హైదరాబాద్ : ఖమ్మం జిల్లా పాలేరు శాసనసభకు జరగనున్న ఉప ఎన్నికల్లో గెలుపు మాదే అని తెలంగాణ పంచాయతీరాజ్, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జోస్యం చెప్పారు. గురువారం హైదరాబాద్లో రోడ్డులు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కేటీఆర్ భేటీ అయ్యారు. పాలేరు ఉప ఎన్నికపై ఈ సందర్భంగా వారిరువురు చర్చించారు. ఈ భేటీ అనంతరం కేటీఆర్ విలేకర్లతో మాట్లాడుతూ.... ఈ ఉప ఎన్నికలో గెలుస్తామని సర్వేలు చెబుతున్నాయన్నారు. తుమ్మల అభ్యర్థిగా ఈ ఎన్నికల బరిలో నిలబడితే గెలుపు కాయం అని సర్వేలో వెల్లడైందన్నారు.
పార్టీలోని సీనియర్లతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఎన్నికల్లో వరుస విజయాలతో తెరాస దూసుకుపోతుందని సంతోషం వ్యక్తం చేశారు. అభివృద్ధిలో ఖమ్మం జిల్లా ముందుందని తెలిపారు. పాలేరు ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పాలేరు ప్రజలపై మాకు సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. విపక్షాలను ఎదుర్కొని మంచి విజయం సాధిస్తామని వెల్లడించారు. ఖమ్మం కార్పొరేషన్లో కూడా సంపూర్ణ అధిక్యాన్ని సాధించామన్నారు.
అదే ఫలితం పాలేరులో పునరావృతమవుతోందన్నారు. వివిధ రాజకీయ పార్టీలు ఎవరిని బరిలోకి దింపినా తెరాస పార్టీ మాత్రం చాలా బలంగా ఉందన్నారు. 2014 కంటే ఇప్పుడు ఖమ్మం జిల్లాలో చాలా బలపడ్డామన్నారు. 27న ప్లీనరీకి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అనుకోకుండా ఎన్నికల షెడ్యూల్ రావడం వల్ల ఎన్నికల సంఘం (ఈసీ) అనుమతి కోరమని చెప్పారు. ఈసీ పర్మిషన్ ఇస్తారన్న నమ్మకం ఉంది... ఖమ్మంలోనే ప్లీనరీ ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు.