ్లీ విభజించి ‘వెంకటేశ్వరకాలనీ డివిజన్’ను ఏర్పాటు చేశారు.
డివిజన్ పరిధిలో ప్రాంతాలు...
ఇప్పుడున్న బంజారాహిల్స్ డివిజన్‌లో ఎమ్మెల్యే కాలనీ, లోటస్‌పాండ్, ఎన్బీటీ నగర్, ఎన్బీ నగర్, బోళానగర్, ఖాజానగర్, శ్రీరాంనగర్, గ్రీన్‌బంజారా కాలనీ, మిథిలానగర్, ప్రేమ్‌నగర్, చింతల్‌బస్తీలోని కొంత భాగం, వెంకటరమణ కాలనీలోని కొంత భాగం, శ్రీధర్ ఫంక్షన్‌హాల్, వేమిరెడ్డి ఎన్‌క్లేవ్, ఉదయ్‌నగర్‌లో కొంత భాగం, సింగాడికుంట కొంత భాగం, రోడ్ నెం.13 అంబేద్కర్‌నగర్, రోడ్ నెం.10 గఫార్‌ఖాన్ కాలనీ తదితర ప్రాంతాలున్నాయి.