హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, నడుస్తున్న తెలంగాణ పత్రిక సంపాదకుడు కాశీంపై పెట్టిన రాజద్రోహం కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో కాశీంపై కేసు ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ 495 మంది కవులు, రచయితల సంతకాల సేకరణ పత్రాన్ని విడుదల చేశారు.
రచయితలను పోలీసు కేసులతో అణగదొక్కలేరని మండిపడ్డారు. మావోయిస్టులకు లేఖలు రాశారనే అభియోగంతో చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేసు పెట్టడం దారుణమని పేర్కొన్నారు. దీనిపై త్వరలోనే హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలసి వినతిపత్రం సమర్పిస్తామని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరించిన విధానాలనే తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తోందని కాశీం దుయ్యబట్టారు.