
పులికి భద్రతేది?
జాతీయ మృగాన్ని కాపాడుకునే చర్యలు మృగ్యం
సాక్షి, హైదరాబాద్: ‘‘దేశంలో పులుల సంఖ్య పెరుగుతోంది.. ఇది మంచి పరిణామం..’’ - ఇటీవల కేంద్ర ప్రభుత్వం సంతోషంగా చేసిన ప్రకటన ఇది! మంచిర్యాల జిల్లా.. కోటపల్లి మండలం పిన్నారం గ్రామ సరిహద్దు.. ఓ గొయ్యి.. అందులో మూడేళ్ల వయసున్న మగపులి కళేబరం.. - పులుల సంరక్షణలో సర్కారు చిత్తశుద్ధిని వెక్కిరిస్తూ శనివారం వెలుగుచూసిన దారుణమిదీ!!
ఈ పులి దాదాపు 40 రోజుల క్రితమే ఈ ప్రాంతంలో సంచరిస్తోందని అటవీశాఖ అధికారులు గుర్తించారు. గతనెల 17న పంగిడి సోమారం ప్రాంతంలో ఏర్పాటు చేసిన కెమెరాలో ఈ పులి జాడ కనిపించింది. ఇది ఆదిలాబాద్ జిల్లా కవ్వాల్ పులుల అభయారణ్యానికి చేరువలోనే ఉంది. అప్పుడే అటవీ అధికారులు అప్రమత్తమై.. పులిని సంరక్షించే చర్యలు చేపట్టి ఉంటే బతికి ఉండేది. కానీ ఆ ప్రయత్నం చేయకపోవడంతో గ్రామస్తుల ఉచ్చుకు చిక్కి బలైంది.
పొరుగు రాష్ట్రం నుంచి వచ్చి..
రెండున్నరేళ్ల వయసు రాగానే తల్లి పులి పిల్లలను వాటి జీవితం అవి గడిపేలా దూరం చేస్తారుు. మూడేళ్ల వయసు రాగానే మగ పులి సొంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఇప్పుడు చనిపోరుున పులి కూడా తల్లితో వేరుపడి మహారాష్ట్ర సరిహద్దు దాటి పిన్నారం అటవీ ప్రాంతానికి వచ్చి ఉంటుందని అటవీ శాఖ పేర్కొంటోంది. ఇక్కడ తనకు అనువైన ప్రాంతాన్ని గుర్తించే క్రమంలో గత నెలన్నరగా అది సంచరిస్తోంది. ఈ క్రమంలో గతనెల 17న ఓ ఆవును చంపటంతో గ్రామస్తుల ద్వారా విషయం అటవీశాఖ అధికారుల దృష్టికి వచ్చింది. వెంటనే వారు ఆ ప్రాంతంలో కెమెరా ఏర్పాటు చేయగా దాని జాడలు అందులో రికార్డయ్యారుు. ఆ ప్రాంతం పులుల రక్షిత కేంద్రం కానందున దాని ప్రాణానికి ప్రమాదం పొంచి ఉందన్న విషయం వారు వెంటనే గుర్తించాల్సింది. కానీ అది జరగలేదు.
టైగర్ ట్రాకర్స్ ఏమయ్యారు?
అటవీశాఖ అధికారులు నిత్యం పులుల జాడల కోసం యత్నించాల్సి ఉంటుంది. ఇందుకోసం ‘టైగర్ ట్రాకర్స్’ను నియమించుకుంటారు. ఇది పులుల జాడ చెప్పే ఇన్‌ఫార్మర్ వ్యవస్థ. స్థానిక గిరిజనులను ఇందుకు ఏర్పాటు చేసుకుంటారు. వారికి ప్రతినెలా రూ.9 వేల వరకు చెల్లిస్తారు. పులుల అడుగుజాడలు గుర్తించే విధానంపై వారికి శిక్షణ ఇస్తారు. పులుల అడుగుజాడలు కనిపించగానే వారు అధికారులకు సమాచారమిస్తారు. వారు ఆ ప్రాంతంలో కెమెరాలు అమర్చి దాని గుర్తించి సంరక్షణ చర్యలు చేపడతారు. పులుల అభయారణ్యానికి దాన్ని తరలించే ప్రయత్నం చేస్తారు. ఈ పులి చనిపోరుున ప్రాంతానికి దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో కవ్వాల్ అభయారణ్యం ఉంది. కానీ పులి జాడ తెలిసిన తర్వాత కూడా ఆ ప్రాంతంలో టైగర్ ట్రాకర్స్‌ను ఏర్పాటు చేయలేదని తెలుస్తోంది.
సంరక్షణకు ఈ చర్యలేవి?
ఇందిర ప్రధానిగా ఉన్న సమయంలో అటవీశాఖ చట్టాలకు సవరణ చేశారు. అభయారణ్యాలు, వాటికి బఫర్, కోర్ ప్రాంతాల్లో జనావాసాలు ఉండరాదని నిర్ధారించారు. ఈ మేరకు అప్పట్లోనే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, కర్ణాటక తదితర ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల్లోని పలు ఊళ్లను మరోచోటుకు తరలించారు. కానీ తెలంగాణ ప్రాంతంలో దాన్ని అమలు చేయలేదు. ఇప్పటికీ కవ్వాల్ అభయారణ్యంలో అనేక గ్రామాలున్నాయి.
కవ్వాల్ రిజర్వ్ ఫారెస్టు పరిధిలో దాదాపు 100 మంది అటవీ సిబ్బంది విధుల్లో ఉన్నారు. వీరికి సమాన సంఖ్యలో టైగర్ ట్రాకర్స్‌గా ఇన్‌ఫార్మర్లు ఉండాలి. కానీ సంఖ్య నామమాత్రంగా ఉంది.
ఈ ప్రాంతంలో 300 కెమెరాలను వాడుతున్నా రు.వాస్తవానికి ఆసంఖ్యను 600కు పెంచాల్సి ఉంది. ఆ ప్రతిపాదన ఎప్పట్నుంచో పెండింగులోనే ఉంది.
ఏ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి?
మన దేశంలో మొత్తం 2,226 పులులు ఉన్నాయి. అత్యధిక పులులున్న రాష్ట్రం కర్ణాటక (406). ఆ తర్వాతి స్థానంలో ఉత్తరాఖండ్(340), మధ్యప్రదేశ్(308) ఉండగా.. తెలుగు రాష్ట్రాల్లో ఈ సంఖ్య 68గా నమోదైంది. వీటిలో 65 పులులు నాగార్జునాసాగర్ రిజర్వ్ ఫారెస్ట్, శ్రీశైలం రిజర్వ్ ఫారెస్టు పరిధిలోనే ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి.
విచారణకు ఆదేశం
పులిని హతమార్చడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరపాలని మంత్రి జోగు రామన్న అధికారులను ఆదేశించారు. బాధ్యులను వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. కాగా, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తున్నామని, దోషులకు ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని మంచిర్యాల కలెక్టర్ పేర్కొన్నారు.