అవినీతి, అబద్ధాల్లో కేసీఆర్ నంబర్‌వన్
► ప్రతిష్ట పెరిగితే ఫిరాయింపులు ఎందుకు: ఉత్తమ్
► రెండున్నరేళ్లలోనే రూ.70 వేల కోట్ల అప్పు
సాక్షి, హైదరాబాద్: ప్రజలను మోసం చేయడంలో సీఎం కేసీఆర్ దేశంలోనే నంబర్‌వన్ అని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. పార్టీ ముఖ్య నేతలు మల్లు భట్టివిక్రమార్క, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు, మధుయాష్కీ, జగ్గారెడ్డితో కలసి గాంధీభవన్‌లో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. దేశంలోనే కేసీఆర్ పాపులర్ అని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఊరూపేరూ లేని బోగస్ సంస్థలు చేసిన సర్వేలను గొప్పగా చెప్పుకోవడం టీఆర్‌ఎస్ దిగజారుడు రాజకీయాలకు పరాకాష్టన్నారు. ఎన్నికల హామీల్లో ఎన్ని అమలు చేశారని, ప్రజల కు ఏం చేశారని ప్రతిష్ట పెరిగిందో చెప్పాలన్నారు. కేసీఆర్‌కు తన పాలనపై నమ్మకముంటే రాజకీయ ఫిరాయింపులకు పాల్పడాల్సిన అవసరమేమిట న్నారు.
దేశ ప్రజాస్వామిక వ్యవస్థలోనే ఎక్కడా లే నంతగా గ్రామ సర్పంచ్ స్థాయి నుండి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల దాకా ఫిరాయింపులను ఎందుకు ప్రోత్సహిస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ 60 ఏళ్ల చరిత్రలో 69 వేల కోట్లు అప్పు వారసత్వంగా వస్తే ఈ రెండున్నరేళ్లలోనే 70 వేల కోట్లు అప్పులు చేశారని వివరించారు. అప్పులు చేయడంలో, అవినీతికి పాల్పడటంలో, అబద్ధాలు చెప్పడంలో, మోసం చేయడంలో, కోర్టు కేసుల్లో, న్యాయస్థానాలతో తిట్టించుకోవడంలో సీఎం కేసీఆర్ నంబర్ వన్ అయ్యారని ఉత్తమ్ విమర్శించారు. ఇటీవలి కాలంలోనే నిర్మించిన సచివాలయ భవనాలను వాస్తుపేరుతో కూలగొట్టించడం దారుణమన్నారు. విదేశీ ప్రతినిధులు వస్తే తినడానికి స్థలం లేదంటున్న సీఎం కేసీఆర్‌కు రైతుల రుణమాఫీ కంటే అది ముఖ్యమా అని ఉత్తమ్ ప్రశ్నించారు.