సాక్షి ప్రసారాలు ఆపమని ఆదేశాలివ్వలేదు
- హైకోర్టుకు నివేదించిన ప్రభుత్వ తరఫు న్యాయవాది
- ఆ విషయం రాతపూర్వకంగా సమర్పించాలన్న న్యాయస్థానం
సాక్షి, హైదరాబాద్: సాక్షి టీవీ ప్రసారాలు నిలుపుదల చేయాలని ఎవ్వరికీ ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం హైకోర్టుకు నివేదించింది. అయితే ఈ విషయాన్ని లిఖిత పూర్వకంగా అఫిడవిట్ రూపంలో తమ ముందుంచాలని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో తమ టీవీ ప్రసారాలను నిలిపివేయడాన్ని సవాలు చేస్తూ సాక్షి టీవీ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) డి.రమేష్ వాదనలు వినిపిస్తూ, సాక్షి టీవీ ప్రసారాల నిలుపుదలకు ప్రభుత్వం గానీ, పోలీసులు గానీ ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని కోర్టుకు తెలిపారు. దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ, ఆ విషయాన్ని రాతపూర్వకంగా సమర్పించేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ శుక్రవారం కల్లా అఫిడవిట్ దాఖలు చేయాలని రమేష్‌కు స్పష్టం చేశారు. శుక్రవారం సాధ్యం కాదని, శాఖాధిపతుల తరలింపు జరుగుతోందని, అందువల్ల విచారణను సోమవారానికి వాయిదా వేయాలని కోరారు. ఈ సమయంలో నిరంజన్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ గత విచారణ సమయంలో నేటికల్లా (మంగళవారం) కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు స్పష్టం చేసినా మళ్లీ గడువు కోరుతున్నారన్నారు. అయితే శాఖాధిపతుల తరలింపు జరుగుతున్న నేపధ్యాన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి సోమవారం కల్లా అఫిడవిట్ దాఖలు చేయాలని చెబుతూ విచారణను సోమవారానికి వాయిదా వేశారు.
ఆగని నిరసన జ్వాలలు
సాక్షి నెట్‌వర్క్: సాక్షి ప్రసారాలను నిలిపేయడంపై ఆందోళనలు ఉద్ధృతమవుతున్నాయి. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగాయి. మీడియాపై ప్రభుత్వం దమననీతిని వ్యతిరేకిస్తూ అన్ని జిల్లాల్లోనూ జర్నలిస్టులు కదంతొక్కారు. రాస్తారోకోలు, ధర్నాలు చేశారు. సాక్షి ప్రసారాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. మరోవైపు నేడు రాష్ట్రవ్యాప్తంగా మౌనప్రదర్శనలకు ఏపీయూడబ్ల్యూజే పిలుపునిచ్చింది.