పోలీసు పదోన్నతులేవీ? | Where is police promotions? | Sakshi
Sakshi News home page

పోలీసు పదోన్నతులేవీ?

Published Tue, Aug 15 2017 2:02 AM | Last Updated on Sun, Sep 17 2017 5:31 PM

పోలీసు పదోన్నతులేవీ?

పోలీసు పదోన్నతులేవీ?

- నాన్‌ కేడర్‌ ఎస్పీ, కన్ఫర్డ్‌ ఐపీఎస్‌ హోదాల కోసం ఎదురుచూపులు
- ప్రమోటీ, గ్రూప్‌–1 పోలీసు అధికారుల్లో ఆందోళన
మూడేళ్లుగా పెండింగ్‌లోనే పదోన్నతుల ప్రక్రియ
కొరత ఉన్నా నిర్లక్ష్యం వహిస్తున్న పోలీసు శాఖ
సీనియారిటీ వివాదాలు, పోలీసు కేసులను చూపుతూ వాయిదా  
 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పోలీసు శాఖలో నాన్‌ కేడర్, కన్ఫర్డ్‌ ‘ఐపీఎస్‌’హోదా గందరగోళం కొనసాగుతోంది. పదోన్నతుల జాబితాలో ఉన్న అధికారులు, డైరెక్ట్‌ గ్రూప్‌–1 అధికారుల్లో నిరుత్సాహం రోజురోజుకూ పెరిగిపోతోంది. నాన్‌ కేడర్‌ ఎస్పీగా పదోన్నతి పొందాల్సిన ప్రమోటీ అధికారులు, ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తికాగానే కన్ఫర్డ్‌ ఐపీఎస్‌ కావాల్సిన గ్రూప్‌–1 అధికారులకు పదోన్నతులు మూడేళ్లుగా ఊరిస్తూనే ఉన్నాయి. కానీ పోలీసు ఉన్నతాధికారులు ఆశించిన స్థాయిలో స్పందించకపోతుండడం, ప్రభుత్వం నుంచి మొదలుకుని డీజీపీ కార్యాలయం వరకు ఎక్కడా పదోన్నతుల వ్యవహారంపై స్పష్టత రాకపోవడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏ బ్యాచ్‌ అధికారులు సామూహిక సెలవులో వెళ్లిపోతారోనన్న స్థాయిలో అసంతృప్తి కనిపిస్తోందని పోలీస్‌ శాఖలో చర్చ జరుగుతోంది.
 
ఎదురుచూపులే..
గ్రూప్‌–1 ద్వారా డీఎస్పీ అయిన అధికారులు ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి చేసుకుంటే.. వారికి కన్ఫర్డ్‌ ఐపీఎస్‌గా హోదా ఇవ్వడం కోసం కేంద్ర హోంశాఖకు జాబితా పంపాల్సి ఉంటుంది. ఇలా సర్వీసు పూర్తిచేసుకున్న అధికారులు రాష్ట్రంలో 11 మంది ఉన్నారు. నిబంధనల ప్రకారం ఉండాల్సిన ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తయి కూడా రెండేళ్లు గడుస్తోంది. స్టేట్‌ పోలీస్‌ సర్వీస్‌ (ఎస్‌పీఎస్‌) కన్ఫర్డ్‌ ఐపీఎస్‌ కింద 16 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇకపోతే ఎస్సై నుంచి ఇన్‌స్పెక్టర్, డీఎస్పీ, అదనపు ఎస్పీ నుంచి నాన్‌ కేడర్‌ ఎస్పీగా పదోన్నతి పొందేందుకు 60మందికి పైగా అధికారులు ఎదురు చూస్తున్నారు. వారిలో 54 నుంచి 56 ఏళ్ల మధ్య వయసున్న వారికి కన్ఫర్డ్‌ ఐపీఎస్‌ హోదా, మిగతావారికి నాన్‌ కేడర్‌ ఎస్పీ పదోన్నతులు కల్పించాలి. కానీ రాష్ట్ర విభజన నాటి నుంచి ఏ ఒక్కరికీ పదోన్నతి అందలేదు. సీనియారిటీ జాబితాపై కోర్టుల్లో కేసులు తేలలేదని, అప్పటివరకు తామేమీ చేయలేమని ఉన్నతాధికారులు చేతులెత్తేశారు.
 
కోర్టు కేసులతో..
వాస్తవానికి డీఎస్పీ, అదనపు ఎస్పీ సీనియారిటీ జాబితాను జీవో నంబర్‌ 108 పేరిట ఉమ్మడి రాష్ట్రంలో 2014, జూన్‌ చివరి వారంలో అప్పటి ఏపీ ప్రభుత్వం పేరిట జారీ చేశారు. ఇందులో అనేక తప్పులు దొర్లాయని.. జీవోను సవరించాలని ప్రమోటీ అధికారులు, గ్రూప్‌–1 అధికారులు ఒకరిపై ఒకరు కోర్టుకువెళ్లి స్టే తీసుకువచ్చారు. దీనితో రెండు రాష్ట్రాల మధ్య డీఎస్పీ, ఆపై ర్యాంకు అధికారులు విభజన ఇప్పటివరకు పూర్తి కాలేదు.
 
మూడేళ్లుగా ఏంచేస్తున్నట్టు?
ఐపీఎస్‌ అధికారులు ఏటా బ్యా చ్‌ల ప్రకారం పదోన్నతి పొందు తారు. కానీ కింది స్థాయిలో పనిచేసే అధికారుల పదోన్నతుల విషయంలో మాత్రం సీనియర్‌ ఐపీఎస్‌లు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర విభజన జరిగి మూడేళ్లయినా డీఎస్పీ, అదనపు ఎస్పీ సీనియారిటీ జాబి తాను సమీక్షించి, మరో జీవో తీసుకురా వడం గానీ, కన్ఫర్డ్‌ ఐపీఎస్‌ పదోన్నతుల కు జాబితా పంపించిందీ గానీ లేదు.
 
అన్నీ ఉన్నా..: రాష్ట్రంలో కొత్త జిల్లాలు, కమిషనరేట్లు, ప్రత్యేక విభాగాలు ఏర్పాట య్యాయి. దాంతో ఐపీఎస్‌లు, ఎస్పీల కొరత వేధిస్తోంది. అధికారుల కొరతపై కేంద్ర హోంశాఖకు విజ్ఞప్తి చేసున్నా రాష్ట్ర పోలీస్‌ శాఖ తన చేతిలో ఉన్న అధికా రుల పదోన్న తులను పూర్తిచేయకుండా నిర్లక్ష్యం వహిస్తుండడం గమనార్హం. ప్రస్తుతమున్న అధికారుల జాబితాను కేంద్రానికి పంపి, ఒత్తిడి తీసుకువస్తే 11 మంది ఐపీఎస్‌ అధికారులుగా పదోన్నతులు పొందుతారు. వారికి జిల్లా ఎస్పీలుగా, జోన్ల డీసీపీలుగా, ఇతర దర్యాప్తు విభాగాల్లో కీలక బాధ్యతలను అప్పగించ వచ్చు. అయినా ప్రభుత్వం స్పందించడం లేదు.
 
పదోన్నతుల్లో రాజకీయ ఒత్తిడి!
ఆరు నెలల కింద ఇన్‌స్పెక్టర్లకు డీఎస్పీలుగా పదోన్నతులు కల్పించేందుకు డీజీపీ కార్యాలయం ప్రక్రియ మొదలుపెట్టింది. కానీ హైదరాబాద్‌ సిటీ, రేంజ్, వరంగల్‌.. ఇలా సీనియారిటీ పంచాయితీ తో అడ్డంకులు వచ్చాయి. ఇవి చాలవన్నట్టు ఒక్కో బ్యాచ్‌ అధికారులు ఒక్కో మంత్రి ద్వారా, ఒక్కో ఎంపీ ద్వారా పోలీస్‌ శాఖలోని ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో డీఎస్పీ పదోన్నతుల వ్యవహారం అటకెక్కింది. ఈ పదోన్నతులు పూర్తిచేస్తే అదనపు ఎస్పీ, నాన్‌ కేడర్‌ ఎస్పీ, కన్ఫర్డ్‌ ఐపీఎస్‌ పదోన్నతులపై దృష్టి సారిస్తామని అటు హోంశాఖ, ఇటు డీజీపీ కార్యాలయం స్పష్టం చేస్తున్నాయి. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement