‘వ్యవసాయ’ కారణాలతో ఆత్మహత్య చేసుకున్న వారి వివరాలివ్వండి
సాక్షి, హైదరాబాద్: రైతు ఆత్మహత్యలకు సంబంధించి అవాస్తవాలను, తప్పుడు సమాచారాన్ని సమర్పించినట్లయితే భారీ జరిమానా విధిస్తామని హైకోర్టు సోమవారం పిటిషనర్లకు తేల్చి చెప్పింది. వ్యవసాయపరమైన కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్న రైతుల వివరాలను కోర్టు ముందుంచాలన్న పిటిషనర్లను హైకోర్టు ఆదేశించింది. అలాగే రైతు ఆత్మహత్యల విషయంలో తిరస్కరించిన 188 దరఖాస్తులకు సంబంధించిన వివరాలను కూడా తమ ముందుంచాలని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టు ముందు అవాస్తవాలను, తప్పుడు సమాచారాన్ని ఉంచితే భారీ జరిమానాకు సిద్ధంగా ఉండాలని పిటిషనర్లను హెచ్చరించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
రైతుల ఆత్మహత్యల నివారణకు ఉభయ రాష్ట్రాలు ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేయడంతో పాటు రైతుల ఆత్మహత్యల నివారణకు 2006లో స్వామినాథన్ కమిటీ చేసిన సిఫారసులను అమలు చేసేలా ఉభయ రాష్ట్రాలను ఆదేశించాలని కోరుతూ వ్యవసాయ జన చైతన్య సమితి అధ్యక్షుడు రామయ్య యాదవ్, తెలంగాణ రాష్ట్రంలో జీవో 69 ప్రకారం రూ. లక్ష వరకు రైతులు తీసుకున్న పంట, బంగారు రుణాలను వన్ టైం సెటిల్‌మెంట్ కింద మాఫీ చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ హైదరాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త దొంతిరెడ్డి నర్సింహారెడ్డి, మరొకరు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాల్లో తనను ప్రతివాదిగా చేర్చుకోవాలంటూ ప్రొఫెసర్ కోదండరాం అనుబంధ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలను ఇప్పటికే పలుమార్లు విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం వాటిని మరోసారి విచారించి.. పైవిధంగా స్పందించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
తప్పుడు సమాచారాన్నిస్తే జరిమానా: హైకోర్టు
Published Tue, Jun 21 2016 1:54 AM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM
Advertisement