మీడియాకు సంకెళ్లా.. సిగ్గు సిగ్గు | Warning to Chandrababu Sarkar | Sakshi
Sakshi News home page

మీడియాకు సంకెళ్లా.. సిగ్గు సిగ్గు

Published Thu, Jun 16 2016 3:30 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

మీడియాకు సంకెళ్లా.. సిగ్గు సిగ్గు - Sakshi

మీడియాకు సంకెళ్లా.. సిగ్గు సిగ్గు

‘సాక్షి’ ప్రసారాల నిలిపివేతపై కదంతొక్కిన జర్నలిస్టులు
- తీరు మారకపోతే గుణపాఠం తప్పదని చంద్రబాబు సర్కార్‌కు హెచ్చరిక
- ప్రెస్ క్లబ్ నుంచి రాజ్‌భవన్ వరకు భారీ ర్యాలీ
- వెంటనే సాక్షి ప్రసారాలు పునరుద్ధరించాలని డిమాండ్
- గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించిన జర్నలిస్టు సంఘాల నేతలు


 
 సాక్షి, హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్‌లో ‘సాక్షి’ టీవీ ప్రసారాలను నిలిపివేస్తూ చంద్రబాబు సర్కారు తీసుకున్న నిరంకుశ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జర్నలిస్టు, ప్రజాసంఘాల ప్రతినిధులు కదంతొక్కారు. తీరు మార్చుకుని తక్షణమే ప్రసారాలను పునరుద్ధరించాలని, లేదంటే గుణపాఠం తప్పదని హెచ్చరించారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుంచి రాజ్‌భవన్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. ‘జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి.. మీడియాకు సంకెళ్లా సిగ్గు సిగ్గు.. ప్రజాస్వామ్యంతో పరిహాసమా..’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ప్రభుత్వ దమననీతిని ఎండగట్టారు. ప్రసారాలు వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ దుశ్చర్యపై వెంటనే జోక్యం చేసుకోవాలని కోరుతూ గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు వినతిపత్రం సమర్పించారు.

సాక్షికి మద్దతుగా నిలిచేందుకు ఉదయం 10 గంటల కల్లా వివిధ జర్నలిస్టు సంఘాలు, మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్టులంతా స్వచ్ఛందంగా ప్రెస్‌క్లబ్‌కు చేరుకున్నారు. ప్రభుత్వ ఏకపక్ష వైఖరిపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ గవర్నర్ నివాసమైన రాజ్‌భవన్ వరకు ర్యాలీ కొనసాగించారు. జూన్9 నుంచి ఎంఎస్‌ఓలపై తీవ్ర ఒత్తిడి తెచ్చి ప్రభుత్వం ‘సాక్షి’ టెలివిజన్ చానల్ ప్రసారాలను నిలిపివేసిందని, రాజ్యాంగ బద్దంగా మీడియా ద్వారా పౌరులు సమాచారం తెలుసుకునే హక్కును కాలరాస్తూ.. మీడియా స్వేచ్ఛను హరిస్తోందని వయోధిక జర్నలిస్టు సంఘం ప్రతినిధి, సీనియర్ పాత్రికేయులు వరదాచారి, దేవులపల్లి అమర్(ఐజేయూ), కె.శ్రీనివాస్‌రెడ్డి(మన తెలంగాణ), అమర్‌నాథ్ (ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు), కె.రామచంద్రమూర్తి (ఎడిటోరియల్ డెరైక్టర్-సాక్షి), వర్దెల్లి మురళి (ఎడిటర్-సాక్షి), నరేందర్‌రెడ్డి (ఏపీయూడబ్ల్యుజే), జి.ఆంజనేయులు (జర్నలిస్ ్టఫెడరేషన్), కొమ్మినేని శ్రీనివాస్‌రావు(సాక్షి), శైలేష్‌రెడ్డి,నగేష్‌కుమార్, బండారు శ్రీనివాస్‌రావు, దిలీప్‌రెడ్డి, ప్రియా చౌదరి, గోపీనాథ్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రవికాంత్‌రెడ్డి తదితరులతో కూడిన ప్రతినిధి బృందం గవర్నర్‌కు వివరించింది.

ముద్రగడ పద్మనాభం చేపట్టిన దీక్ష నేపథ్యంలో సాక్షిపై నిషేధం, ప్రసారాలను తామే నిలిపి వేశామని రాష్ట్ర హోం శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప స్వయంగా చేసిన ప్రకటన, దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు తదితరాలను వారు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రతినిధులు చెప్పిన అన్ని వివరాలను సాంతం విన్న గవర్నర్ సుహృద్భావంగా స్పందించారు. అనారోగ్యం కారణంగా ర్యాలీకి హాజరు కాలేకపోయిన సీనియర్ పాత్రికేయులు వి.హన్మంతరావు, ఏబీకే ప్రసాద్ తదితరులు తమ మద్దతు తెలియజేస్తూ వినతిపత్రంలో సంతకాలు చేశారు. ఇతర సీనియర్ జర్నలిస్టులు కోటేశ్వర్‌రావు, హరి(ఫోటో జర్నలిస్టుల సంఘం), తిరుపతి (కెమెరామెన్‌ల అసోసియేషన్),హష్మి, రాజమౌలి, విజయ్‌కుమార్‌రెడ్డి, దుగ్గురఘ, శ్రీనివాస్‌రెడ్డి(ప్రెస్‌క్లబ్ కార్యవర్గం) తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.నర్సయ్య, నగర ప్రధాన కార్యదర్శి పరశురామ్, నేతలు గణేష్, రియాజ్, ఐఎఫ్‌జేయూ ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్, నగర అధ్యక్షురాలు అనురాధల బృందం తమ ఆట పాటలతో ప్రభుత్వ నిరంకుశ విధానాలను ఎండగట్టారు.
 
