= భారంగా మారుతున్న వంటగ్యాస్ సిలిండర్లు
= బ్యాంకు ఖాతాల్లో జమకాని ‘సబ్సిడీ నగదు’
= వారం,పదిరోజులంటూ కాలయాపన
= గగ్గోలు పెడుతున్న లబ్ధిదారులు
= నిత్యం గ్యాస్ ఏజెన్సీల వద్ద వాదులాట
సాక్షి,సిటీబ్యూరో: సైదాబాద్‌కు చెందిన రాజేశ్వర్ గతనెల 22న గ్యాస్ బుక్ చేయగా.. ఈనెల 2న సిలిండర్ ఇంటికి చేరింది. రూ.1096 చెల్లించి సిలిండర్ తీసుకున్నారు. సబ్సిడీ నగదు మాత్రం ఇప్పటివరకు బ్యాంకు ఖాతాలో జమకాలేదు.
కూకట్‌పల్లికి చెందిన సుజాత పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉంది. ఆధార్‌కార్డు జీరాక్స్ కాపీలను గ్యాస్ ఏజెన్సీలో, బ్యాంకులో రెండుచోట్లా ఇచ్చారు. ఇప్పటివరకు ఆధార్ కనెక్ట్ కాలేదు. అదేమంటే రేపు..మాపు అంటూ తిప్పుతున్నారు. ఇవీ ఒక్క రాజేశ్వర్, సుజాతల సమస్యలే కాదు..మహానగరంలో లక్షలాదిమంది గ్యాస్ వినియోగదారుల సమస్య.
కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నగదుబదిలీ పథకం ఆరంభంలోనే నవ్వులపాలవుతోంది. ఎంతో కసరత్తు చేసి దీన్ని ప్రారంభించామని ప్రకటించిన ప్రభుత్వం..గ్యాస్ వినియోగదారులకు పట్టపగలే చుక్కలు చూపుతోంది. ఫలితంగా గ్యాస్ సిలిండర్ ముట్టుకోవాలంటనే భయమవుతోందని పలువురు వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సబ్సిడీ నగదు ఖాతాలో జమ కాక పూర్తిస్థాయి రీఫిల్లింగ్ ధరలను భరించాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. కొందరు వినియోగదారులకు సబ్సిడీ నగదు అసలు బదిలీ కాకపోగా, మరికొందరికి అడ్వాన్‌గా బ్యాంకు ఖాతాలో జమఅయినా..రెండు,మూడోసారి మాత్రం తీవ్రజాప్యం జరుగుతోంది. చేసేదిలేక వినియోగదారులు సబ్సిడీ నగదు కోసం డీలర్ల, బ్యాంకుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు.
సబ్సిడీ కొందరికే..: వంటగ్యాస్‌కు నగదుబదిలీ అమలుతో ‘సబ్సిడీ’పై అయోమయం నెల కొంది. ఆధార్, బ్యాంకు ఖాతాలతో అనుసంధానమైనా రీఫిల్లింగ్‌పై సబ్సిడీ వస్తుందో రాదో? అర్థంకాని దుస్థితి ఏర్పడింది. సిలిండర్‌కు మాత్రం మార్కెట్ ధర చెల్లించక తప్పడంలేదు. గ్రేటర్‌లో ప్రస్తుతం వినియోగంలో 26.05 లక్షల ఎల్పీజీ కనెక్షన్లుండగా, అందులో 68 శాతం కనెక్షన్లు ఆధార్‌తో అనుసంధానమయ్యాయి. అందులో బ్యాంకు ఖాతాలతో అనుసంధానమైన కనెక్షన్లు 46 శాతానికి మించలేదు. ఆధార్,బ్యాంకు రెండింటితో అనుసంధానమైన వారు మాత్రమే సబ్సిడీకి అర్హులు కాగా, అందులో సైతం సగంమందికి మాత్రమే సబ్సిడీ నగదు జమవుతోంది.
బాధ్యులేవరు..?
ఆధార్, బ్యాంకు ఖాతాలతో అనుసంధానమై నా.. సబ్సిడీ నగదు బదిలీపై జవాబుదారితనం లేకుండాపోయింది. ఇటు డీలర్లు, అటు బ్యాం కర్లు తమకు సంబంధం లేదంటే తమకులేదని పట్టించుకోవడం లేదు. ఫలితంగా నగదు బదిలీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న రిజర్వుబ్యాంకు (ఆర్‌బీఐ) పరిధిలోని భారత జాతీయ చెల్లింపు సంస్థ(ఎన్‌పీసీఐ) అనుసంధానంలో సాంకేతిక తప్పిదాలే సమస్యకు కారణమని అధికారులు అంటున్నారు. వాస్తవంగా కేంద్రం సబ్సిడీ మొ తాన్ని ఆయిల్ కంపెనీలకు విడుదల చేస్తే.. కంపెనీలు ఆయా బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తాయి.
ఎన్‌పీసీఐ అనుసంధానం ఆధారంగా సబ్సిడీ నగదు వినియోగదారుల ఖాతాలో జమవుతుం ది. సిలిండర్ ఆన్‌లైన్‌లో బుక్ కాగానే సంబంధిత డీలర్ల ద్వారా ఆయా కంపెనీలు ఓఎంసీలకు అనుసంధానమై అక్కడ్నుంచి ఎన్‌పీసీఐలకు మ్యాపడ్ జరగాల్సి ఉంది. అయితే మ్యాప్‌డ్‌లో ఎలాంటి సాంకేతిక తప్పిదం జరిగినా.. నగదు బదిలీ పెండింగ్ పడిపోతోంది. ఇలా నగరంలో 52శాతంమంది వినియోగదారులకు నగదు బదిలీలో ఆటంకం తలెత్తినట్లు తెలుస్తోంది.
సీడింగ్ వరకే మా బాధ్యత..
ఎల్పీజీ ఆధార్‌తో అనుసంధానం వరకే మా బాధ్యత. అనుసంధానం కాకుంటే సమస్య పరిష్కారానికి కృషిచేస్తాం. నగదు బదిలీ బాధ్యత బ్యాంకర్లదే. తమ దృష్టికి వస్తే మాత్రం ఎల్‌డీఎం దృష్టికి తీసుకెళ్తున్నాం.
- పద్మ, చీఫ్ రేషనింగ్ ఆఫీసర్
సాంకేతిక కారణాల వల్లే..
సబ్సిడీ నగదు జమ కాకపోవడానికి సాంకేతిక కారణాలే. లేకుంటే వినియోగదారుడి బహుళ ఖాతాలకు అనుసంధానమైతే ఏదొకదానిలో సబ్సిడీ సొమ్ము పడుతుంది. ఆలస్యమైనా సబ్సిడీ సొమ్ము జమవుతుంది.
- భరత్‌కుమార్, లీడ్‌బ్యాంకు జనరల్ మేనేజర్
బ్యాంకులో డబ్బులు పడట్లే...
మొదటిసారి గ్యాస్ బుక్ చేయగానే అడ్వాన్స్‌గా సబ్సిడీ నగదు బ్యాంకు ఖాతాలో జమయ్యాయి. సిలిండర్ కూడా త్వరగా వచ్చింది. రెండోసారి బుకింగ్ చేసిన తర్వాత 15రోజులకు సిలిండర్ వచ్చినా..సబ్సిడీ నగదు జమకాలేదు. డీలర్‌ను అడిగితే పట్టించుకోవడం లేదు. సిలిండర్‌ను రూ.1120కి కొనుగోలు చేశా.. చాలా ఇబ్బందిగా ఉంది.
-శ్రీశైలం,సీతాఫల్‌మండీ