‘విజయ’ పామాయిల్ రిఫైనరీ ప్లాంట్ | 'Victory' palm oil refinery plant | Sakshi
Sakshi News home page

‘విజయ’ పామాయిల్ రిఫైనరీ ప్లాంట్

Published Fri, Mar 18 2016 2:25 AM | Last Updated on Sun, Sep 3 2017 7:59 PM

‘విజయ’ పామాయిల్ రిఫైనరీ ప్లాంట్

‘విజయ’ పామాయిల్ రిఫైనరీ ప్లాంట్

రూ. 20 కోట్లతో అప్పారావుపేటలో ఏర్పాటుకు ఆయిల్‌ఫెడ్ నిర్ణయం
పంట చేను నుంచి నేరుగా వంటింటికి కల్తీ లేని నూనె సరఫరా లక్ష్యం
మార్కెట్లో పామాయిల్ వాటా 60 శాతం ఉండటంతో ఈ ఆలోచన

 
హైదరాబాద్: ‘విజయ’ బ్రాండ్ నూనెకు ప్రజల్లో ఉన్న ప్రతిష్టను దృష్టిలో పెట్టుకుని సొంతంగా పామాయిల్ తయారీ ప్లాంట్‌ను నెలకొల్పాలని తెలంగాణ ఆయిల్ ఫెడ్ నిర్ణయించింది. ఇప్పటివరకు వివిధ నూనెలను ప్రైవేటు డీలర్ల నుంచి కొనుగోలు చేసి ‘విజయ’ పేరుతో ప్యాకింగ్ చేసి వినియోగదారులకు విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. నూనెలను బయటి నుంచి కొనుగోలు చేస్తుండటంతో విజయ నూనెలో కల్తీ వ్యవహారాలు అనేకం బయటపడ్డాయి. ఈ విషయంలో కొందరు ఉద్యోగులనూ గతంలో తొలగించారు. ఎంత పర్యవేక్షణ, నిఘా ఉంచినా కల్తీని పూర్తిస్థాయిలో నియంత్రించలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వినియోగదారులకు స్వచ్ఛమైన కల్తీ లేని పామాయిల్‌ను అందించాలని.. అందుకోసం పామాయిల్ రిఫైనరీ ఫ్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ఆయిల్‌ఫెడ్ నిర్ణయించింది. సుమారు రూ. 20 కోట్లతో ఖమ్మం జిల్లా అప్పారావుపేటలో దీనిని నెలకొల్పనుంది.
 
‘పంట చేను నుంచి వంటింటికి’ నినాదంతో..
 విజయ బ్రాండ్‌తో ఆయిల్‌ఫెడ్ వేరుశనగ, పామాయిల్, పొద్దు తిరుగుడు, నువ్వులు, రైస్‌బ్రాన్, కొబ్బరినూనె, పూజ కోసం దీపం నూనెలను మార్కెట్లో విక్రయిస్తోంది. ఇందులో 50 శాతం వరకు పామాయిల్ నూనె వాటా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో విజయ నూనెలు నెలకు 2,200 టన్నులు అమ్ముడవుతుండగా.. అందులో ఒక్క పామాయిల్ నూనెనే 1,045 టన్నులు అమ్ముడవుతోంది. రాష్ట్ర వినియోగదారుల్లో 60 శాతం మంది పామాయిల్‌నే వినియోగిస్తున్నందున వాటి విక్రయాలే అధికంగా ఉన్నాయి. ఆయిల్‌ఫెడ్‌కు అశ్వారావుపేటలో పామాయిల్ గెలలను క్రషింగ్ చేసే ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీ నుంచి క్రూడాయిల్ తయారుచేసి దేశవిదేశీ మార్కెట్లలో విక్రయిస్తోంది. ఇలా క్రూడాయిల్ చేతిలో ఉన్నా బయటి మార్కెట్లో పామాయిల్‌ను కొనుగోలు చేసి హైదరాబాద్ సమీపంలోని శివరాంపల్లి యూనిట్‌లో ప్యాకింగ్ చేసి వినియోగదారులకు విక్రయించడంపై విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో సొంతంగా పామాయిల్ తయారీ ఫ్యాక్టరీని నెలకొల్పితే క్రూడాయిల్‌ను రిఫైన్ చేసి నేరుగా వినియోగదారులకే విక్రయించవచ్చని ఆయిల్‌ఫెడ్ గుర్తించింది. అందుకోసమే ‘పంట చేను నుంచి నేరుగా వంటింటికి’ అనే నినాదంతో పామాయిల్‌ను సరఫరా చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే అశ్వారావుపేటలో ఉన్న పామాయిల్ క్రషింగ్ ఫ్యాక్టరీకి తోడుగా రూ. 70 కోట్లతో అదే జిల్లా దమ్మపేట మండలం అప్పారావుపేటలో మరో పామాయిల్ క్రషింగ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయబోతున్నారు.

ఆ పనులు మొదలయ్యాయి. అక్కడ క్రూడాయిల్ ఉత్పత్తి అయ్యాక.. రిఫైన్డ్ కోసం రోజుకు 100 టన్నుల సామర్థ్యం గల పామాయిల్ తయారీ ప్లాంట్‌ను నెలకొల్పనున్నట్లు ఆయిల్‌ఫెడ్ ఎండీ మురళి ‘సాక్షి’కి తెలిపారు. అక్కడే ప్యాకింగ్ చేసి నేరుగా వినియోగదారులకు విక్రయిస్తారు. చౌకదుకాణాల ద్వారా కూడా నూనెలను విక్రయించాలని నిర్ణయించిన నేపథ్యంలో పామాయిల్ మార్కెట్ రెండింతలయ్యే అవకాశం ఉందని ఆయిల్‌ఫెడ్ సీనియర్ మేనేజర్ రంగారెడ్డి తెలిపారు. పామాయిల్ తయారీ ప్లాంట్‌ను నెలకొల్పితే కల్తీ లేని నూనె తయారు చేయడంతోపాటు వినియోగదారులకు తక్కువ ధరకు నూనెను సరఫరా చేయడం సాధ్యమవుతుందని వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారధి తెలిపారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement