చెరువుల్ని చెరబట్టిన వాటర్ 'మాఫియా' | water mafia in hyderabad | Sakshi
Sakshi News home page

చెరువుల్ని చెరబట్టిన వాటర్ 'మాఫియా'

Published Sat, Mar 5 2016 2:19 AM | Last Updated on Mon, Oct 8 2018 4:18 PM

చెరువుల్ని చెరబట్టిన వాటర్ 'మాఫియా' - Sakshi

చెరువుల్ని చెరబట్టిన వాటర్ 'మాఫియా'

నగరంలో చెరువులను ఆనుకొని విచ్చలవిడిగా బోర్ల తవ్వకాలు
* ఆ నీటితో ట్యాంకర్ల ద్వారా కోట్లలో అక్రమ దందా
* మూడు బోర్లు.. ఆరు ట్యాంకర్లుగా సాగుతున్న వ్యాపారం
* ట్యాంకర్ నీళ్లను కొనేది రూ.200-రూ.300
* బయట అమ్ముకునేది రూ.1,000-రూ.1,200
* ప్రశ్నిస్తే బెదిరింపులు, దాడులకూ వెనుకాడని మాఫియా
* డ్రైనేజీ, పారిశ్రామిక వ్యర్థాలతో కలుషితమవుతున్న జలాలు
*అవే నీటిని జనానికి అంటగడుతున్న వైనం


సాక్షి, హైదరాబాద్:
 చెరువును ఆనుకొని ఓ ఇల్లు వెలుస్తుంది.. ఇంటి అవసరానికంటూ బోరుబావి తవ్వుతారు.. చెరువుకు దగ్గర్లో ఉండడంతో అందులో పుష్కలంగా నీళ్లు పడతాయి.. ఇంకేముంది వాటర్ మాఫియాకు కాసుల పంట పండినట్టే..! యథేచ్ఛగా నీటిని తోడేస్తూ రోజుకు వందలాది ట్యాంకర్ల ద్వారా కోట్లలో అక్రమ వ్యాపారం!! రాజధాని నగరంలోని చెరువుల చెంత కొన్నేళ్లుగా సాగుతున్న నీటి దందా ఇదీ. కూకట్‌పల్లి, ఉప్పల్, మియాపూర్, అమీన్‌పూర్, బాలానగర్, హఫీజ్‌నగర్, మాదాపూర్ ప్రాంతాల్లో ఈ మాఫియా విచ్చలవిడిగా చెలరేగిపోతోంది. తేలిగ్గా డబ్బు సంపాదనకు అలవాటుపడిన ఈ మాఫియాను ఎవరైనా ప్రశ్నిస్తే.. బెదిరించడంతోపాటు దాడులకూ వెనుకాడడం లేదు. ఇంటి యజమానులకు ఒక్కో ట్యాంకర్‌కు రూ.200-రూ.300 ముట్టజెప్పుతున్న నీళ్ల దళారులు బయట మాత్రం రూ.1,000-రూ.1,200 దాకా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు.

వేసవికి ముందే నీటికి కటకట ఏర్పడడంతో వీరి వ్యాపారం మూడు బోర్లు.. ఆరు ట్యాంకర్లతో కళకళలాడుతోంది. ఓవైపు ఎలాంటి ఆటంకాలు లేకుండా మాఫియా వ్యాపారం సాగిపోతుండగా.. మరోవైపు వారు అమ్ముతున్న నీళ్లను వినియోగిస్తున్న జనం రోగాల బారిన పడుతున్నారు. డ్రైనేజీ, పారిశ్రామిక వ్యర్థాలతో నిండడంతో చెరువుల్లోని భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమైపోతున్నాయి. దళారులు ఆ నీటినే తోడి వినియోగదారులకు అమ్ముతున్నారు. వీటితో స్నానం చేస్తే చర్మ వ్యాధులు, జుట్టు రాలిపోవడం, పిల్లల్లో వాంతులు, విరోచనాలు తదితర సమస్యలు ఏర్పడుతున్నాయి.

 వ్యాపారం సాగుతోందిలా..
 కూకట్‌పల్లి నుంచి చింతల్‌కి వెళ్లే మార్గంలో ఉన్న ఎల్లమ్మబండ చెరువులోకి నగరంలోని చాలా ప్రాంతాల నుంచి డ్రైనేజీ నీరు, పారిశ్రామిక వ్యర్థాలు వచ్చి చేరుతున్నాయి. ఈ చెరువుకి  ఆనుకొని ఇళ్లు నిర్మించుకున్నవారు ఇంటి అవసరాల పేరుతో బోరుబావులు తవ్వుతున్నారు. చెరువుకు కేవలం పదడుగుల దూరంలో ఒక్కొక్కరు రెండు మూడు బోర్లు కూడా వేస్తున్నారు. కొందరు దళారులు ఇళ్ల యజమానుల నుంచి కొంత స్థలాన్ని లీజుకు తీసుకొని అందులో విచ్చలవిడిగా బోర్లు వేశారు. ఇళ్లపై పెద్దఎత్తున నీటిని నిల్వ చేసేందుకు ట్యాంకర్లు నిర్మించారు. ఒకేసారి ఐదు ట్యాంకర్లకు నీటిని సరఫరా చేసేలా పరికరాలను ఏర్పాటు చేసుకున్నారు.

ఇలాంటి ఇళ్లు ఎల్లమ్మబండ చెరువుని ఆనుకుని పాతికకు పైగా ఉన్నాయి. ఈ చెరువు దిగువన పదెకరాల ఖాళీ స్థలం ఉంది. అక్కడ ఏకంగా ఎనిమిది బోర్లు వేశారు. వాటి నుంచి వచ్చిన నీళ్లని ఒక ట్యాంకులో నింపుతున్నారు. ఆ ట్యాంకు నుంచి ట్యాంకర్లకు నీళ్లు వెళ్తాయి. ఏ సమయంలో చూసినా అక్కడ పది నుంచి పదిహేను ట్యాంకర్లు నీటి కోసం క్యూ కట్టి ఉంటాయి. ఆ స్థలం యజమానిని వ్యాపారం గురించి అడిగితే ‘‘నేను నీటిని అమ్మడం లేదు. కూకట్‌పల్లిలోని పదకొండు అపార్ట్‌మెంట్లకు ఉచితంగా ఇస్తున్నాను’’ అని చెప్పడం గమనార్హం. హఫీజ్‌పేట్ ప్రాంతంలోని ప్రకాష్‌నగర్ చెరువు వద్ద కూడా ఇదే పరిస్థితి. ఈ చెరువును ఆనుకుని చిన్న షెడ్ నిర్మాణం చేసి అందులో రెండు బోర్లు వేసి నడిరోడ్డుపై నీటి వ్యాపారం చేస్తున్నారు.

 దర్గా సాక్షిగా దందా...
 హఫీజ్‌పేట్ సమీపంలో గోకుల్‌ఫ్లాట్స్ దగ్గర రోడ్డుకి ఆనుకుని ఉన్న దర్గాలో పెద్ద బావి తవ్వి అందులో బోర్లు వేశారు. అక్కడ పెద్ద ఎత్తున నీటి అక్రమ వ్యాపారం సాగుతోంది. 25 వేల లీటర్ల నీటి ట్యాంక ర్‌ను రూ.5 వేల చొప్పున అమ్ముతున్నారు. ‘సాక్షి’ ప్రతినిధి ఇక్కడ నీటి అమ్మకం గురించి ఆరా తీసి వెళ్తుండగా.. ఓ వ్యక్తి కారులో వెంబడించి దారిలో అడ్డగించాడు. ‘వాటర్ ట్యాంకర్‌కి ప్రెస్ వాళ్లకి ఏ సంబంధం? నీళ్లు కావాలన్నావుగా వచ్చి కొనుక్కో లేకుంటే ఇంటికి పోవు....’ అంటూ బెదిరింపులకు దిగాడు. కాసేపటికి కొందరు అక్కడికి చేరుకోవడంతో కారుతో ఉడాయించాడు. ఆ కారుకు నంబర్ ప్లేట్ కూడా లేకపోవడం గమనార్హం. దర్గాకు వచ్చేవారి కోసం వేసిన బోరు నీటితో వ్యాపారం చేస్తుండడం, ప్రశ్నించినందుకు బెదిరించడాన్ని పోలీసులు దృష్టికి తీసుకువెళ్లగా.. ‘ఎక్కడ వ్యాపారం ఆగిపోతుందోనని భయపెడదామనుకున్నట్టున్నారు.. వచ్చేది నీళ్ల సీజన్ కదా’’ అని అన్నారు.

 కోట్లలో వ్యాపారం...
 హైదరాబాద్‌లో ప్రభుత్వం సరఫరా చేస్తున్న మంచినీటి ట్యాంకర్ల సంఖ్య వెయ్యి. రోజుకి ఒక ట్యాంకరు ఐదు ట్రిప్పులు తిరుగుతుంది. రూ.450కు 5 వేల లీటర్ల నీటి ట్యాంకర్ ఇస్తోంది. ఫోన్ చేసిన రెండ్రోజులకు ఈ ట్యాంకర్ వస్తుంది. ఇది ప్రభుత్వం చేసే కమర్షియల్ నీటి సరఫరా. ఇక ప్రైవేటు విషయానికొస్తే నగరంలో దాదాపు 5 వేల ట్యాంకర్లుంటాయి. ఒక్కో ట్యాంకరు రోజుకు ఆరు ట్రిప్పుల వరకూ వేస్తుంది. ఐదు వేల లీటర్ల నీటి ట్యాంకరుకు రూ.వెయ్యి నుంచి రూ.1,200 వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన రోజుకు రూ.3.6 కోట్లు, నెలకు వంద కోట్ల పైనే ప్రైవేటు నీటి వ్యాపారం జరుగుతోంది. ఏప్రిల్, మే నెలల్లో ట్యాంకర్‌కు రూ.1,500 దాకా గుంజుతున్నారు. చెరువుల నుంచి విచ్చలవిడిగా నీటిని తోడేయడంతో భూగర్భ జలాల నీటి మట్టం కూడా గణనీయంగా పడిపోతోంది.

 కళ్లుగప్పి వ్యాపారం చేస్తున్నారు
 కూకట్‌పల్లి పరిధిలో చెరువు చుట్టు కానీ, పొలాల్లో కానీ, ఇళ్ల దగ్గర కానీ ఎక్కడా కమర్షియల్ బోర్లకు మేం అనుమతి ఇవ్వలేదు. కేవలం ఇంటి అవసరాలకు మాత్రమే అనుమతి ఇచ్చాం. అధికారుల కళ్లు గప్పి నీటి వ్యాపారం చేసుకుంటున్నారని తెలిసింది.
 - నర్సింహారెడ్డి, ఎమ్మార్వో, కూకట్‌పల్లి

 నీటి వ్యాపారం వాస్తవమే..
 అధికారుల కళ్లు కప్పి నీళ్ల వ్యాపారం చేసుకుంటున్నవారు చాలామంది ఉన్నమాట వాస్తవమే. కానీ మేం ఎవరికీ కమర్షియల్ బోర్లకు అనుమతి ఇవ్వలేదు. ఇంటి కోసం అని చెప్పి చెరువు పక్కన బోర్లు వేస్తున్నారు. ఆ నీటిని చాటుగా ఇలా అమ్ముకుంటున్నారు. ఇలాంటివి మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటున్నాం.
 - శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మార్వో, హఫీజ్‌పేట్
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement