నన్ను తిడితేనే కేసీఆర్‌కు ఓటు
ఓటమిని ఆయన అంగీకరించినట్లే: పొన్నాల
{పాణహితకు అనుమతులు సాధించాలి.. తర్వాతే జాతీయ హోదా
కరీంనగర్ సభకు కనీవినీ ఎరగని జనమొచ్చారు
హైదరాబాద్: పనిలేనోడు ఊళ్లు తిరుగుతూ మాట్లాడినట్లుగా టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కేసీఆర్ తరుచూ తనపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం వెనుక కారణముందన్నారు. ‘పొన్నాలను తిడితేనే కేసీఆర్‌కు ఓట్లు పడతాయనుకుంటున్నాడు. అందుకే నన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు. సన్నాసులకు అధికారం అప్పగిస్తే అంతే సంగతులని కేసీఆర్ చెబుతున్నాడు. అంటే కాంగ్రెస్ గెలుస్తుందని ముందే ఓటమిని అంగీకరించిన ఆ పెద్ద మనిషి.. మమ్మల్ని సన్నాసులనడం అనైతికం’ అని పొన్నాల వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఈ మధ్య పదేపదే కేవీపీ జపం చేస్తూ తనపై అవినీతి ఆరోపణలు చేయడం అలవాటుగా పెట్టుకున్నాడన్నారు. తొమ్మిదేళ్లు టీడీపీ ప్రభుత్వంలో భాగస్వామిగా, నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన కడియం శ్రీహరిని పక్కనపెట్టుకుని తనపై ఆరోపణలు చేస్తే ప్రజలెవరూ నమ్మబోరని చెప్పారు. తనకు అన్ని స్థాయిల్లో క్లీన్‌చిట్ లభించిందని, జలయజ్ఞం పనులను వేగవంతం చేసేందుకు సంస్కరణలు తెచ్చింది తామేనని పేర్కొన్నారు.
ఇక ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని కాంగ్రెస్ అధినేత్రి సోనియా హామీనిచ్చిన నేపథ్యంలో దీనిపై పొన్నాల స్పందించారు. ఇప్పటికీ ఎలాంటి అనుమతుల్లేని ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడం కష్టమేనని వ్యాఖ్యానించారు. ‘పోలవరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఉన్నందునే కేంద్రం జాతీయ హోదా కల్పించింది. ప్రాణహిత-చేవెళ్లకు ఎలాంటి అనుమతులు లేవు. కాబట్టి ఇప్పుడు జాతీయ హోదా కల్పించడం సాధ్యం కాదు. ఆ ప్రాజెక్టుకు ముందు అన్ని అనుమతులు రావాలి. ఆ తర్వాత జాతీయ హోదా కల్పించే అంశాన్ని ఆలోచిస్తాం’ అని పేర్కొన్నారు. ఇక కరీంనగర్‌లో సోనియా సభ ఫెయిలైందని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను పొన్నాల తోసిపుచ్చారు. ఆ సభ కనీవినీ ఎరుగని రీతిలో జరిగిందని, గతంలో ఎన్నడూ రానంత పెద్ద సంఖ్యలో జనం వచ్చారని పేర్కొన్నారు.
డీసీసీ ఇన్‌చార్జ్‌ల నియామకం
ఈసారి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల స్థానంలో కొత్త వారిని ఇన్‌చార్జీలుగా నియమించినట్లు పొన్నాల వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డిని, వరంగల్ జిల్లాకు నాయిని రాజేందర్‌రెడ్డిలను నియమించినట్లు తెలిపారు. ఖమ్మం జిల్లాలో పార్టీని నడిపేందుకు సమన్వయ కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.