సొమ్ములిచ్చుకో.. చెరువు తవ్వుకో
సొమ్ములిచ్చుకో.. చెరువు తవ్వుకో
Published Thu, Feb 16 2017 1:36 AM | Last Updated on Mon, Oct 8 2018 4:18 PM
ఆక్వా రంగంలోనూ మాఫియా జడలు విప్పుతోంది. చట్టాన్ని చెరువుల పాలే్జస్తోంది. అక్రమం ఆ గట్లపై వికటాట్టహాసం చేస్తోంది. చేలను చటుక్కున మాయం చేసేస్తోంది. రాత్రికి రాత్రి చేపల చెరువుల్ని పుట్టిస్తోంది. అమాయక రైతుల్ని నయానో భయానో దారికి తెచ్చుకుని లీజు పేరిట వందలాది ఎకరాల పంట భూముల్ని హస్తగతం చేసుకుంటున్న ఆక్వా మాఫియా ఎలాంటి అనుమతులు లేకుండానే చెరువులుగా మార్చేస్తోంది. చేలను చెరువులుగా మార్చేందుకు కనీసం దరఖాస్తు చేయకుండా దందా సాగిస్తోంది. కాసులు మరిగిన అధికారులు నిబంధనలను గాలికొదిలేస్తుండటంతో.. ఆ చెరువుల సమీపంలో వరి పండించే రైతులు నష్టాల పాలవుతున్నారు. చివరకు తమ భూములనూ ఆక్వా మాఫియాకు అప్పగించాల్సి వస్తోంది.
సాక్షి ప్రతినిధి, ఏలూరు : డెల్టా ప్రాంతంలో ఆక్వా మాఫియా రాజ్యమేలుతోంది. ఉంగుటూరు, ఉండి నియోజకవర్గాల్లో చాపకింద నీరులా ప్రవహిస్తూ వరి చేలను చేపలు చెరువులుగా మార్చేస్తోంది. అక్రమాల పంజా విసిరి రైతుల్ని వలలో బిగిస్తోంది. రెండు పంటలూ పండే భూములను హస్తగతం చేసుకుని వందల ఎకరాల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే యథేచ్ఛగా చేపలు, రొయ్యల చెరువులు తవ్వేస్తున్నారు. తొలుత సారవంతమైన భూముల మధ్య నాలుగైదు ఎకరాల పొలాన్ని లీజుకు తీసుకోవడం.. అందులో చేపలు లేదా రొయ్యల చెరువు తవ్వడం చేస్తున్నారు. పొలాల మధ్యలో చెరువు తవ్వడం వల్ల అందులోంచి వచ్చే కలుషిత నీటివల్ల దాని చుట్టుపక్కల భూముల్లో పంటలకు నష్టం వాటిల్లుతోంది. దీనిని సాకుగా తీసుకుని సమీపంలోని పొలాలన్నిటినీ లీజుకు తీసుకుని 30నుంచి 50 ఎకరాలను ఒకే ప్లాటుగా చేసి చెరువులు తవ్వుతున్నారు. క్రమంగా ఇలా ఆయకట్టు పరిధిలోని మొత్తం చేలను చెరువులుగా మార్చేస్తున్నారు. ఈ మాఫియాకు అధికారులు, అధికార పార్టీ నేతలు పూర్తిస్థాయిలో అండదండలు ఇస్తుండటంతో ఆడింది ఆట.. పాడింది పాట అన్నట్టుగా మారిపోయింది.
ఉదాహరణలివిగో..
నిడమర్రు మండలంలోని నిడమర్రు, నరసింహపురం రెవెన్యూ గ్రామాల్లోని ఆయకట్టులో మెరక భూములను సైతం ఆక్వా మాఫియా వదిలి పెట్టడం లేదు. ఈ ప్రాంతంలో ఇటీవల 163 ఎకరాల విస్తీర్ణంలో 6 భారీ చెరువులు తవ్వేశారు.
నిడమర్రు–ఏలూరు రాష్రీ్టయ రహదారి పక్కనే గల బాడవ ఆయకట్టు పరిధిలోని పంట భూముల్లో చెరువులు తవ్వారు. ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. కనీసం చెరువు తవ్వకానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు కూడా చేయలేదు.
చెరువులు వద్దకు చేరుకునేందుకు వీలుగా రహదారి సైతం అధికారుల అండతో ఆక్వా మాఫియా సొంతంగా నిర్మించుకుంది.
ఈ భూముల్ని లీజుకు తీసుకున్న వారే విద్యుత్ స్తంభాలు కూడా స్వయంగా పాతుకుంటున్నారు.
చెరువులకు నీటి సదుపాయం నిమిత్తం మూడు మీటర్ల వెడల్పున కాలువల సైతం నిర్మించారు. ఇంత జరుగుతున్నా గ్రామస్థాయి రెవెన్యూ అధికారి అయినా అటువైపు కన్నెత్తి చూడకపోవడం విశేషం.
కనీసం దరఖాస్తు చేయలేదు...
నిడమర్రు, నరసింహపురం ఆయకట్టులో 163 ఎకరాల్లో కొత్తగా చెరువులు తవ్వారు. ఆ తరువాత 65.89 ఎకరాల్లో చెరువులు తవ్వుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఈనెల 7న ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశారు. దరఖాస్తు నంబర్లు పీఆర్‌ఎఫ్ 011700018229, పీఆర్‌ఎఫ్ 011700018228, పీఆర్‌ఎఫ్ 01170018226 ద్వారా ఆన్‌లైన్‌లో పరిశీలిస్తుంటే ఈ దరఖాస్తులు పరిశీలనలో ఉన్నట్టు చూపిస్తోంది. పరిశీలన పూర్తికాకుండానే చెరువులు రెడీ అయిపోయాయి. మిగిలిన సుమారు 100 ఎకరాల్లో చెరువులకు సంబంధించి కనీసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు కూడా చెయ్యలేదని స్పష్టంగా కనపడుతోంది. అయినా.. అందులోనూ చెరువులు తవ్వేశారు.
ముందు తవ్వకాలు.. ఆనక అనుమతులు
లీజుదారులు స్థానిక అధికారులతో కుమ్మక్కై ముందుగా చెరువులు తవ్వేస్తున్నారు. అ తర్వాత తాపీగా అనుమతులకు దరఖాస్తు చేస్తున్నారు. ఇటీవల మీసేవా కేంద్రం నుంచి నకిలీ ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్న కేసు దర్యాప్తు సమయంలో మండలంలో సుమారు 1,500 ఎకరాల్లో అనధికార అనుమతులతో చెరువులు తవ్వేసినట్టు బహిర్గతమైంది. అయినా అధికారులు స్పందించకపోవడం గమనార్హం. జిల్లాలో వరి ఆయకట్టు మాయమవుతోందని రైతులు ఆందోళన చేస్తున్నా ఒక్క అధికారిపై కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు కనపడటం లేదు.
ఇదో సిత్రం
చేపల చెరువుల తవ్వకాలకు అనుమతి ఇచ్చే విషయంలో విచిత్రాలు బయటపడుతున్నాయి. దరఖాస్తు చేసుకున్న ఒక్క రోజులోనే.. ఎలాంటి విచారణ జరపకుండానే అనుమతి వచ్చేసింది. పైగా కలెక్టర్‌కు ప్రతినిధిగా పేర్కొంటూ తహసీల్దార్ డిజిటల్ సంతకం స్థానంలో తహసిల్దార్ సంతకంతో అనుమతి ఇచ్చేశారు. చేపల చెరువుల విషయంలో అధికారులు ఎంత ఉదారంగా వ్యవహరిస్తున్నారో ఈ ఉదంతం నిరూపిస్తోంది. వివరాల్లోకి వెళితే.. నిడమర్రు మండలం బావాయిపాలెం గ్రామానికి చెందిన పేరిచర్ల బంగారమ్మ, మరికొందరు కలిసి ఐదెకరాల పంట భూమిలో చేపల చెరువు తవ్వేందుకు అనుమతి కోరుతూ ఈనెల 13న నిడమర్రు మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకున్నారు. అనుమతి కోరిన సాగుభూమిని అధికారులు కనీసం పరిశీలించకుండానే ఆన్‌లైన్‌లో అనుమతులు ఇస్తూ ధ్రువీకరణ పత్రం వచ్చేసింది. ధ్రువీకరణ పత్రంపై విధిగా జిల్లా కలెక్టర్ డిజిటల్ సంతకం చేయాల్సి ఉండగా.. ఆయన స్థానంలో నిడమర్రు తహసీల్దార్ పేరు కనిపిస్తోంది. ‘ఫర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ చైర్‌పర్సన్, డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ’గా పేర్కొంటూ తహసీల్దార్ ఎం.సుందరరాజు పేరిట ధ్రువీకరణ పత్రం జారీ అయ్యింది. అంటే తహసీల్దార్ అనుమతి ఉంటే చెరువులు తవ్వేసుకోవచ్చన్నమాట. ఏపీ మీ సేవా పోర్టల్‌లోకి వెళ్లి అక్కడ దరఖాస్తు స్థితిని తెలుసుకునేందుకు ‘చెక్ మీ సేవా సర్టిఫికెట్’ అనే కాలమ్ దరఖాస్తు సంఖ్య పీఆర్‌ఎఫ్011700018461 నమోదు చెయ్యగానే ఈ ఆన్‌లైన్ సర్టిఫికెట్ దర్శనమిస్తోంది. ఈ విధంగా ఆన్‌లైన్‌లో తప్పుడు ధ్రువీకరణ పత్రాలు ప్రత్యక్షం అవుతున్నట్టు స్పష్టమవుతోంది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.
Advertisement