
వృత్తి ప్రభుత్వ టీచర్...ప్రవృత్తి ఫేక్ కరెన్సీ చలామణి
హైదరాబాద్ : నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు మరో నకిలీ నోట్ల ముఠాకు చెక్ చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లో ఉన్న మాల్దా నుంచి ఫేక్ కరెన్సీని తీసుకువచ్చిన ఈ ముఠా తెలంగాణతో పాటు కర్ణాటకలోనూ చలామణి చేస్తూ పట్టుబడింది. ఈ ముఠాకు ప్రభుత్వ ఉపాధ్యాయుడు నేతృత్వం వహిస్తుండడం విశేషం. ఈ కేసులో ప్రధాన నిందితులైన ముగ్గురిని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం అరెస్టు చేసినట్లు డీసీపీ బి.లింబారెడ్డి వెల్లడించారు. వీరి నుంచి రూ.4.5 లక్షల విలువైన నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.
అప్పులు తీర్చేందుకు అడ్డదారులు...
వికారాబాద్ జిల్లా మొమిన్ పేట్‌కు చెందిన వి.శంకర్ వృత్తిరీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ప్రస్తుతం బీహెచ్‌ఈఎల్‌లో నివసిస్తున్న ఇతను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు. వీటిని అధిగమించడానికి మార్గాలు అన్వేషిస్తున్న నేపథ్యంలో మొమిన్ పేట్‌కే చెందిన మేఘావత్ ప్రకాష్‌తో పరిచమైంది. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా, హౌరా ప్రాంతాల్లో నకిలీ నోట్లు తక్కువ రేటుకు విరివిగా దొరుకుతాయని, వాటిని తీసుకువస్తున్న తాను మెదక్ జిల్లాలో చెలామణి చేస్తున్నట్లు శంకర్‌కు చెప్పాడు. దీంతో తానూ అదే పని చేయడానికి సిద్ధమైన ఈ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన సమీప బంధువులైన వి.హరిలాల్, వి.చంద్రల్నీ తనతో ముఠా కట్టాడు. రూ.500, రూ.1000 డినామినేషన్‌లో ఉన్న నకిలీ కరెన్సీ తీసుకురావాలని నిర్ణయించుకున్నారు.
రూ.2 లక్షలు చెల్లించి రూ.4.5 లక్షలు...
నకిలీ నోట్ల చెలామణికి సహకరిస్తే రూ.10 వేల చొప్పున కమీషన్ ఇస్తానంటూ శంకర్ టీమ్ సభ్యులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ప్రకాష్ నుంచి నకిలీ కరెన్సీ ఏజెంట్ నెంబర్ తీసుకున్న శంకర్ అతడితో సంప్రదింపులు జరిపాడు. బేరసారాల తర్వాత రూ.2 లక్షల అసలు కరెన్సీకి రూ.5 లక్షల నకిలీ కరెన్సీ ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. దీంతో ఇటీవల శంకర్‌తో పాటు హరి, చంద్ర విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో వైజాగ్‌కు అక్కడ నుంచి మరో రైలులో మాల్దా వెళ్ళారు. రైల్వేస్టేషన్ సమీపంలోనే నకిలీ కరెన్సీ ఏజెంట్‌ను కలిసిన వీరు రూ.2 లక్షలు చెల్లించి రూ.4.5 లక్షల నకిలీ కరెన్సీ బండిల్స్ తీసుకుని తిరిగి వచ్చాడు. హైదరాబాద్‌లో వీటిని చలామణి చేయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో వికారాబాద్, సంగారెడ్డి, కర్ణాటకల్లో చేయాలని భావించారు. దీనిపై సమాచారం అందుకున్న నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు వలపన్ని మంగళవారం పట్టుకున్నారు. పరారీలో ఉన్న ప్రకాష్, ఏజెంట్ గీషుద్దీన్ (మాల్దా) కోసం పోలీసులు గాలిస్తున్నారు.