 మీడియాను నియంత్రించడం దుర్మార్గం
  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాక్షి మీడియాపై దమనకాండను కొనసాగిస్తోంది. మీడియాను నియంత్రించడం దుర్మార్గం. కొంత మంది మంత్రులు ఏకంగా సాక్షిని స్వాధీనం చేసుకోబోతున్నట్లు అవాకులు, చవాకులు పేలుతున్నారు. ప్రజా నాయకుడైన ముద్రగడ పద్మనాభం ప్రజల కోసం అనేక ఉద్యమాలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రస్తుతం ఆయన దీక్ష చేస్తున్నారు. ఈ దీక్షను ప్రజలకు చూపించకుండా చేసేందుకే సాక్షి మీడియాపై ఆంక్షలు విధించింది. ఈ విషయంపై వెంటనే గవర్నర్ జోక్యం చేసుకోవాలి. ప్రభుత్వంలోని పెద్దలను మందలించి, సాక్షి ప్రసారాలను పునరుద్ధరింపజేయాలి.
     - కె.రామచంద్రమూర్తి,  ఎడిటోరియల్ డెరైక్టర్, సాక్షి
 
 దిక్కుమాలిన ఆలోచన
 చంద్రబాబు ప్రభుత్వం నిండా అవినీతిలో కూరుకుపోయింది. ఏ ప్రభుత్వానికైనా స్వతంత్ర మీడియా అంటే కొంత బెదురు ఉంటుంది. ఆ బెదురులోంచి వచ్చిందే ఈ ఆలోచన. ఇలాంటి దిక్కుమాలిన చర్యలను ప్రతిఘటిస్తాం. ఖచ్చితంగా విజయం సాధిస్తాం.
     - వర్దెల్లి మురళి, ఎడిటర్, సాక్షి
 
 భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమే
 సాక్షిపై ఆంక్షలు విధించడం ఎంతమాత్రం సమంజసం కాదు. మిగతా రాష్ట్రాల్లో ఏ మంత్రి చెప్పని విధంగా ఏపీలో ఏకంగా హోం మంత్రి సాక్షి మీడియాపై ఆంక్షలు విధిస్తున్నట్లు చెప్పడం హాస్యాస్పదం. ఇది పత్రికా స్వేచ్ఛను హరించడమే కాదు.. భావ వ్యక్త్తీకరణ స్వేచ్ఛకు భంగం కల్గించడమే.     
     - శ్రీనివాసరెడ్డి(మన తెలంగాణ)
 
 మొట్టికాయలేసినా బుద్ధి రాలేదు
 ప్రజా ఉద్యమాలనే కాదు.. వాటిని ప్రసారం చేస్తున్న మీడియాపై ఆంక్షలు విధించడం చంద్రబాబుకు కొత్త కాదు. ఈ విషయంలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మొట్టికాయలు వేసింది. అయినా ఆయనకు బుద్ధి రాలేదు. ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోకపోతే భవిష్యత్తులో తగిన గుణపాఠం తప్పదు.    
     -దేవులపల్లి అమర్(ఐజేయూ)
 
 కులాల కురుక్షేత్రంగా మారుస్తోంది
 చంద్రబాబు తెలిసి చేస్తున్నాడో.. తెలియక చేస్తున్నాడో కానీ ఆంధ్రప్రదేశ్‌ను ఓ సంకుల సమరంలా.. కులాల కురుక్షేత్రంలా మారుస్తున్నారు. ప్రభుత్వం ప్రజల మధ్య విధ్వేషాన్ని రెచ్చగొడుతోంది. పత్రికా స్వేచ్ఛనే కాదు భావప్రకటనా స్వేచ్ఛనూ హరిస్తోంది.
 -కొమ్మినేని శ్రీనివాసరావు, సాక్షి
 
 రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం
 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాక్షి మీడియాపై ఆంక్షలు విధించడం రాజ్యాంగ స్ఫూర్తికే కాదు ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. జర్నలిస్టుగా వృత్తిపరమైన జీవితంలో ఇలాంటి ఆంక్షలెన్నో చూశాం. చంద్రబాబు ప్రభుత్వం విధించిన ఆంక్షలపై ఉవ్వెత్తున ఉద్యమిస్తాం.
 - వరదాచారి(వయోధిక జర్నలిస్టుల సంఘం)
 
 హక్కులకు భంగం కల్గించారు
 గతేదాడి ఓటుకు నోటు కేసులో ఏపీ సర్కార్ ఇలాగే దురుసుగా వ్యవహరించింది. ఈ అంశాన్ని ప్రసారం చేసిన టి న్యూస్, సాక్షి ఆఫీసుల్లో దాడులు చేయించారు. ఇది కేవలం మీడియాపై దాడి మాత్రమే కాదు మొత్తం ప్రజాస్వామ్యంపై దాడిగా భావిస్తున్నాం.
     - శైలేశ్‌రెడ్డి( సీనియర్ జర్నలిస్టు)
 
 అప్రజాస్వామికం
 ముద్రగడ చేస్తున్న దీక్షను ప్రసారం చేస్తున్న మీడియాపై ఆంక్షలు విధించడమంటే తెలుసుకునే హక్కును హరించడం వంటిదే. ఇది పూర్తిగా అప్రజాస్వామికం. అనైతికం. ఏపీలో వెంటనే సాక్షి ప్రసారాలను పునరుద్ధరించాలి. లేదంటే ఉవ్వెత్తున ఉద్యమిస్తాం.    
- అమర్‌నాథ్ (ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement