కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ధీమా వ్యక్తం చేశారు.
హన్మకొండ చౌరస్తా : కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య, పశ్చిమ అభ్యర్థి ఎర్రబెల్లి స్వర్ణను గెలిపించాలని కోరుతూ గురువారం హన్మకొండ 28వ డివిజన్ పరిధిలోని న్యూశ్యాయంపేటలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై తనదైన శైలిలో విమర్శల జల్లు కురిపించారు. కేసీఆర్ ఆచరణకు సాధ్యం కాని హామీలను గుప్పిస్తూ... తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆ తుపాకి రాముడి మాటలను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. కాంగ్రెస్‌కు తెలంగాణ ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారని, ఈ ఆదరణను చూసి కేసీఆర్‌కు ఏమి చేయాలో పాలుపోవడం లేదన్నారు.
తెలంగాణ ఉద్యమం జరుగుతున్న అనేక సమయాల్లో కేసీఆర్ ఫామ్ హౌస్‌లోనే పడుకున్నాడని విమర్శించారు. ప్రొఫెసర్ జయశంకర్ ను అవమానించేలా ప్రవర్తించాడని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే వితంతు, వికలాంగ, వృద్ధాప్య పింఛన్ల మొత్తాన్ని పెంచుతామని, డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలను అందజేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో విద్యుత్ సంక్షోభాన్ని గట్టెక్కించేందుకు ప్రతి మండల కేంద్రంలో సౌరశక్తితో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తామన్నారు.