'గవర్నర్ వల్ల సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు'
హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ నరసింహన్ వ్యవహారశైలి వల్ల సామాన్యులకు ఇబ్బందులు వస్తున్నాయని రాజ్యసభ సభ్యుడు, ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు ఆరోపించారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.... గవర్నరు ప్రతీ రోజూ దేవాలయాలకు తిరగడం వల్ల రహదారిపై ప్రయాణిస్తున్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.
వ్యక్తిగత ఇష్టాలతో వీఐపీలు.... సామాన్యులకు ఆటంకం కలిగించడం సరికాదని వీహెచ్ అభిప్రాయపడ్డారు. రాజకీయపార్టీల కార్యాలయాల్లో జరిగిన పంచాంగ శ్రవణం చాలా ఆశ్చర్యకరంగా, సామాన్య ప్రజలు నవ్వుకునే విధంగా ఉందని ఎద్దేవా చేశారు. పంతుళ్లు రాజకీయ పార్టీలకు అనుకూలంగా చెప్పడం సరికాదని వ్యాఖ్యానించారు. పంచాంగ శ్రవణం అంటే వర్షాలు పడుతాయా, ప్రజలకు ఏడాది ఎలా ఉంటుందో, భవిష్యత్తులో జరిగే మంచిచెడుల గురించి చెప్పాలని వీహెచ్ సూచించారు.
రాజకీయపార్టీల భవిష్యత్తు ఎక్కడైనా పంచాగంలో ఉంటుందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి ఎదురౌతున్న వరుస ఓటములకు కారణాలను సమీక్షించుకుని, భవిష్యత్తులో పార్టీ పటిష్టత కోసం ఏం చేయాలనే దానిపై లోతుగా చర్చించుకోవాల్సిందేనని వీహెచ్ అభిప్రాయపడ్డారు. దీనిపై టీపీసీసీ అధ్యక్షునికి, సీఎల్‌పీ నేతకు, పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జీ దిగ్విజయ్‌సింగ్‌కు లేఖలు రాసినా స్పందన లేదని వీహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు.