ఏసీబీ వలలో వనస్థలిపురం సీఐ | vanasthalipuram redhandedly caught acb officials | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో వనస్థలిపురం సీఐ

Published Wed, Aug 28 2013 2:33 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

vanasthalipuram redhandedly caught acb officials

 ఆటోనగర్, న్యూస్‌లైన్: చెక్‌బౌన్స్, చీటింగ్ కేసులో ఓ వ్యక్తిని రిమాండ్ చేసేందుకు డబ్బులు డిమాండ్ చేసి బాధితుని నుంచి రూ.25వేలు లంచంగా తీసుకుంటుండగా వనస్థలిపురం సీఐ వై.వెంకట్‌రెడ్డిని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దిల్‌సుఖ్‌నగర్ పీఅండ్‌టీ కాలనీలో నివసించే  వైఎస్సార్‌సీపీ పీఅండ్‌టీకాలనీ డివిజన్ అధ్యక్షులు సంగాని నర్సింగ్‌రావు, సరళ దంపతులు నాచారంకు చెందిన వై.శరత్‌బాబుకు సంవత్సరం క్రితం రూ.1.90 లక్షలను అప్పుగా ఇచ్చారు. దానికి ప్రామిసరీ నోటుతో పాటు సిండికేట్ బ్యాంక్ దోమలగూడ బ్రాంచికి చెందిన ఓ చెక్కును సరళ పేరుమీద శరత్‌బాబు ఇచ్చాడు. ఈ చెక్కును సరళ హస్తినాపురం ఎస్‌బీఐ బ్యాంకులో జమచేయగా చెక్ బౌన్స్ అయింది.
 
 శరత్‌బాబుపై చీటింగ్ కేసు పెట్టాలని బ్యాంకు అధికారుల సూచన మేరకు.. 2013 ఏప్రిల్, 24న సరళ చెక్‌బౌన్స్ కేసు వేశారు. దాంతో శరత్‌బాబుపై చీటింగ్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని జూలై 19న కోర్టు ఆదేశించింది. ఈ విషయమై నర్సింగ్‌రావు వనస్థలిపురం ఇన్‌స్పెక్టర్ వెంకట్‌రెడ్డిని కలిసి శరత్‌బాబును అరెస్ట్ చేయాలని కోరగా.. అందుకు రూ.45వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇరువురి మధ్య బేరసారాలు జరిగి సోమవారం రూ.30 వేలకు ఒప్పందం కుదిరింది. దీంతో విసిగిపోయిన సంగాని నర్సింగ్‌రావు ఏసీబీ డీఎస్‌పీ శంకర్‌రెడ్డిని ఆశ్రయించి కేసుకు సంబంధించి ఇరువురి మధ్య జరిగిన సంభాషణల రికార్డును అందజేశారు. దీంతో డీఎస్‌పీ శంకర్‌రెడ్డి నర్సింగ్‌రావుకు రూ.25వేలు ఇచ్చి మధ్యవర్తిగా ఏసీబీ ఉద్యోగిని వెంట పంపారు.
 
 మంగళవారం సాయంత్రం 4.45 గంటలకు  వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌లోని సీఐ ఛాంబర్‌లో నర్సింగ్‌రావు రూ.25వేలు ఇచ్చారు. సీఐ వెంకట్‌రెడ్డి కుడిచేతితో డబ్బులు తీసుకుని తన టేబుల్ డ్రాలో పెట్టి తాళం వేశాడు.  అక్కడే మాటువేసి ఉన్న ఏసీబీ అధికారులు సీఐని పట్టుకుని ఛాంబర్‌లోకి తీసుకెళ్లి నగదును స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు. ఇదే పోలీస్‌స్టేషన్‌లో పనిచేసిన సబ్ ఇన్‌స్పెక్టర్ శంకర్ జూన్ 11న చీటింగ్ కేసులో ద్విచక్ర వాహనాన్ని ఇవ్వడానికి రూ.8వేలు లంచంగా తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన విషయం విదితమే. రెండు నెలల వ్యవధిలోనే సీఐ వెంకట్‌రెడ్డి ఏసీబీకి పట్టుబడటం గమనార్హం. ఏసీబీ దాడులలో ఏసీబీ డీసీపీ శంకర్‌రెడ్డితో పాటు సీఐలు వెంకట్‌రెడ్డి, నాయుడు, నిరంజన్, ఎస్.వెంకట్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, అంజిరెడ్డిలు పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న రాజకీయ పార్టీల నాయకులు, లారీల యజమానులు స్టేషన్ వద్దకు చేరుకుని స్వీట్లు పంచిపెట్టారు. కాగా సీఐ వెంకట్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని 1988 అవినీతి నిరోధక చట్టం కింద సెక్షన్ 7 ప్రకారం కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తన నెం-9440446134కు సమాచారం అందించాలని సూచించారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement