నిరూపిస్తావా..ముక్కు నేలకు రాస్తావా ?
కేసీఆర్‌పై పొన్నాల ఫైర్
సాక్షి, హైదరాబాద్: తాను దళితుల భూములను ఆక్రమించానంటూ టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేసిన ఆరోపణలను టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కొట్టిపారేశారు. ‘కేసీఆర్...నీవు చేసిన ఆరోపణలపై దమ్ముంటే విచారణ జరిపించి నిరూపించాలి. లేకుంటే నీ ముక్కునేలకు రాస్తావా?’అని సవాల్ విసిరారు. గాంధీభవన్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌పై మండిపడ్డారు.
‘పేదరికం, ఆకలి బాధ అనుభవించిన వాడిని నేను. కసితో అమెరికా వెళ్లి ఆత్మగౌరవంతో నా కాళ్లమీద నేను నిలబడ్డాను. కొంత సంపాదించి భూమి కొన్నాను. కేసీఆర్‌తో పోలిస్తే మాత్రం నేను ఇంకా గరీబోడినే. ఎందుకంటే నేను కాంట్రాక్టర్‌ను బెదిరించలేదు. ఉద్యమం పేరుతో చందాలు వసూలు చేయలేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారులను కిడ్నాప్ చే సి డబ్బులు వసూలు చేయలేదు.
క్రికెట్ బుకీలతో చేతులు కలపలేదు. టిక్కెట్లు అమ్ముకోలేదు. ఒక్క టమోటా చెట్టుకు మూడున్నర క్వింటాళ్ల టమోటాలు పండించలేదు. 30 ఎకరాల పొలానికి రూ.50 కోట్ల రుణం తీసుకోలేదు. పైగా నాపై దొంగ పాస్‌పోర్టు, మనషుల అక్రమ రవాణా కేసుల్లేవు’అని ఎద్దేవా చేశారు.
తెలంగాణ ప్రజలకు కేసీఆర్ చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. కేంద్ర కార్మికమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఆ శాఖకు అనుబంధంగా 15 కార్పొరేషన్ సంస్థలుండగా, అందులో తెలంగాణ చెందిన ఏ ఒక్కరికీ అవకాశం కల్పించలేదన్నారు. ఉద్యోగులతో సఖ్యతగా ఉంటానని చెబుతున్న కేసీఆర్.. తన సొంత సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కనీసవేతనాలు ఇవ్వడం లేదని, పీఎఫ్, బోనస్ సౌకర్యం ఎందుకు కల్పించడం లేదని పొన్నాల ప్రశ్నించారు.