దాడికి యత్నించాడు
నిర్మాత సి.కల్యాణ్‌పై వైద్యురాలి ఫిర్యాదు
పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసుల గాలింపు
బంజారాహిల్స్: సినీ నిర్మాత సి.కల్యాణ్ తనను అసభ్యకర పదజాలంతో దూషించడంతో పాటు తనపై చేసి దాడికి యత్నించాడని ఓ వైద్యురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సి.కల్యాణ్‌పై ఐపీసీ సెక్షన్ 354 (సి), 506, 509ల కింద కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ గురుస్వామి, బాధితురాలి కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 5లోని విమల్ అపార్ట్‌మెంట్స్, ప్లాట్ నెం. ఎస్-4లో డాక్టర్ తూపల్లి కవిత నివాసం ఉంటున్నారు. అదే అపార్ట్‌మెంట్స్ ప్లాట్ నంబర్ 41లో నిర్మాత సి.కల్యాణ్ ఉంటున్నారు. డాక్టర్ కవిత ఉంటున్న ఇంటిపై కొద్ది రోజుల క్రితం కల్యాణ్ కన్ను పడింది. ఆ ఫ్లాట్‌ను తాను చెప్పిన ధరకు విక్రయించి వెళ్లిపోవాలని మధ్యవర్తులతో హెచ్చరికలు జారీ చేయగా ఆమె పట్టించుకోలేదు. ఈ అపార్ట్‌మెంట్స్‌లోని కొంత భాగం మెట్రో రైలు పనుల్లో భాగంగా రోడ్డు విస్తరణలో పోతుండటంతో జీహెచ్‌ఎంసీ రూ.కోటిన్నర నష్టపరిహారం ప్రకటించింది.
దీంతో ఆ డబ్బు కాజేయాలని కల్యాణ్ పథకం వేశాడు. తాను అపార్ట్‌మెంట్ అధ్యక్షుడినంటూ బోగస్ డాక్యుమెంట్లు సృష్టించి బ్యాంక్ అకౌంట్ తెరిచి పరిహారం చెక్కు తనకు ఇవ్వాలని జీహెచ్‌ఎంసీకి లేఖ రాశారు. అయితే ఈ మొత్తాన్ని అపార్ట్‌మెంట్‌లోని అందరికీ సమానంగా పంపిణీ చేయాలని డాక్టర్ కవిత జీహెచ్‌ఎంసీకి లేఖ రాశారు. దీన్ని జీర్ణించుకోలేని కల్యాణ్ ఆమెపై కక్ష సాధింపు మొదలెట్టారు. సోమవారం సాయంత్రం అపార్ట్‌మెంట్ అసోసియేషన్ సమావేశం జరుగుతుండగా అక్కడికి వెళ్తున్న కవితను అడ్డగించాడు. అసభ్య పదజాలంతో దూషిస్తూ కిందపడేసి కొట్టి లైంగికదాడికి యత్నించాడు. ఇక్కడి నుంచి తక్షణం వెళ్లకపోతే తన అసలు రూపాన్ని చూడాల్సి ఉంటుందని, 4 వేల మంది జూనియర్ ఆర్టిస్టులను తీసుకొచ్చి ఇంటి ముందు ధర్నా చేయిస్తానని బెదిరించాడు.
ఇన్ని రోజులూ చూసిన కల్యాణ్ వేరు.. రేపటి నుంచి చూసే కల్యాణ్ వేరని, హత్య చేస్తానని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కల్యాణ్‌ను నుంచి తనకు ప్రాణహాని ఉందని, అతడిని తక్షణం అరెస్టు చేయాలని మంగళవారం జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌కు వచ్చి డిమాండ్ చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడు కల్యాణ్ కోసం గాలిస్తున్నారు.