స్నేహం వద్దన్నాడని.. బీర్ సీసాతో దాడి
తమతో స్నేహాన్ని కట్ చేశాడన్న కోపంతో ఓ యువకుడిపై.. ఆరు మంది బీర్ సీసాతో దాడి చేసి గాయపర్చిన ఘటన జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిథిలో జరిగింది. ఈ ఘటనలో ఐదు మందిని జూబ్లీహిల్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. మరోనిందితుడు పరారీలో ఉన్నాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రహ్మత్‌నగర్ సమీపంలోని కార్మికనగర్‌లో నివసించే లింగిడి విజయ్‌కుమార్(24) ఫిజియోథెరపిస్టుగా పని చేస్తున్నాడు. ఏడాది క్రితం రహ్మత్‌నగర్‌కు చెందిన రాము, లక్ష్మణ్, షకిల్, శ్రీరాంనగర్‌కు చెందిన సలీం, సొహైల్, నిసార్‌లతో స్నేహం ఉండేది. ఇటీవల కొన్ని కారణాలతో విజయ్‌కుమార్ వారిని కలవడం మానేశాడు. ఈ నెల 16వ తేదీన రాత్రి మెట్టుగూడకు చెందిన మరో స్నేహితుడు ప్రియనాథ్ విజయ్‌తో కలిసి నిమ్స్‌మే ఓపెన్ ల్యాండ్‌లో బీరుతాగుతూ కూర్చున్నారు.
అదే సమయంలో రాము, లక్ష్మణ్, షకిల్, సలీం, సొహైల్, నిసార్‌లు అక్కడికి వచ్చి విజయ్‌కుమార్‌తో గొడవపడ్డారు. అసభ్యంగా దూషించారు. కొట్టి తరిమారు. వీరి బారి నుంచి విజయ్‌కుమార్‌తో పాటు స్నేహితుడు విజయ్ పరారవుతుండగా ఎల్‌ఆర్. కిషోర్ స్కూల్ వద్ద మళ్లీ వీరిద్దరినీ పట్టుకొని తమతోపాటు తెచ్చిన బీరు సీసాలను పగలగొట్టి విజయ్‌కుమార్ కడుపులో గట్టిగా పొడిచారు. లక్ష్మణ్ బీరుసీసాతో తనను పొడవడంతో తీవ్ర గాయాలయ్యాయని వీరందరిపైన చర్యలు తీసుకోవాలంటూ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అయిదు మందిని అరెస్టు చేశారు. లక్ష్మణ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.