యాక్షన్ టీమ్ ఎక్కడ..?
యాక్షన్ టీమ్ ఎక్కడ..?
Published Mon, Aug 7 2017 12:46 AM | Last Updated on Wed, Apr 3 2019 8:51 PM
గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఎన్‌కౌంటర్ జరిగి ఏడాది
- ఇప్పటికి చిక్కిన వారంతా ‘సివిల్ క్రిమినల్సే’
- ఎన్‌కౌంటర్ తర్వాత కనిపించని యాక్షన్ టీమ్
- కొందరు ఖాకీలపైనే వేటు.. సేఫ్‌జోన్‌లో రాజకీయ నాయకులు
సాక్షి, హైదరాబాద్/యాదాద్రి: 2016 ఆగస్టు 8.. గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఎన్‌కౌంటర్ అయిన రోజు. ఇది జరిగి రేపటికి ఏడాది.. నాటి నుంచి పోలీసులు, సిట్ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 174 కేసులు నమోదు చేశారు. 120 మంది నయీమ్ అనుచరుల్ని పట్టుకున్నారు. మరోవైపు నయీమ్‌తో అంటకాగిన ఖాకీలపై వేటు పడినప్పటికీ.. రాజకీయ నాయకులు మాత్రం ‘సేఫ్‌జోన్’లోనే ఉండిపోయారు. నయీమ్ డెన్ల నుంచి స్వాధీనం చేసుకున్న డైరీలు ఎన్ని? వాటిలో ఉన్న వివరాలు ఏంటి? అనేది సైతం రహస్యంగా ఉండిపోయింది.
యాక్షన్ టీమ్ ఎక్కడ..?
నయీమ్ ఎన్‌కౌంటర్ తర్వాత పోలీసులు అరెస్ట్ చేసిన అనుచరులంతా అప్పటి వరకు వెలుగులోకి రాని ‘సివిల్ నేరగాళ్ల’నే వాదన ఉంది. ఈ ముఠాకు భిన్నమైన యాక్షన్ టీమ్ ఒకటి నయీమ్ కనుసన్నల్లో పని చేసింది. ప్రధానంగా మహబూబ్‌నగర్ జిల్లా మన్ననూరు కేంద్రంగా కార్యకలాపాలు నడిపిన, హైదరాబాద్‌లో జరిగిన పటోళ్ళ గోవర్థన్‌రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మావోయిస్టు శేషన్న ఈ టీమ్‌లో కీలకం. మహబూబ్‌నగర్, అచ్చంపేట, సిద్ధిపేట, నగరంలోని ముషీరాబాద్, పాతబస్తీలకు చెందిన మరో ఆరుగురు సభ్యులుగా ఉండేవారు. నయీమ్ ఆదేశాలతో హత్యలు, కిడ్నాప్‌లకు పాల్పడటం.. ఆపై షెల్టర్ జోన్స్‌కు వెళ్లిపోవడం వీరి పని. నయీమ్ ఎన్‌కౌంటర్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన ఈ టీమ్ ఏడాది గడిచినా పోలీసులకు చిక్కడం కానీ, అరెస్టు కావడం కానీ జరగలేదు.
ఇంకా దర్యాప్తులో అనేక కేసులు...
నయీమ్ ఎన్‌కౌంటర్ తర్వాత అనేక మంది బాధితులు ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదులు చేశారు. దీంతో హత్య, భూకబ్జా, కిడ్నాప్, బెదిరింపుల ఆరోపణలపై 174 కేసులు నమోదయ్యాయి. వీటికి సంబంధించి 120 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో అనేక మందికి బెయిల్ లభించింది. నయీమ్ భార్య హసీనాకు ఈ నెల 2న బెయిల్ రావడంతో సంరక్షణాలయంలో ఉన్న తన పిల్లల్ని సైతం ఆమె తీసుకువెళ్లింది. ఇన్ని కేసులు నమోదైనప్పటికీ అభియోగపత్రాలు దాఖలైన వాటి సంఖ్య తక్కువే. కేసుల విచారణ, చార్జిషీట్‌ల దాఖలులో జాప్యం జరుగుతోందన్న ఆరోపణలతో ఇటీవల భువనగిరి పట్టణ ఇన్‌స్పెక్టర్‌కు ఈ బాధ్యతలను పోలీసు శాఖ అప్పగించింది.
సేఫ్ జోన్‌లో రాజకీయ నాయకులు..
నయీమ్‌తో అనేక మంది పోలీసులు దందాల్లో పాల్గొన్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఏడాది మేలో ఇలా ఆరోపణలు ఎదుర్కొన్న ఐదుగురిపై సస్పెన్షన్ వేటు పడింది. మరో 20 మంది పోలీసులపై విచారణకు ఆదేశాలు వెలువడ్డాయి. ఆరోపణలు రుజువైతే కేసులుంటాయని అప్పట్లో అధికారులు చెప్పినా.. ఇప్పటికీ రుజువులు లభించలేదు. గ్యాంగ్‌స్టర్‌తో అంటకాగిన వారిలో రాజకీయ నేతలు సైతం ఉన్నారని ఆరోపణలు వినిపించాయి. పోలీసులపై సస్పెన్షన్ వేటు పడినా.. నేతలు మాత్రం ‘సేఫ్‌జోన్’లో ఉండిపోయారు. కొందరికి నోటీసుచ్చిన సిట్ తమ కార్యాలయానికి పిలిపించి విచారించింది. తమకు నయీమ్‌తో దోస్తీ తప్ప దందాలు లేవంటూ చెప్పడంతో ఆ కథకు బ్రేక్ పడింది.
Advertisement
Advertisement