వెరీ ఫాస్ట్‌గా... వైఫై... | very fast wifi services in hyderabad | Sakshi
Sakshi News home page

వెరీ ఫాస్ట్‌గా... వైఫై...

Published Mon, Feb 2 2015 4:26 AM | Last Updated on Thu, Sep 27 2018 4:02 PM

వెరీ ఫాస్ట్‌గా... వైఫై... - Sakshi

వెరీ ఫాస్ట్‌గా... వైఫై...

గ్రెటర్ వ్యాప్తంగా విస్తరించేందుకు ఐటీశాఖ కసరత్తు
ప్రధాన రహదారులను గుర్తించే పనిలో నిపుణులు
సైబర్ సెక్యూరిటీ మార్గదర్శకాలపై లోతుగా అధ్యయనం
నగర వ్యాప్తంగా 660 కి.మీ పరిధిలో విస్తరణకు యత్నాలు
సాక్షి, సిటీబ్యూరో: మన నగరం పూర్తి ‘వై-ఫై సిటీ’ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది.

గతేడాది అక్టోబరులో హైటెక్‌సిటీ, మాదాపూర్ పరిధిలో 8 కి.మీ మార్గంలో ఉచిత వై-ఫై సేవలు అందుబాటులోకి రాగా... మిగిలిన అన్ని ప్రధాన మార్గాల్లో వై-ఫై సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ఐటీశాఖ ముమ్మర యత్నాలు చేస్తోంది. ఈ సేవల ఏర్పాటుకు రెండు నెలల క్రితం ఐటీశాఖ ఆసక్తిగల సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానించగా ..ఎయిర్‌టెల్, రిలయన్స్, కన్వర్జెన్స్ టెక్నాలజీస్, హాత్‌వే, బీమ్ తదితర పది సంస్థలు ముందుకొచ్చాయి.

ఇక ఈ నెలాఖరు వరకు అంతర్జాతీయ బిడ్డింగ్ ద్వారా ఫైబర్ ఆప్టిక్ కనెక్టివిటీ సామర్థ్యం, సాంకేతిక అర్హతలు, అనుభవం, నిపుణులు కలిగిన మూడు సంస్థలను ఎంపికచేసి మార్చి నెలలో వై-ఫై సేవలు విస్తరించేందుకు ఆయా సంస్థలకు అవకాశం ఇవ్వనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఏడాదిలోగా గ్రేటర్ వ్యాప్తంగా హయత్‌నగర్-మియాపూర్, నాగోల్-హైటెక్‌సిటీ, జేబీఎస్-శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం తదితర ప్రధాన మార్గాల్లో సుమారు 660 కి.మీ మార్గంలో నిరంతరాయంగా వై-ఫై సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు ప్రారంభమైంది.

ప్రస్తుతం మహా నగరం ఉగ్రవాదుల పడగనీడలో ఉన్నందున కేంద్ర ప్రభుత్వం జారీచేసిన సైబర్ సెక్యూరిటీ మార్గదర్శకాలపై రాష్ట్ర ఐటీశాఖ లోతుగా అధ్యయనం చేస్తోంది. జాతీయ భద్రతను దష్టిలోఉంచుకొని సంఘవిద్రోహ శక్తులు వై-ఫై సౌకర్యాన్ని దుర్వినియోగం చేసే వీలులేకుండా పకడ్బందీగా సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఐటీశాఖ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి.
 
వై-ఫై అంటే..
వై ఫై అంటే.. వైర్‌లెస్ లోకల్ ఏరియా నెట్‌వర్క్ (డబ్ల్యూఐఎల్‌ఏఎన్). ఇది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్స్ (ఐఈఈఈ) 802.11 స్టాండర్స్‌పై ఆధారపడి ఉంటుంది. ఆంగ్లభాషలో డబ్ల్యూఐఎల్‌ఏఎన్‌ను కుదించి ‘వై ఫై’ అని పిలుస్తున్నారు. అంటే వైర్‌లెస్ ఫెడిలిటీ అన్నమాట. ఒక్క వై ఫై టవర్ సిగ్నల్స్ ఇన్‌డోర్ ప్రదేశంలో అయితే 20 మీటర్లు (66 ఫీట్లు), ఔట్‌డోర్‌లో అయితే 100 మీటర్లు (330 ఫీట్లు) వరకు అందుతాయి. వై ఫైతో కంప్యూటర్లు, వీడియో గేమ్స్ పరికరాలు, స్మార్ట్ ఫోన్లు, కొన్ని రకాల డిజిటల్ కెమెరాలు, ట్యాబ్లెట్స్, డిజిటల్ ఆడియో ప్లేయర్లను వినియోగించుకోవచ్చు.
 
ప్రస్తుతం ఇక్కడే..
సైబర్ టవర్స్-మాదాపూర్ పోలీస్‌స్టేషన్, కొత్తగూడ జంక్షన్, రహేజా మైండ్‌స్పేస్ సర్కిల్ పరిధిలో గతేడాది అక్టోబరులో 8 కి.మీ మార్గంలో 17 కేంద్రాల వద్ద వై-ఫై సిగ్నల్స్‌ను అందించేందుకు హాట్‌స్పాట్స్‌ను ఏర్పాటు చేశారు. దీంతో సుమారు 50 వేల మంది నిత్యం 750 మెగాబైట్స్ నిడివిగల వై-ఫై సాంకేతిక సేవలను నిరంతరాయంగా వినియోగించుకునే సౌకర్యం కలిగింది.
 
సిగ్నల్స్ ఇలా..
తీగల అవసరం లేకుండా నిర్ణీత పరిధిలో హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని పొందడమే వై ఫై. బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ తీసుకున్న తర్వాత వై ఫై రోటర్ పరికరాన్ని అమర్చుతారు. ఈ పరికరం బ్రాడ్ బ్యాండ్ ద్వారా అందే ఇంటర్నెట్‌ను నిర్ణీత పరిధిలో వై ఫై సౌకర్యం కలిగి ఉన్న ఫోన్లు, కంప్యూటర్లు వంటి వాటికి ఇంటర్నెట్ సిగ్నల్‌ను అందిస్తాయి.
 
ప్రతిబంధకాలివీ...

నగరవ్యాప్తంగా వై-ఫై సేవల విస్తరణ అనేక వ్యయ ప్రయాసలతో కూడినది. ఫైబర్ ఆప్టిక్ కేబుల్ వేయాలంటే కోట్లాది రూపాయలు వ్యయం చేయక తప్పని పరిస్థితి. ఈవిషయంలో ప్రభుత్వం నుంచి ప్రైవేటు సంస్థలు భారీగా రాయితీలు ఆశిస్తున్నాయి.
ఒక వై ఫై హాట్‌స్పాట్ నుంచి మరో వై-ఫై హాట్‌స్పాట్‌కు వెళ్లేసరికి సిగ్నల్ కట్ కాకుండా ఉండేందుకు అనేక సాంకేతిక జాగ్రత్తలు తప్పనిసరి.
తొలి పది నిమిషాలపాటు ఉచిత వై-ఫై సౌకర్యం ఇచ్చి ఆ తర్వాత ఛార్జీ వసూలు చేయాలన్న నిబంధన ఉచిత వై ఫై సేవల లక్ష్యాన్ని ప్రశ్నార్థకంగా మార్చనుందన్న సందేహాలు వ్యక్తమౌతున్నాయి.
కీలక సమాచారం ఉగ్రవాదుల చేతికి చిక్కకుండా సాంకేతికంగా అనేక జాగ్రత్తలు తీసుకోకుంటే లాభం కంటే నష్టమే అధిక మన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సైబర్ సెక్యూరిటీ మార్గదర్శకాలు పూర్తి ఉచిత వై-ఫై సేవలను అనుమతిస్తాయా..? లేదా అన్న సంశయం నెలకొంది. ఈ విషయంలో రాష్ట్ర ఐటీ శాఖ అధ్యయనం తర్వాతే నిజానిజాలు బయటికి రానున్నాయి.
 ప్రయోజనాలివీ..
ఆన్‌లైన్‌లో అనుసంధానించిన సుమారు 15 రకాల ప్రభుత్వ సేవలను ఉచితంగా పొందవచ్చు.
ప్రపంచ దేశాల్లో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. ఇంటర్నెట్, ఫోన్ల పనితీరు ఎన్నో రెట్లు మెరుగవుతుంది.
పర్యాటకులను విశేషంగా ఆకట్టుకోవచ్చు.
4 జీతో టీవీలకు ఇక కేబుల్ కనెక్షన్లతో అవసరం ఉండదు.
 
బెంగళూరే ఆదర్శం...
బెంగళూరు నగరాన్ని రోల్ మోడల్‌గా తీసుకొని హైదరాబాద్‌లో వైఫై సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఎందుకంటే దేశంలోనే తొలి వై ఫై నగరంగా బెంగళూరు ప్రసిద్ధికెక్కింది. అక్కడి సానుకూల, ప్రతికూల అంశాలను పరిగణలోకి తీసుకొని నగరంలో వై ఫైను సేవలను  విస్తరించనున్నారు. 2014 జనవరిలో బెంగళూరులోని మహాత్మా గాంధీ రోడ్‌లో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా వైఫై సేవలను ప్రారంభించింది. 512 కేబీపీఎస్ వేగంతో రోజులో 3 గంటల పాటు 50 ఎంబీ డేటా వరకు ఉచితంగా వై ఫైను పొందుతున్నారు అక్కడి సిటీజనులు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement