మళ్లీ అదే తీరు. వేసవి కార్యాచరణ అమలు విషయంలో శివార్లపై జలమండలి శీతకన్ను వేస్తోంది. ఏప్రిల్ ఒకటి నుంచి ఈ ప్రణాళిక అమ లు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.
సాక్షి, సిటీబ్యూరో: మళ్లీ అదే తీరు. వేసవి కార్యాచరణ అమలు విషయంలో శివార్లపై జలమండలి శీతకన్ను వేస్తోంది. ఏప్రిల్ ఒకటి నుంచి ఈ ప్రణాళిక అమ లు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రధాన నగరంలోని పది నిర్వహణ డివిజన్లు ఒక్కోదానికి రూ.35 లక్షల నిధులు కేటాయించేందుకు జలమండలి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అయితే శివార్లకొచ్చేసరికి నిధులను సగానికి సగం పైగా తగ్గించేసింది. శివార్లలో ఏడు నిర్వహణ డివిజన్లలో ఒక్కోదానికి రూ. 15 లక్షల నిధులను మాత్రమే కేటాయిం చాలని ప్రతిపాదించింది.
మిగతా నిధులు జీహెచ్‌ఎంసీ ఇస్తుందన్న అంచనాతో శివార్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. వాస్తవంగా గ్రేటర్‌లో విలీనమైన 11 శివారు మున్సిపాల్టీల పరిధిలోని 870 కాలనీలు, బస్తీల్లో మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. అక్కడ సరఫరా నెట్‌వర్క్, స్టోరేజి రిజర్వాయర్లు అందుబాటులో లేవు. కేవ లం ట్యాంకర్ల ద్వారా దాహార్తిని తీర్చేందుకు అధికంగా నిధులు అవసరమవుతాయి. ఈ విషయంలో జీహెచ్‌ఎంసీ, జల మండలి విభాగాల మధ్య సమన్వయం లోపించడంతో ఈ వేసవిలోనూ శివార్లకు కన్నీటి కష్టాలు తప్పవన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
ప్రాధాన్యం వీటికే...
పైప్‌లైన్లు, జంక్షన్ల వద్ద లీకేజీల నివారణ, పవర్‌బోర్లు, నీటి ట్యాంకులు, పబ్లిక్ కుళాయిలకు మరమ్మతులు, సరఫరా నె ట్‌వర్క్ లేని ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా, మురుగునీటి పైప్‌లైన్ల పూడిక తొలగింపు వంటి పనులకు వేసవి ప్రణాళికలో అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు జలమండలి వర్గాలు తెలిపాయి. ప్రధాన నగరంలోని పది నిర్వహణ డివిజన్ల పరిధిలో ప్రణాళిక అమలుకు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సిన పనులను పూర్తి చేస్తారు. రూ.లక్ష అంచనా విలువ దాటిన ప్రతి పనికీ వేర్వేరుగా టెండర్లు పిలుస్తారు. జాప్యం లేకుండా ఆన్‌లైన్‌లో ప్రతిపాదనల స్వీకరణ, పనులు చేపట్టేందుకు అనుమతులు మంజూరు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.